– ప్రభుత్వ పాఠశాలల్లో నూ ప్రైవేట్ స్థాయి ప్రచారం
– విద్యార్థుల, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ అడ్మిషన్లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
సాధారణంగా కొత్త విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రైవేట్ పాఠశాలలు ప్రత్యేక కౌన్సెలింగ్, తల్లిదండ్రులతో సమావేశాలు, ప్రవేశాల శిబిరాలు నిర్వహిస్తుంటాయి. అయితే అటువంటి వాతావరణమే నియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కనిపించడం విశేషం. పాఠశాల ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి, కొత్తగా చేరేందుకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఒకవైపు కూర్చోబెట్టి, ఉపాధ్యాయ బృందం మరోవైపు సమావేశమైంది. ఈ సందర్భంగా విద్యార్థుల వ్యక్తిగత వివరాలను నమోదు చేయడంతో పాటు వారి విద్యా స్థాయి, మేధో సామర్థ్యాన్ని (ఐక్యూ) అంచనా వేసే కార్యక్రమాన్ని చేపట్టారు.
అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ బోధన, క్రీడా సౌకర్యాలు తదితర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న అవకాశాలను వివరించి, అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు.
ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి. హరిత స్వయంగా పర్యవేక్షిస్తూ, ప్రతి విద్యార్థి సామర్థ్యానికి అనుగుణంగా విద్యా ప్రణాళిక రూపొందించేందుకు ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. పాఠశాలలో చేరే ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే లక్ష్యమని ఆమె తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు అశ్వారావుపేట జడ్పీ ఉన్నత పాఠశాల చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థుల ప్రతిభను ముందుగానే గుర్తించి, తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా మాట్లాడటం ద్వారా నాణ్యమైన విద్య అందించాలనే పాఠశాల యాజమాన్యం సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది.



