శాంతి ఒప్పందంపై నెతన్యాహూకు ట్రంప్ హామీ
వాషింగ్టన్ : ఇరాన్‌తో కుదుర్చుకునే ఒప్పందంలో టెహ్రాన్ అణు కార్యక్రమం, క్షిపణి సామర్ధ్యాలు, హిజ్బల్లాకు ఆ దేశం అందిస్తున్న మద్దతు వంటి కీలక అంశాల ప్రస్తావన ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు హామీ ఇచ్చారు. సీనియర్ దౌత్య వర్గాలను ఉటంకిస్తూ ఇజ్రాయిల్ హయోమ్ అనే హిబ్రూ దినపత్రిక ఈ విషయాన్ని తెలియజేసింది. ఇరాన్‌పై ఏ కారణాలతో అమెరికా-ఇజ్రాయిల్ సైనిక చర్యకు దిగాయో ఆ అంశాలను పరిష్కరించకుండా ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోబోమని నెతన్యాహూకు ట్రంప్ భరోసా ఇచ్చారని ఆ వర్గాలు తెలిపాయి. ట్రంప్, నెతన్యాహూ మధ్య శుక్రవారం జరిగిన టెలిఫోన్ సంభాషణలో శాంతి ఒప్పందం ప్రస్తావనకు వచ్చింది. ఇరాన్ తన వద్ద ఉన్న అణు సామగ్రి నిల్వలను వదులుకోవాలని, అణు-క్షిపణి కార్యక్రమాలపై ఆంక్షలకు అంగీకరించాలని, అప్పుడే ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారని ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం తెలియజేసింది. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలలో అనిశ్చితి చోటుచేసుకున్న తరుణంలో ఈ వార్త వెలువడింది. ఒప్పందానికి చేరువగా ఉన్నామని ట్రంప్ చెబుతుంటే తుది ఒప్పందం ఇంకా కుదరలేదని ఇరాన్ అంటోంది. చర్చలలో ఇజ్రాయిల్ భాగస్వామి కానప్పటికీ అమెరికా-ఇరాన్ మధ్య కుదిరే అవగాహనలో భద్రతాపరమైన కీలక ఆందోళనలకు పరిష్కారం లభించాలని కోరుకుంటోంది.
ఇజ్రాయిల్ ఏమంటోంది?
‘శుద్ధి చేసిన అణు సామగ్రిని తొలగించడం, అణు కార్యక్రమానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం, క్షిపణి ఉత్పత్తిని పరిమితం చేయడం, మధ్యప్రాచ్యంలో తన ఉగ్రవాద మిత్రులకు మద్దతును వెనక్కి తీసుకోవడం వంటి చర్యలకు ఇరాన్ కట్టుబడి ఉండాలి. ఈ అంశాలను తుది ఒప్పందంలో చేర్చేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని స్వాగతిస్తున్నారు’ అని నెతన్యాహూ కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో తెలిపింది. ఆ తర్వాత నెతన్యాహూ కూడా ఎక్స్‌లో విడిగా ఓ పోస్ట్ పెడుతూ ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయిల్ వైఖరిని పునరుద్ఘాటించారు. తాను, ట్రంప్ కలిసే ఉన్నామని చెప్పారు. ‘నేను ఇజ్రాయిల్ ప్రధానిగా ఉన్నంతకాలం ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండదు. ఈ విషయంలో నేను, ట్రంప్ ఏకాభిప్రాయంతో ఉన్నాం. ఇరాన్ అణు కార్యక్రమానికి వ్యతిరేకంగా జరుగుతున్న అంతర్జాతీయ పోరులో నేను గత 30 సంవత్సరాలకు పైగా ముందు వరుసలో ఉన్నాను. ఈ పోరాటమే లేకుంటే ఇరాన్ చాలా కాలం క్రితమే ఇజ్రాయిల్‌ను ధ్వంసం చేసేందుకు అణు బాంబును సముపార్జించుకొని ఉండేది’ అని చెప్పుకొచ్చారు.
వివాదాస్పద అంశాలు పరిష్కారమైతేనే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



