బెంగళూరు : దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం, పరీక్షల నిర్వహణలో అక్రమాలపై బెంగళూరులో ఆదివారం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) భారీ నిరసన ప్రదర్శనను నిర్వహించింది. ఈ నిరసనకు అక్కడి యువత పెద్ద ఎత్తున పాల్గొన్నది. కేంద్రంలోని మోడీ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సీజేపీ నిరసన ప్రదర్శనలో సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కేతో పాటు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అక్కడి యువతను ఉద్దేశిస్తూ ప్రసంగించిన ప్రకాశ్‌రాజ్.. కేంద్రంలోని మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నిరసన ప్రదర్శనకు సంబంధించిన ఓ వీడియోను ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ అధికారిక సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ‘‘ప్రజలు ఎన్నుకున్న నాయకులు తమ పని తాము సరిగ్గా చేయాలి. మీరేమో రాజకీయాలు చేస్తున్నారు, మమ్మల్ని ఉద్యోగాలు చేసుకోమంటున్నారు. కానీ ఇప్పుడు దేశంలో సమీకరణాలు మారిపోయాయి. ఈ దేశ యువత తమ హక్కుల కోసం తామే స్వయంగా పోరాడాలని నిశ్చయించుకున్నారు. దేశ యువతంతా ఒక్కటయ్యారు. రిటైర్మెంట్ వయసు దాటిపోయిన అంకుల్స్, ఆంటీలు ఇంకా ఈ దేశాన్ని పాలిస్తున్నారు. మీరు ఇక తప్పుకోండి. యువత అంతా తమ భవిష్యత్తు కోసం, తమ కలల కోసం రోడ్లపైకి వచ్చి పోరాడుతోంది’’ అని ప్రకాశ్ రాజ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
కుండపోత వర్షం
ఇటీవలే దేశ రాజధాని న్యూఢిల్లీలో సీజేపీ నిరసనలు హోరెత్తించాయి. దేశవ్యాప్తంగా యువత దృష్టిని ఆకర్షించింది. కేంద్రం వైఫల్యాలను సీజేపీ ఈ నిరసనతో బయటపెట్టింది. ఇప్పుడు ఈ నిరసనల పరంపర దక్షిణాదికీ పాకింది. ఆదివారం హైదరాబాద్, బెంగళూరులో సీజేపీ భారీ నిరసనలు చేపట్టింది. ఈ కార్యక్రమాలకు యువతతో పాటు నిరుద్యోగులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు వైఫల్యాలను ఎత్తి చూపారు. కాగా బెంగళూరులో జరిగిన నిరసన ప్రదర్శనలో కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వందలాది మంది యువతీ యువకులు, విద్యార్థులు నిరసన కోసం ఫ్రీడమ్ పార్కుకు తరలివచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా ఉద్యమం
సామాజిక మాధ్యమాల వేదికగా దేశంలోని యువతను ఏకం చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఈ ఉద్యమాన్ని నడిపిస్తోంది. గతంలో న్యూఢిల్లీలో భారీ నిరసన చేపట్టిన ఈ సంస్థ, నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించింది. దేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి
- Advertisement -
- Advertisement -



