Tuesday, June 16, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రపంచాన్ని కదిలిస్తున్న జెన్-జీ చైతన్యం

ప్రపంచాన్ని కదిలిస్తున్న జెన్-జీ చైతన్యం

- Advertisement -

‘‘యువత తలుచుకుంటే ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది. యువత లేకుండా ఏ విప్లవం జరగబోదు’’ అంటాడు రష్యన్‌ ‌విప్లవకారుడు లెనిన్.
నేటి ప్రపంచ పరిస్థితులను చూస్తే మరింత సజీవంగా కనిపిస్తాయి. ఒకప్పుడు సమాజంలో మార్పు కోసం ఉద్యమాలు నెలల తరబడి, సంవత్స రాల తరబడి సన్నాహాలు చేసుకునేవి. ప్రజలను కూడగట్టడానికి సమావేశాలు, కరపత్రాలు, పత్రికలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన సాధనాలుగా ఉండేవి. కానీ డిజిటల్ యుగంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేడు ఒక మొబైల్ ఫోన్, ఒక వీడియో, ఒక హ్యాష్‌ట్యాగ్, ఒక సోషల్ మీడియా పోస్టు లక్షలాది మంది యువతను కదిలించే శక్తిగా మారింది. ఈ కొత్త చైతన్యానికి ప్రతీకగా నిలిచిన తరమే ‘‘జెన్-జీ’’.
1997 నుంచి 2012 మధ్య జన్మించిన తరం జెన్-జీగా పిలువబడుతోంది. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా, కృత్రిమ మేధస్సు వంటి సాంకేతిక పరిజ్ఞానాల మధ్య పెరిగిన తొలి ప్రపంచతరం వీరే. వీరు కేవలం సమాచార వినియోగ దారులు మాత్రమే కాదు, సమాచార సృష్టికర్తలు కూడా. గత తరాల కంటే భిన్నంగా ప్రపంచాన్ని ఒకే వేదికగా చూస్తున్నారు. తమ గ్రామంలో జరిగిన సంఘటనను ప్రపంచంతో పంచుకుంటూనే, ప్రపంచంలో ఎక్కడ జరిగిన అన్యాయాన్నైనా తమ సమస్యగా స్వీకరిస్తున్నారు.
నేటి యువతను అర్థం చేసుకోవాలంటే ముందుగా సోషల్ మీడియా పాత్రను అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు వార్తలను ప్రభుత్వాలు, కార్పొరేట్ మీడియా సంస్థలు నియంత్రించేవి. కానీ నేడు పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రతి యువకుడు ఒక మీడియా కేంద్రంగా మారాడు. ఒక వీడియోను అప్‌లోడ్ చేస్తే అది క్షణాల్లో ఖండాలు దాటుతోంది. ఒక ట్వీట్ ప్రభుత్వాలను వివరణ ఇవ్వాల్సిన పరిస్థితికి నెడుతోంది. ఒక హ్యాష్‌ట్యాగ్ లక్షల మందిని ఒకే అంశం చుట్టూ సంఘటితం చేస్తోంది.

సామాజిక శాస్త్రవేత్తలు నేటి డిజిటల్ సమాచా ర వ్యవస్థను ‘‘కాక్రోచ్‌ సోషల్ మీడియా’’గా అభివర్ణిస్తున్నారు. కాక్రోచ్‌ను పూర్తిగా నిర్మూలించ డం ఎంతకష్టమో, సోషల్ మీడియాలో వ్యాపించే సమాచారాన్ని అడ్డుకోవడం కూడా అంతే కష్టం. ఒక ఖాతాను మూసివేస్తే మరో వంద ఖాతాలు పుడతాయి. ఒక వెబ్‌సైట్‌ను నిషేధి స్తే మరో వేదిక ద్వారా సమాచారం వ్యాపిస్తుంది. అందువల్ల ప్రభుత్వాలు, అధికార వర్గాలు, కార్పొరేట్ శక్తులు సమాచార ప్రవాహాన్ని పూర్తిగా నియంత్రించడం క్రమంగా అసాధ్యంగా మారుతోంది.
ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ఉద్యమాలు దీనికి నిదర్శనం. వాతావరణ మార్పులపై యువత ఆందోళన ప్రపంచ రాజకీయాలనే ప్రభావితం చేసింది. స్వీడన్‌కు చెందిన విద్యార్థిని గ్రెటా థన్‌బర్గ్ ప్రారం భించిన నిరసన ఒక దేశ సరిహద్దుల్లోనే ఆగిపోలేదు. లక్షలాది మంది విద్యార్థులు ‘‘మా భవిష్యత్తును నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు’’ అంటూ వీధుల్లోకి వచ్చారు. వాతావరణ సంక్షో భాన్ని ప్రపంచ రాజకీయ చర్చల కేంద్రాంశంగా మార్చడంలో యువత కీలక పాత్ర పోషించింది.

అమెరికాలో జరిగిన బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం కూడా యువత శక్తిని ప్రపంచానికి చూపించింది. జాతి వివక్షకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ ఉద్యమం కొన్ని రోజుల వ్యవధిలోనే అనేక దేశాలకు విస్తరించింది. సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది యువత ఐక్యతను ప్రదర్శించారు. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య హక్కుల కోసం జరిగిన పోరాటాలు, లాటిన్ అమెరికా దేశాల్లో విద్యార్థి ఉద్యమాలు, యూరప్‌లో వాతావరణ ఉద్య మాలు, ఆసియా దేశాల్లో ప్రజాస్వామ్య హక్కుల కోసం జరిగిన ఆందోళనలు అన్నీ జెన్-జీ తరంలోని చైతన్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అయితే జెన్-జీ ఉద్యమాల ప్రత్యేకత కేవలం సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలోనే లేదు. నాయకత్వాన్ని చూసే విధానంలో కూడా ఉంది. గతంలో ఉద్యమాలకు ఒక నాయకుడు, ఒక పార్టీ, ఒక సంస్థ ఉండేది. కానీ నేటి ఉద్యమాలు వికేంద్రీకృత స్వభావాన్ని సంతరించుకున్నాయి. ఒక నాయకుడిని అరెస్టు చేసినా ఉద్యమం ఆగిపోదు. ఒక సంస్థను నిషేధించినా చైతన్యం నిలిచిపోదు. వేలాది మంది యువత స్వతంత్రంగా స్పందిస్తూ ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు.

ఈ తరానికి కళ కూడా ఒక శక్తివంతమైన ఆయుధంగా మారింది. పాటలు, పోస్టర్లు, కార్టూన్లు, మీమ్స్, షార్ట్ వీడియోలు, డిజిటల్ ఆర్ట్, వీధి నాటకాలు ఉద్యమాల్లో భాగమవుతున్నాయి. ఒకప్పుడు ప్రజా నాటకాలు, జానపద కళారూపాలు గ్రామాలను చైతన్యపరిచినట్లే, నేడు రీల్స్, వీడి యోలు, డిజిటల్ కళారూపాలు యువతను ప్రభావితం చేస్తున్నాయి. అయితే అసలు సూత్రం మారలేదు. ప్రజల జీవితాలను తాకిన కళ మాత్రమే సమాజంలో మార్పుకు దోహదపడుతుంది.
భారతదేశ యువత కూడా ఈ మార్పులను గమనించాల్సిన అవసరం ఉంది. ప్రపంచీకరణ, నిరుద్యోగం, విద్యా సంక్షోభం, పర్యావరణ విధ్వంసం, కుల వివక్ష, లింగ అసమానతలు వంటి సమస్యలు నేటి యువత ముందున్న సవాళ్లు. సోషల్ మీడియాలో స్పందించడం మాత్రమే కాకుండా ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను అర్థం చేసుకోవడం, సంఘటిత చర్యలకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా అవసరం. డిజిటల్ ప్రపంచం ఉద్యమాలకు ఇంధనం అందించవచ్చు, కానీ శాశ్వత మార్పు మాత్రం ప్రజల మధ్య జరిగే చైతన్య ప్రక్రియ ద్వారానే సాధ్యమవుతుంది.
నేటి ప్రపంచం కృత్రిమ మేధస్సు, డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థ, వాతావరణ సంక్షోభం, రాజకీయ అస్థిరత వంటి కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సవాళ్లను ఎదుర్కొనే తరమే జెన్-జీ. వారు కేవలం ఉద్యోగాల కోసం పోటీ పడే తరం కాదు. ప్రశ్నించే తరం. అన్యాయాన్ని ఎదిరించే తరం. సమానత్వాన్ని కోరుకునే తరం. భిన్నత్వాన్ని గౌరవించే తరం. సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాజిక మార్పు కోసం వినియోగించే తరం. ప్రపంచ చరిత్రలో ప్రతి యుగానికి ఒక ప్రత్యేక తరం ఉంటుంది. స్వా తంత్ర్య పోరాటాలకు ఒక తరం నాయకత్వం వహించింది. కార్మిక ఉద్య మాలకు మరో తరం దారిచూపింది. నేడు డిజిటల్ యుగంలో సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కులు, మానవ సమా నత్వం కోసం ముందుకు వస్తున్న తరం జెన్-జీ. ఈ తరం కేవలం భవిష్యత్తు పౌరులు కాదు; నేటి ప్రపంచాన్ని పునర్నిర్మిస్తున్న సామాజిక శక్తి.
అందుకే లెనిన్ చెప్పిన మాటలు మరోసారి గుర్తుకు వస్తాయి. యువతను కదిలించగలిగితే సమాజాన్ని కదిలించవచ్చు. యువత చైతన్యవంతమైతే దేశం చైతన్యవంతమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న
జెన్-జీ ఉద్యమాలు అదే సత్యాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి.
భూపతి వెంకటేశ్వర్లు,
9490098343

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -