వ్యాప్తి చెందకుండా అరికట్టండి
ప్రతి శుక్రవారమూ డ్రైడే తప్పనిసరి
సీజన్ వ్యాధులపై సమీక్షలో మంత్రి దామోదర్ రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం కావాలనీ, అవి వ్యాప్తి చెందకుండా అరికట్టడంపై ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో సీజనల్ వ్యాధుల నివారణ, ప్రభుత్వాస్పత్రుల సన్నద్ధత, ప్రజారోగ్య పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, డయేరియా, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధుల ప్రస్తుత పరిస్థితి, జిల్లాల వారీ కేసులు, ప్రభుత్వ ఆస్పత్రుల సంసిద్ధత, మందులు, వ్యాధి నిర్ధారణ కిట్లు, దోమల నివారణ చర్యలు, ఫీవర్ సర్వేలు, ప్రజల్లో అవగాహన కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ రవీంద్ర నాయక్ మంత్రికి కూలంకషంగా వివరించారు. అనంతరం మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. వ్యాధులు ప్రబలిన తర్వాత చికిత్స అందించడం కంటే అవి వ్యాప్తి చెందకుండా ముందుగానే అరికట్టడం ఆరోగ్యశాఖ ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పనిచేస్తూ, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి ఆస్పత్రిలోనూ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, మెడిసిన్, రోగ నిర్ధారక కిట్లు, ఓఆర్ఎస్, ప్లేట్‌లెట్లు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవల్లో కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాధారణ జ్వరం, డెంగ్యూ, మలేరియా లేదా ఇతర సీజనల్ వ్యాధుల లక్షణాలతో వచ్చే ప్రతి వ్యక్తికి ఆలస్యం లేకుండా పరీక్షలు నిర్వహించి తక్షణ చికిత్స అందించాలని ఆదేశించారు.మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో దోమల నివారణ చర్యలను మరింత ముమ్మరం చేయాలన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ‘డ్రై డే’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. నిల్వ నీటి తొలగింపు, లార్వా నిర్మూలన, ఫాగింగ్, ప్రత్యేక ఫీవర్ సర్వేలు నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, హాస్టళ్లు, నిర్మాణ ప్రాంతాలు, అధిక ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలనీ, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి భద్రత, క్షేత్రస్థాయి పర్యవేక్షణను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు పూర్తిస్థాయిలో పనిచేస్తూ, ఎక్కడైనా వ్యాధుల క్లస్టర్లు ఏర్పడితే వాటిని గుర్తించి వెంటనే స్పందించి వ్యాప్తిని అరికట్టాలని ఆదేశించారు. ప్రతి జిల్లా వివరాలతో వీక్లీ రిపోర్ట్‌లు తయారు చేసి సమర్పించాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్‌కు సూచించారు. ప్రజలు కూడా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం, జ్వరం, ఇతర సీజనల్ వ్యాధుల లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. సమీక్షలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ నరేంద్ర కుమార్, జీహెచ్‌ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్, డాక్టర్ అమర్‌సింగ్ నాయక్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ డైరెక్టర్, మలేరియా విభాగం హెడ్ డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



