అదే జరిగితే రాజకీయంగా ప్రమాదకర పరిస్థితి
అప్రమత్తంగా ఉండాలి
ఓట్లు తొలగించకుండా
జాగ్రత్త పడాలి
సర్‌పై టీపీసీసీ జూమ్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అనుమానాస్పదం పేరుతో ఓట్ల తొలగింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదే జరిగితే రాజకీయంగా ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని అప్రమత్తం చేశారు. సోమవారం టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సర్ పై జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎస్ఐఆర్ లో భాగంగా రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓట్లలో మెజారిటీ శాతం ఓట్లను ఏదో ఒక కారణంతో పక్కన పెట్టారని తెలిపారు.
2028 ఎన్నికలకు 2026 అక్టోబరులోనే ఓటర్ల జాబితా ఫైనల్ అవుతుందని గుర్తుచేశారు. 119 నియోజకవర్గాలలో ప్రతీ గ్రామంలో, ప్రతీ బూత్ లో బీఎల్ ఓలతో ముఖ్య నాయకులను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. వలసలు వెళ్లిన ఓటర్లు బీఎల్ఓలు వెళ్ళినపుడు నివాసంలో ఉండకపోవచ్చన్నారు. అలాంటి ఓట్లను తొలగించకుండా
జాగ్రత్త వహించాలని కోరారు.
ఈ నెల 20 లోగా జిల్లాల ఇంచార్జి మంత్రులు సంబంధిత పార్లమెంటు, అసెంబ్లీ ఇంచార్జిలతో సమీక్ష నిర్వహించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సంబంధిత ఇన్ చార్జి మంత్రులు జిల్లా స్థాయిలో మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎక్కడైనా సమస్య వస్తే సంబంధిత అసెంబ్లీ ఇన్ చార్జిని అప్రమత్తం చేయాలనీ, 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎక్కడైనా సమస్య వస్తే అది సంబంధిత పార్లమెంట్ ఇన్ చార్జి దే బాధ్యత అని స్పష్టం చేశారు. అసెంబ్లీ పరిధిలో అసెంబ్లీ ఇన్ చార్జి లు బాధ్యత వహించాలన్నారు. సర్ ను ఆషామాషీగా తీసుకోవద్దు…సీరియస్ గా తీసుకోవాల్సిందే..ఇది అత్యంత ప్రమాదకరమైన సందర్భం… అప్రమత్తంగా ఉండాలని కోరారు. పార్లమెంట్ ఇంచార్జ్ లు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో, అసెంబ్లీ ఇన్ చార్జిలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మానీటరింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలన్నారు. గాంధీ భవన్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి బూత్ లెవెల్ మానిటరింగ్ చేయాలని, ఏ రోజుకు ఆ రోజు రిపోర్ట్ తెప్పించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇనిచార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ సర్ విషయంలో దేశంలో జరిగిన పరిణామాలు గమనించాలని కోరారు.
ఓట్ మాప్, ఓట్ ఆన్ మాప్, డౌట్ ఓట్స్ అన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు. పాత ఓటర్ లిస్ట్ కు ఇప్పటి ఓటర్ లిస్ట్ కు చిన్న చిన్న పొరపాట్లు ఉన్న ఓట్ తొలగిస్తున్నారని తెలిపారు. ఓట్ ను నిలబెట్టడానికి అవసరమైన అన్ని పత్రాలు సిద్ధం చేసుకోవాలని కోరారు. అందుకోసం ప్రతి కార్యకర్త అవగాహన పెంచుకొని ప్రజల్లో చైతన్యం తేవాలి. ప్రధానంగా నిరక్షరాస్యులు, పేద వారు నష్టపోకుండా వారి ఓటు హక్కును కాపాడాలన్నారు.
మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ తో కలిసి బీజేపీ కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే ప్రమాదముందని అప్రమత్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కేవలం ఓట్ల తొలగింపుతోనే ఓడిపోయిందని ఉదాహరణగా చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సోషల్ మీడియా లో పరిశీలించి మన మద్దతు దారుల ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని, దీన్ని చాలా.లోతుగా పరిశీలించి ఒక్క ఓటు కూడా నష్టపోకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎస్ఐఆర్ పార్లమెంట్ ఇన్ చార్జిలు పాల్గొన్నారు.
అనుమానాస్పదం పేరుతో ఓట్ల తొలగింపునకు ప్రయత్నాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



