నవతెలంగాణ-హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సీఎం ప్రారంభించారు. స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. ఆరుట్ల పాఠశాలను పైలట్ ప్రాజెక్టుగా నిర్మించామని తెలిపారు. విద్యాశాఖపై ప్రభుత్వం రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రులకు అపోహలు ఉన్నాయని.. అందరి అపోహలు తొలగించేందుకే టీపీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
గత ప్రభుత్వం వర్గానికొక స్కూల్ పెట్టి కుల వ్యవస్థను ప్రోత్సహించిందని సీఎం విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ కులానికొక స్కూల్ పెట్టారన్నారు. కుల వ్యవస్థను నిర్మూలించేందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని వివరించారు. మెస్సీని హైదరాబాద్‌కు తీసుకువస్తే విమర్శలు చేశారని.. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేందుకే మెస్సీని తీసుకువచ్చామని తెలిపారు. మెస్సీ.. డ్రగ్స్ ముఠా లీడర్ కాదని, ఆర్థిక నేరగాడు కాదన్నారు. గత ప్రభుత్వం యూనిఫామ్‌లు ఇస్తే.. నెల రోజులకే చిరిగిపోయాయని విమర్శిస్తూ.. ఈ ప్రభుత్వం నాణ్యమైన వస్తువులతో విద్యా కిట్ ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.



