పట్టణ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు
నవతెలంగాణ-వర్ధన్నపేట
వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని వార్డుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి అధ్యక్షతన నిర్వహించిన తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ వర్ధన్నపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారుమున్సిపాలిటీ, ఇంజనీరింగ్, శానిటేషన్ పరిపాలనకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.1 కోటి 97 లక్షల 77 వేల నిధులకు సమావేశంలో వార్డు కౌన్సిలర్ లు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
ప్రతి వార్డు కౌన్సిలర్ తమ వార్డులో ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజల అవసరాలు, అభివృద్ధి ప్రతిపాదనలను సమావేశంలో వివరించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని శాఖల అధికారులు కౌన్సిల్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని, సమావేశాల్లో చర్చకు వచ్చిన అంశాలపై వెంటనే చర్యలు తీసుకునే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అమృత్ పథకం కింద గతంలో తవ్విన పైపులైన్ల పనులను సమీక్షించిన ఎమ్మెల్యే నాగరాజు గారు, ఎక్కడైనా పనులు అసంపూర్తిగా ఉన్నా లేదా మరమ్మతులు అవసరమైనా వాటిని వెంటనే పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేయడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ కార్యక్రమం ద్వారా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో దశలవారీగా అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సొంత ఇంటి కల నెరవేరేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి పేద కుటుంబం ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.వర్ధన్నపేట పట్టణ శివారు వరకు ఏర్పాటు చేసిన డివైడర్ల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రజల సూచనలు, అభిప్రాయాలు, రాకపోకల అవసరాలను పరిగణనలోకి తీసుకుని డివైడర్లలో అవసరమైన మార్పులు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
వర్ధన్నపేట పట్టణానికి మున్సిఫ్ కోర్టు మంజూరు కావడం చారిత్రాత్మక పరిణామం అన్నారు కోర్టుకు వచ్చే ప్రజలు, న్యాయవాదులు, సిబ్బందికి ఎలాంటి రాకపోకల ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా జడ్జి సూచనలు, అవసరాల మేరకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.మున్సిపాలిటీలో ఉద్యోగుల కొరత కారణంగా పారిశుద్ధ్య నిర్వహణకు ఇబ్బందులు తలెత్తకుండా అవుట్సోర్సింగ్ విధానంలో 10 మంది సిబ్బందిని నియమించేందుకు కౌన్సిల్లో ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. పట్టణ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో వైస్ చైర్మన్ నేతావాత్ శిభారాణి- రాజేందర్, కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, నునావత్ కమ్లి-కీమా, మలోత్ దేవేందర్ తిరుపెళ్లి వాణి- కుమారస్వామి, భూక్యా సునీత, గుజ్జ వీరన్న, చిలువేరు రమ, తుమ్మల అరుణ, తిరుపతి సురేష్, సిలువేరు కుమారస్వామి మరియు మున్సిపల్ కమిషనర్ జోనా, మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మీడియాకు మాత్రం అనుమతి ఇవ్వకపోవడంతో మీడియా ప్రతినిధులు ఆ సహన వ్యక్తం చేశారు.




