Tuesday, June 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండీపీఓలు పని తీరు మార్చుకోండి

డీపీఓలు పని తీరు మార్చుకోండి

- Advertisement -

పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం సహించం
డీపీఓలకు మంత్రి సీతక్క హితవు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

జిల్లా, డివిజన్‌, మండల పంచాయతీ అధికారులు తమ పని తీరు మార్చుకోవాలని ఆ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క హెచ్చరించారు. పారిశుధ్య నిర్వహణ, నిధుల వినియోగం, వన మహోత్సవం, తాగునీటి భద్రత తదితర అంశాలపై సోమవారం హైదరాబాద్‌‌లోని బీఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయం నుంచి జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ‌నిర్వహించారు. పంచాయతీ అధికారులు ఫోటోలు క్యాప్చర్ చేయడం వరకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా పనిచేయాలని సూచించారు. వారి పనితీరుపై సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విధులను సక్రమంగా నిర్వర్తించని వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గ్రామాల్లో చేపట్టే పారిశుధ్య కార్యక్రమాలను పంచాయతీ సెక్రటరీ పనితీరు మాడ్యూల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. శాఖ కార్యదర్శి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి వారం గ్రామాలను సందర్శించి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు. ఇన్నాళ్లు గ్రామ పంచాయతీలకు పాలక మండళ్లు లేకపోవడంతో ఉద్యోగులపై ఒత్తిడి తక్కువగా ఉండేదనీ, పాలక మండళ్లు ఏర్పాటైన నేపథ్యంలో మరింత బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
పచ్చదనానికి ప్రతీకగా పల్లెలు
గ్రామీణ తెలంగాణను స్వచ్ఛత, పచ్చదనానికి ప్రతీకగా తీర్చిదిద్దేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సీతక్క అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, నీటి నిల్వ ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం, ప్రతిరోజూ సాయంత్రం ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. ప్రతి వారంలో ఒకరోజు “డ్రై డే” నిర్వహించి ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. మంచినీటి పైపుల లీకేజీలను నివారించడంతో పాటు ఓవర్ హెడ్ ట్యాంకుల క్లోరినేషన్‌ను క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. తాగునీటి నాణ్యత పరీక్షలను నిరంతరం చేయాలని సూచించారు. పల్లెలను పచ్చగా ఉంచేందుకు వివిధ విభాగాలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఈ నెల 18 నుంచి ప్రారంభ‌మ‌య్యే వ‌న‌మ‌హోత్స‌వాన్ని విజ‌యవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్య్రకమంలో పంచాయతీరాజ్‌ ‌శాఖ కమిషనర్‌ ‌దివ్య దేవరాజన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -