Monday, June 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువర్షం వస్తే రోడ్లపై ఉండాల్సిందే

వర్షం వస్తే రోడ్లపై ఉండాల్సిందే

- Advertisement -

అవసరమైతే నేనూ వస్తా
ఉన్నతస్థాయి సమీక్ష‍లో అధికారులపై సీఎం రేవంత్‌ రెడ్డి ఫైర్‌
జూన్‌ 1న చెప్పినా… నిర్లక్ష్యంగా వ్యవహరించారు
మరోసారి అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు
ఇప్పటికైనా వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
వ్యవసాయ శాఖ అధికారులు సన్నద్ధం కావాలి
విత్తనాలు, యూరియా పంపిణీపై దృష్టి సారించాలని ఆదేశం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘వర్షాకాలం నేపథ్యంలో ఈనెల 1న నేను సమీక్ష నిర్వహించా. అనేక సూచనలు చేశా. అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించా రు. దాంతో ఈనెల 9న వర్షం వచ్చిన సమయంలో మున్సిపల్, పోలీసు అధికారుల మధ్య సమన్వ యం లోపించింది. ఈ పరిస్థితికి గల కారణాలను విశ్లేషించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి…’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. మరోసారి ఇలాంటి పరిస్థితి వస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. వర్షాలు వచ్చినప్పుడు అధికారులు, పోలీసులు అందరూ రోడ్లపైనే ఉండాలని ఆదేశించారు. అవసరమైతే తానూ వస్తానని తెలిపారు. ​వర్షాలు పడినప్పుడు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుం డా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించా రు. వర్షాకాల సన్నద్ధతపై ఆదివారం హైదరాబాద్‌‌ లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌‌రెడ్డి సమీక్ష‍ా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కోర్ అర్బన్ రీజియన్‌లో వర్షం కారణంగా ఈనెల 9న ఏర్పడిన పరిస్థితులపై ఆరా తీశారు. సైబరాబాద్‌ తోపాటు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్
జామ్ కావడంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మున్సిపల్, పోలీసు, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తం కాలేదన్నారు. ఆ శాఖ సూచనల మేరకు వర్షాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షం పడిన సమయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హైడ్రా, ట్రాఫిక్, జలమండలి సిబ్బందితో పాటు సివిల్ పోలీసులు కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాల్సిందేనన్నారు.

పోలీసు కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ రోడ్లపైకి రావాల్సిందేనని తేల్చిచెప్పారు. అవసరమైతే తానూ రోడ్డుపైకి వస్తానని చెప్పారు. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ఇకపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ విభాగంలోని ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డీజీపీకి సూచించారు. మానవ తప్పిదాల వల్ల సమస్యలు తలెత్తితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని హెచ్చరించారు. వర్షాల సమయంలో ఏర్పడే వాటర్ లాగింగ్ పాయింట్లు, బ్లాక్ స్పాట్లు, ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల డేటా ఆధారంగా అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు.
వర్షం కారణంగా పలు చోట్ల చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ పునరుద్ధరణ వెంటనే జరగాలని సూచించారు. అవసరమైన చోట్ల మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు. వర్షం సమయంలో విద్యుత్ సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో పనిచేసేలా చూడాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మాన్యువల్ ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ ఉండాలన్నారు. వర్షాకాలంలో ప్రాజెక్టుల వద్ద సంబంధిత ఇంజినీర్లు తప్పనిసరిగా స్థానికంగా ఉండాలని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రాజెక్టులను వదిలి వెళ్లే ఇంజినీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు సూచించారు.

విత్తనాలు, యూరియా పంపిణీపై దృష్టి సారించాలి
వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని సీఎం రేవంత్‌‌రెడ్డి సూచించారు. ముఖ్యంగా విత్తనాలు, యూరియా పంపిణీపై దృష్టి సారించాలన్నారు. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలని ఆదేశించారు. యూరియా స్టాక్ , పంపిణీ కోసం స్థానిక వ్యవసాయ అధికారిని బాధ్యుడిగా నియమించడంతో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. సన్న వడ్ల కోసం వ్యవసాయ శాఖ ప్రకటించిన ఎనిమిది రకాల విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

తాగునీరు కలుషితం కాకుండా చూడాలి
వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా చూడాలని సీఎం రేవంత్‌‌రెడ్డి అధికారులకు సూచించారు. గతంలో తాగునీటి కాలుషితం కారణంగా జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. నీటి కలుషితం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. వర్షాల కారణంగా నీటి నిల్వలు ఏర్పడి అపరిశుభ్ర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున శానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జలమండలి, వైద్య ఆరోగ్య శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌కు సీఎం రేవంత్‌‌రెడ్డి సూచించారు. పోలీసు, ట్రాఫిక్, ఫైర్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, వ్యవసాయ శాఖ, వాతావరణ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -