Wednesday, February 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్‌ నూతన ప్రధానిగా తారిక్‌ రెహమాన్‌ ప్రమాణం

బంగ్లాదేశ్‌ నూతన ప్రధానిగా తారిక్‌ రెహమాన్‌ ప్రమాణం

- Advertisement -

హాజరైన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ

ఢాకా: బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ నేతృత్వంలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధామంత్రిగా తారిక్‌ రెహమాన్‌ ప్రమాణం చేశారు. జాతీయ పార్లమెంట్‌ భవనంలోని సౌత్‌ ప్లాజాలో బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ షాబుద్దీన్‌ స్వయంగా తారిక్‌ రెహమాన్‌ చేత ప్రమాణం చేయించారు. అనంతరం పలువురు మంత్రులతో కూడా ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమంలో భారత్‌ తరపున లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ పాల్గొన్నారు.

ప్రధాని మోడీకి బీఎన్‌పీ ఆహ్వానం పంపినప్పటికీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మక్రాన్‌ భారత్‌లో పర్యటిస్తుండటంతో ఆయన స్థానంలో ఓం బిర్లా ఢాకా వెళ్లారు. అంతకు ముందు నూతనంగా ఎన్నికైన ఎంపీల చేత బంగ్లాదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ నాసిరుద్దీన్‌ ప్రమాణం చేయించారు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్‌ 13వ సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్‌పీ పార్టీ భారీ విజయం సాధించింది. 297 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 209 చోట్ల బీఎన్‌పీ అభ్యర్థులు గెలుపొందారు.

మధ్యలోనే కాలేజీ విద్యను ఆపేసిన తారిక్‌
తారిక్‌ రెహమాన్‌ ఢాకా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ చదవడం కోసం జాయిన్‌ అయ్యారు. తొలుత న్యాయ విభాగంలో చేరి, ఆ తర్వాత అంతర్జాతీయ సంబంధాల విభాగంలో చేరారు. అయితే, గ్రాడ్యుయేషన్‌ రెండో ఏడాదిలో చదువును ఆపేశారు. ఆ తర్వాత టెక్స్‌టైల్స్‌, వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల వ్యాపారాలను ప్రారంభించారు. కాగా, తారిక్‌ రెహమాన్‌ 1994లో కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ జుబైదా రెహమాన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు జైమా జర్నాజ్‌ రెహమాన్‌.

క్రిమినల్‌, అవీనితి కేసులు నమోదు
2001-2006 మధ్య తన తల్లి ఖాలిదా జియా బంగ్లాదేశ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో తారిక్‌ ప్రభుత్వం లో కీలక పాత్ర పోషించారు. అలాగే ప్రభుత్వానికి సమాంతరంగా పాలన సాగిస్తున్నారనే ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అవామీ లీగ్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తారిక్‌పై క్రిమినల్‌, అవినీతి కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కొన్ని కేసుల్లో తారిక్‌ దోషిగా తేలారు. 2004లో షేక్‌ హసీనా చేపట్టిన ర్యాలీపై గ్రెనేడ్‌ దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది మృతి చెందారు. పదుల మంది గాయపడ్డారు. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తారిక్‌ రెహమాన్‌పై చర్యలు తీసుకుంది. ఈ దాడికి ప్రధాన సూత్రదారుడు తారిక్‌ అని తేలడంతో ఆయనకు జీవిత ఖైదు పడింది.

తారిక్‌ వ్యక్తిగత జీవితం
తారిక్‌ రెహమాన్‌ 1965 నవంబర్‌ 20న ఢాకాలో జన్మించారు. ఆయన తండ్రి బంగ్లాదేశ్‌ మాజీ అధ్యక్షుడు జియావుర్‌ రెహమాన్‌ కాగా, తల్లి మాజీ ప్రధాని ఖాలిదా జియా. తల్లిదండ్రులిద్దరూ రాజకీయ నాయకులే. పాకిస్తాన్‌ నుంచి వేరుపడాలని బంగ్లాదేశ్‌ 1971లో చేసిన విముక్తి పోరాటంలో బాలుడిగా ఉన్న తారిక్‌ భాగమయ్యారు. దీంతో తన తల్లి ఖాలిదా జియా, సోదరుడితో పాటు అరెస్టు అయ్యారు. అయితే పాక్‌ నుంచి బంగ్లాదేశ్‌ స్వాతంత్య్రం పొందిన తర్వాత జైలు నుంచి 1971 డిసెంబర్‌ 16న విడుదలయ్యారు.

17 ఏండ్ల తర్వాత స్వదేశానికి
ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన తారిక్‌ బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టారు. ఆరోగ్య చికిత్స కోసం 2008లో లండన్‌కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి అక్కడే నివసిస్తూ అక్కడి ఉంటూ బీఎన్‌పీ కార్యకలాపాలను చూసుకున్నారు. 2009లో బీఎన్‌పీ వైస్‌- చైర్మెన్‌ అయ్యారు. అలాగే 2018లో తన తల్లి, మాజీ ప్రధాని ఖాలిదా జియాకు జైలు శిక్ష పడడంతో బీఎన్‌పీ తాత్కాలిక చైర్మెన్‌గా వ్యవహరించారు. గతేడాది డిసెంబరులో తారిక్‌ తల్లి అనారోగ్యానికి గురవడంతో 17 ఏండ్ల తర్వాత మళ్లీ సొంతగడ్డకు వచ్చారు. తల్లి మరణానంతరం పార్టీ పగ్గాలను అందుకుని నెలల వ్యవధిలోనే విజయపథంలో నడిపారు.

ముందున్న సవాళ్లు
బీఎన్‌పీ అధికారంలోకి వచ్చినా సవాళ్లు ఎదుర్కోవటం అంత ఈజీకాదు. ఓవైపు ట్రంప్‌, మరోవైపు సరిహద్దు దేశాలతో మైత్రి దగ్గర నుంచి ఆర్థిక, రాజకీయ అంశాలు ముడిపడి ఉన్నాయి. అంతేకాదు నివురుగప్పిన నిప్పులా బంగ్లాదేశ్‌లో నిత్యం మండే మతచాంధసం లాంటి మరెన్నో కీలకఅంశాలు తారిక్‌కు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -