పార్లమెంట్‌కు జవాబుదారీగా ఉండే సంస్థతో పరీక్షలు నిర్వహించాలి
రాజ్యాంగ పరిరక్షణ వేదిక వెబినార్‌లో ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణ చూస్తున్న ఎన్‌టీఏను రద్దు చేయాలనీ, పార్లమెంట్‌కు జవాబుదారీగా ఉండే సంస్థ ద్వారా ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన వెబినార్‌లో ‘జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ-కేంద్ర ప్రభుత్వ బాధ్యత’ అనే అంశంపై లింబాద్రి మాట్లాడారు. 2024 లో, అంతకు ముందు విద్యార్థుల ప్రవేశ పరీక్షల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 101కి పైగా సూచనలు ఎన్‌ఏటీకి అందాయని గుర్తుచేశారు. 2026లో జరిగిన పరీక్షలకు ముందు ఎలాంటి జాగ్రత్త చర్యలూ తీసుకోలేదని ఎత్తిచూపారు. పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత లేకుండా చేశారనీ, విద్యను వ్యాపారీకరణ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కోచింగ్ సెంటర్ల పేరుతో పేద విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోచింగ్ సెంటర్ల నిర్వహకులకు పరీక్షా పేపర్లు ముందే ఎలా చేరుతున్నాయని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో కార్పొరేట్ సంస్థల వాళ్లు యథేచ్ఛగా లీకేజీలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. దీనికి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధత లేని సంస్థల ద్వారా పరీక్షలు నిర్వహించవద్దని వేడుకున్నారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా, కాంట్రాక్టు ఉద్యోగులను ఉపయోగిస్తుండాన్ని ఆక్షేపించారు. పరీక్షల నిర్వహణ ఎవ్వరికీ బాధ్యత లేకుండా పోయిందని వాపోయారు.
ఇప్పుడైనా రాధాకృష్ణన్ కమిటీ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, రూ. 2 వేల ఫీజు వసూలు చేస్తూ కనీసం సీసీటీవీలు లేని విద్యా సంస్థల్లో పరీక్షలు నిర్వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశ్నపత్రాల రవాణాలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కంప్యూటర్ల ద్వారా పరీక్ష నిర్వహణ చర్యలు తీసుకోవాలనీ, పరీక్షలను పాత విధానం ద్వారా రెండు సార్లు నిర్వహించి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా ఉన్నత విద్య అంటే ఇంజినీరింగ్, వైద్య విద్య కాకుండా, ఇతర రంగాలకు కూడా మళ్లించాలని విజ్ఞప్తి చేశారు. మార్కుల పద్ధతిని విడనాడి శాస్త్రీయ పద్ధతిలో ఆలోచన చేసే దిశగా విద్యా విధానం మారాలని ఆకాంక్షించారు. 1,35,000 సీట్లకు 23 లక్షలకు పైగా విద్యార్థులు పాల్గొనే ప్రవేశ పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని హితవు పలికారు. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోకుండా నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా, సంస్థలపైనా, ఆయా కోచింగ్ సెంటర్ల నిర్వహకులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యావిధానాన్ని మెరుగుపర్చేందుకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పరీక్షల నిర్వహణపైనా, ఉన్నత విద్యపైనా పలువురు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు చెప్పారు. కార్యక్రమంలో వేదిక నాయకులు కె. ఉమామహేశ్వరరావు, రమేష్ బాబు, డీఏఎస్‌వీ.ప్రసాద్, డీజీ నరసింహారావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.



