Thursday, June 18, 2026
E-PAPER
Homeమానవిఒక్క నిర్ణయం.. వందలాదిరైతు కుటుంబాల్లో ఆశాకిరణం

ఒక్క నిర్ణయం.. వందలాదిరైతు కుటుంబాల్లో ఆశాకిరణం

- Advertisement -

ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం, ఆధునిక విద్య ప్రభావంతో యువత ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లోనే భవిష్యత్తును చూసిన యువత, నేడు మెరుగైన విద్యా, ఉపాధి అవకాశాల కోసం పట్టణాలు, విదేశాల వైపు అడుగులు వేస్తున్నారు. చదువు పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, కార్పొరేట్ రంగంలో ఉన్నత స్థానం, విదేశీ విద్య లేదా విదేశీ ఉద్యోగం సాధించడమే చాలా మంది యువత లక్ష్యంగా మారింది. కానీ కొంతమంది యువత మాత్రం లక్షల్లో జీతాలు, విదేశీ అవకాశాలను సైతం వదులుకొని సొంత ఊరిలోనే ఉపాధి అవకాశాలు సృష్టించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ కోవకు చెందిన యువతి సంజనా రెడ్డి.

నిజామామాద్‌‌ జిల్లా చింతలూరు గ్రామానికి చెందిన సంజనా రెడ్డికి ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఎంతో మంది యువత కలగా భావించే ఆ అవకాశాన్ని ఆమె సులభంగానే అందుకుంది. అయినప్పటికీ ఆమె ఆ ఉద్యోగంలో చేరలేదు. మరింత ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనే లక్ష్యంతో IELTS, GRE పరీక్షలు రాసి అద్భుతమైన స్కోర్లు సాధించింది. ఆమె ప్రతిభ ఆధారంగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో అడ్మిషన్ కూడా లభించింది. అదే సమయంలో సంజనా మనసులో ఓ ప్రశ్న మెదిలింది. ‘ఉన్నత చదువుల కోసం నా సొంత ఊరిని, నా దేశాన్ని వదిలి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న విదేశానికి ఎందుకు వెళ్లాలి? నేను నేర్చుకున్న విజ్ఞానాన్ని, టెక్నాలజీని నా కళ్ల ముందే కనిపిస్తున్న సమస్యలను పరిష్కరించడానికి ఎందుకు ఉపయోగించకూడదు? నా గ్రామానికి, నా ప్రజలకు నేను ఏమి చేయగలను?’ అని తనను తాను ప్రశ్నించుకుంది.

ఉద్యోగాన్ని వదిలేసి
ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్న క్రమంలో సంజన మనసు తిరిగి తన మూలాల వైపు మళ్లింది. చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరు, పొలాల్లో చెమటోడ్చే రైతుల కష్టాలు, చదువుకుని అవకాశాల కోసం ఊరిని విడిచి వెళ్తున్న యువత, కుటుంబ భారం మోస్తూనే ఉపాధి కోసం ఎదురుచూస్తున్న మహిళల జీవితాలు ఆమె కళ్లముందు కదిలాయి. అమెరికా వెళ్లడం ఆమె భవిష్యత్తును మార్చవచ్చు. కానీ తన గ్రామంలో ఉండి ఏదైనా కొత్తది చేయగలిగితే తన భవిష్యత్తుతో పాటు ఎన్నో కుటుంబాల జీవితాలను మార్చవచ్చని ఆమెకు స్ఫురించింది. అంతే ఎంతోమంది కలలుగనే విదేశీ విద్య అవకాశాన్ని సైతం స్వచ్ఛందంగా వదులుకుంది. గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన సంజనకు రైతుల జీవితం కొత్త కాదు. చిన్నప్పటి నుంచి పొలాల్లో కష్టపడే రైతులను, పంట పండించిన తర్వాత కూడా సరైన ధర కోసం ఆందోళన చెందే కుటుంబాలను ఆమె దగ్గరగా చూసింది. వర్షాలు పడకపోతే ఒక బాధ, పంట బాగా పండినా గిట్టుబాటు ధర రాకపోతే మరో బాధ. రైతు ఎంత కష్టపడినా మధ్యలో దళారులే ఎక్కువ లాభపడుతున్నారనే వాస్తవం ఆమెను కలచివేసింది.

సోషల్‌ ‌మీడియా ద్వారా
‘రైతు పండించాలి… దళారి సంపాదించాలి’ అనే పరిస్థితిని మార్చాలని ఆమె సంకల్పించింది. తన చదువు, సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఆలోచనలను రైతుల సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఆమె నగరాల్లో ఉండే ప్రజలకు వ్యవసాయం గురించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రతిరోజూ పొలంలో రైతులు చేసే పనులు, వ్యవసాయ జీవన విధానం, రైతుల కష్టాలు, పంటల సాగుకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడం ప్రారంభించింది. అలా ఆమె పోస్ట్ చేసిన పసుపు సాగుకు సంబంధించిన ఒక వీడియో అనూహ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. ఆ వీడియో చూసిన వినియోగదారులు మార్కెట్‌లో దొరికే ఉత్పత్తుల కంటే నేరుగా రైతుల పొలం నుంచి వచ్చే స్వచ్ఛమైన పసుపును కొనుగోలు చేయాలని ఆసక్తి చూపించారు.

దళారుల ప్రమేయం లేకుండా
చాలామంది వైరల్ అవుతున్న వీడియోను ఆనందంగా చూసినప్పటికీ ఆ తర్వాత మరిచిపోతారు. కానీ సంజనా అందులో కూడా ఒక అవకాశాన్ని చూసింది. రైతుల కష్టానికి సరైన విలువ తీసుకురావడానికి ఇదే సరైన సమయమని భావించింది. ఆ ఆలోచనే ‘ఇందూరు ఫార్మ్స్’ అనే ఈ-కామర్స్ స్టార్టప్‌కు పునాది వేసింది. ఇందూరు ఫార్మ్స్ ద్వారా రైతుల నుంచి పంటలను నేరుగా కొనుగోలు చేసి, ఎటువంటి దళారుల ప్రమేయం లేకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వినియోగదారులకు చేరవేయడం ప్రారంభించింది. దీంతో రైతులకు మెరుగైన ధర లభించగా, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి.

గ్రామాల్లోనే అవకాశాలు
ఒక చిన్న గ్రామంలో మొదలైన ఈ ప్రయాణం నేడు తెలంగాణ సరిహద్దులను దాటి ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన మెట్రో నగరాలకు విస్తరించింది. ఒకప్పుడు అమెరికాకు వెళ్లాలని సిద్ధమైన ఆ యువతి నేడు తన గ్రామం నుంచే వందలాది మంది రైతుల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరవేస్తోంది. ఆమె కథ ఒక యువతి విజయగాథ మాత్రమే కాదు. ఉపాధి కోసం దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని, గ్రామాల్లోనే అవకాశాలను సృష్టించి విజయాన్ని సాధించవచ్చనే ధైర్యాన్ని సంజనా తన ఆచరణతో యువతలో నింపింది.
కోట దామోదర్, 9391480475

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -