నవతెలంగాణ-హైదరాబాద్: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై 9 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 7 నుంచి విచారణ చేపట్టనుంది. ‘తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం శబరిమల సమీక్ష కేసుపై ఏప్రిల్ 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి విచారణ జరుపుతుంది. ఏప్రిల్ 22 వరకూ రెండు వారాల పాటు విచారణకు సమయం కేటాయిస్తున్నాం. రివ్యూ పిటిషనర్లు, వారికి సపోర్ట్ చేసే పార్టీ వాదనలను ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 9 వరకూ విచారిస్తుంది. రివ్యూను వ్యతిరేకించే వారి పిటిషన్లను ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 16 వరకూ వింటాం’ అని సుప్రీంకోర్టు తెలిపింది. రిజాయిండర్ సబ్మిషన్లు ఉంటే ఏప్రిల్ 21న వింటామని
పేర్కొంది.
కాగా, కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఓ ఏజ్ గ్రూప్ మహిళల ప్రవేశంపై ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. 10 ఏండ్ల లోపు బాలికలకు, 50 ఏండ్లు పైబడిన స్త్రీలకు మాత్రమే ఆలయంలోకి ప్రవేశముంటుంది. దీనికి 2018లో అత్యున్నత న్యాయస్థానం స్వస్తి చెప్పింది. అన్ని వయస్సుల వారికి ప్రవేశం కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ అంశాన్ని విస్తృత ధర్మాససానికి అప్పగించేందుకు 2020 ఫిబ్రవరి 10న సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలో సంబంధిత పార్టీలు తమ వాదనలను మార్చి 14 లోగా అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.



