– ఉన్నత పాఠశాలలో వందకు మించని విద్యార్థులు
– మౌలిక సదుపాయాల లేమితో ఇబ్బందులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏడాదికేడాది విద్యా సంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వాలు గ్రామీణ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై తగిన దృష్టి సారించకపోవడంతో ప్రభుత్వ విద్య లక్ష్యాల సాధనలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. మండలంలోని అచ్యుతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీ హెచ్ ఎస్) ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 2007 – 2008 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన ఈ పాఠశాల నుంచి 2009 – 2010 లో తొలి పదో తరగతి బ్యాచ్ ఉత్తీర్ణులైంది.ఈ పాఠశాలకు అచ్యుతాపురం, దిబ్బగూడెం (ఎ), మద్ది కొండ,కొత్త నారంవారిగూడెం ప్రాథమిక పాఠశాలలు ఫీడింగ్ స్కూళ్లు గా ఉన్నాయి.
ప్రస్తుతం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిపి కేవలం 69 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు.గత విద్యా సంవత్సరంలో 79 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 18 మంది పదో తరగతి పూర్తి చేశారు.ఈ ఏడాది 6వ తరగతిలో కేవలం 6 మంది, 10వ తరగతిలో 13 మంది మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
గత ఏడాది ఫీడింగ్ స్కూళ్ల నుంచి 34 మంది ఐదో తరగతి విద్యార్థులు బయటకు వచ్చినప్పటికీ, వారిలో చాలా మంది ఈ ఉన్నత పాఠశాలలో చేరలేదు. 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల విద్యార్థులకు రవాణా భత్యం అందకపోవడం, మరోవైపు ప్రైవేట్ పాఠశాలల బస్సులు గ్రామాలకే రావడం వల్ల విద్యార్థులు అశ్వారావుపేటలోని ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో చేరికలు పెరగడం లేదు.
2024 లో పాఠశాలకు ఐదు కంప్యూటర్లు, ప్యానెల్ బోర్డు లు అందించినప్పటికీ కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ ను నియమించలేదు. ఫలితంగా అవి వినియోగానికి నోచుకోకుండా ఉన్నాయి. మండల కేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పాఠశాలలో నెట్‌వర్క్ సమస్యలు తీవ్రంగా ఉండటంతో డిజిటల్ విద్య బోధనకు ఆటంకం ఏర్పడుతోంది.
అలాగే పాఠశాల ఆటస్థలం మధ్యగుండా విద్యుత్ లైన్ వెళ్లడం, మూడు విద్యుత్ స్తంభాలు ఉండటం విద్యార్థుల భద్రతకు ముప్పుగా మారింది. క్రీడలు నిర్వహించే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యలపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాహినా బేగం ను వివరణ కోరగా, ఫీడింగ్ స్కూళ్ల విద్యార్థులకు రవాణా సౌకర్యం లేదా ట్రావెల్ అలవెన్స్ కల్పిస్తే చేరికలు పెరుగుతాయని తెలిపారు. అలాగే కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ ను నియమించి, నిరంతరాయ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తే విద్యార్థులకు డిజిటల్ విద్యను సమర్థంగా అందించవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాల తొలగింపు, ఆటస్థలం భద్రతా చర్యలు చేపట్టాలని కూడా ఆమె కోరారు.



