ఫ్రాన్స్‌లో ట్రంప్…టెహ్రాన్‌లో పెజెష్కియాన్ నేడు అధికారికంగా సంతకాల కార్యక
(నవ తెలంగాణ – జనరల్ డెస్క్)
మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఉద్దేశించిన శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్ అధ్యక్షులు సంతకాలు చేశారు. దీంతో ఒప్పందం తక్షణమే అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధిని ఇరాన్ తెరుస్తుంది. అదే విధంగా ఇరాన్ ఓడరేవులపై విధించిన దిగ్బంధాన్ని అమెరికా ఎత్తివేస్తుంది. ఇరాన్ పునర్నిర్మాణానికి 300 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందుతుంది. ఇరాన్‌పై విధించిన అన్ని రకాల ఆంక్షలను అమెరికా తొలగిస్తుంది. అయితే శాంతి ఒప్పందంలో ఇరాన్ అణు కార్యక్రమం ప్రస్తావన లేదు. దీనిపై కాల్పుల విరమణ అమలులో ఉండే 60 రోజుల కాలంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ-7 సదస్సుకు హాజరైన సందర్భంగా ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ ఒప్పందం ‘ఆర్థిక విపత్తు’ను తప్పిస్తుందని ఆయన చెప్పారు. అయితే ఇరాన్‌తో తుది ఒప్పందం కుదరని పక్షంలో ఆ దేశంపై బాంబు దాడులు తప్పవని హెచ్చరించారు. శాంతి ఒప్పందంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ బుధవారమే సంతకం చేశారని టెహ్రాన్ ధృవీకరించింది. అయితే అమెరికాపై తన అపనమ్మకం అలాగే ఉండిపోయిందని, టెహ్రాన్ వేలు ట్రిగ్గర్ పైనే ఉన్నదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, చర్చల ప్రతినిధి మహమ్మద్ బాఘర్ ఘలీబఫ్ చెప్పారు. అమెరికా కనుక తన హామీలను నెరవేర్చని పక్షంలో తామూ వాటికి కట్టుబడి ఉండబోమని స్పష్టం చేశారు.
వర్సైల్లెస్ ప్యాలెస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ఇచ్చిన విందు సందర్భంగా ఎంఓయూ హార్డ్ కాపీపై ట్రంప్ సంతకం చేశారు. ఆ సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆయన వెనకే నిలుచుని ఉన్నారు. ట్రంప్ సంతకం చేసిన ఒప్పంద పత్రాన్ని అధికారులు ఇరాన్‌కు పంపారు. దానిపై టెహ్రాన్‌లో పెజెష్కియాన్ సంతకం చేస్తుండగా తీసిన చిత్రాలను ఇరాన్ ప్రభుత్వ మీడియా ఐఆర్ఎన్ఏ ప్రచురించింది. ఇరాన్ కోరిక మేరకు ఎంఓయూను ఆంగ్లంలోనూ, ఫార్సీ భాషలోనూ ముద్రించారు. ‘సంతకం చేశాను’ అని ట్రంప్ విలేకరులకు చెప్పారు. శాంతి ప్రణాళిక ప్రపంచవ్యాప్త మాంద్యాన్ని నివారిస్తుందని ఆయన తెలిపారు. జీ-7 సదస్సు జరిగిన ఎవియన్-లెస్-బెయిన్స్లోని రిసార్టులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్థిక విపత్తును చూడాలని తాను అనుకోవడం లేదని చెప్పారు. యుద్ధం కొనసాగితే అదే సంభవించి ఉండేదని అన్నారు. ‘నాకు తెలిసింది ఒక్కటే. మనం శాంతికి అవకాశాల గురించి మాట్లాడిన ప్రతిసారీ స్టాక్ మార్కెట్ రాకెట్ మాదిరిగా దూసుకుపోయింది. రాజీకి రాలేము వంటి ప్రతికూల విషయాలు చెప్పినప్పుడు మాత్రం అది భారీగా పతనమైంది’ అని తెలిపారు. మాక్రాన్ ఇచ్చిన విందుకు హాజరైన అనంతరం ట్రంప్ వాషింగ్టన్ బయలుదేరారు.
ఒప్పందంలోని అంశాలు ఇవే
14 పాయింట్లతో కూడిన శాంతి ఒప్పంద పత్రాన్ని అమెరికా ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు విడుదల చేశారు. ‘అమెరికా-ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ అవగాహనా ఒప్పందం’ పేరిట విడుదల చేసిన ఈ పత్రంలో హార్ముజ్ జలసంధిని తెరవడం, ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను తొలగించడం, తదుపరి సాంకేతిక చర్చలలో ఇరాన్ అణు కార్యక్రమం ప్రస్తావన వంటి కీలక అంశాలు ఉన్నాయి. ‘హార్ముజ్‌ను వెంటనే తెరవడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. అణు ధూళిని నాశనం చేయడానికి ఇరాన్ కట్టుబడి ఉండేలా చేస్తుంది. ఇరాన్ తన సత్ప్రవర్తనను మెరుగుపరచుకుంటే దానిని మరింత సంపన్న దేశంగా మార్చగలిగిన ఆర్థిక, ఆంక్షల ఉపశమనాన్ని అందించడానికి మాకు అవకాశం ఇస్తుంది’ అని అమెరికా అధికారి తెలిపారు. ఒప్పంద పత్రంపై నేడు అధికారికంగా సంతకాలు జరుగుతాయి. ఒప్పందం యొక్క తుది నిబంధనలపై చర్చలు జరపడానికి నిర్దేశించుకున్న 60 రోజుల గడువు కూడా నేడే ప్రారంభం అవుతుంది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణను పొడిగిస్తుందని అమెరికా అధ్యక్షభవనం అధికారి ఒకరు చెప్పారు. ఇది ‘పనితీరు ఆధారిత’ ఒప్పందమని ట్రంప్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. కాగా ఒప్పందంలోని అంశాలు ఇలా ఉన్నాయి….
ఆంక్షల ఎత్తివేత
ఇరాన్‌పై విధించిన అన్ని రకాల ఆర్థిక ఆంక్షలను అమెరికా ఎత్తివేస్తుంది. ఐరాస భద్రతా మండలి తీర్మానాలలో చేర్చిన, అమెరికా ఏకపక్షంగా అమలు చేసిన ఆంక్షలు కూడా తొలగిపోతాయి. అయితే దీనికి నిర్ణయించిన కాలపరిమితిపై స్పష్టత లేదు. తుది ఒప్పందంలో దీనిపై అంగీకారం కుదురుతుందని, తదుపరి చర్చల సందర్భంగా ఈ సమస్యకు వెంటనే పరిష్కారం కనుగొనాలని ఇరు పక్షాలు భావిస్తున్నాయని ఒప్పంద పత్రంలో తెలిపారు.
అణ్వాయుధాలకు ఇరాన్ స్వస్తి
ఒప్పందం ప్రకారం ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోదు. లేదా వాటిని కొనుగోలు చేయదు. ఇరాన్ వద్ద ఇప్పటికే ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఇరు దేశాలు నిర్వహిస్తాయి. అయితే దీనిపై స్పష్టత లేదు. తదుపరి చర్చలలో పరస్పర అంగీకారంతో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. అయితే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షణలో ఈ నిల్వలను ఉంచుతారని ఒప్పంద పత్రంలో తెలియజేశారు.
సంఘర్షణలకు ముగింపు
లెబనాన్‌లో ఇజ్రాయిల్ దాడులు సహా అన్ని రకాల సైనిక చర్యలు తక్షణమే, శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇకపై ఏ పక్షం కూడా సైనిక చర్యలు ప్రారంభించదు. ఒకరినొకరు బెదిరించుకోవడం ఉండదు. లెబనాన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడతారు. తుది ఒప్పందం ఘర్షణలకు శాశ్వత ముగింపు పలుకుతుంది.
ఆంతరంగిక వ్యవహారాలను గౌరవించడం
ఇరు దేశాల ప్రాదేశిక సమగ్రతలను, సార్వభౌమత్వా లను అమెరికా, ఇరాన్ దేశాలు పరస్పరం గౌరవించుకుంటాయి. ఒకరి అంతర్గత వ్యవహారాలలో మరొకరు జోక్యం చేసుకోరు.
తుది ఒప్పందం కోసం 60 రోజుల కాలపరిమితి
అమెరికా, ఇరాన్ దేశాలు గరిష్టంగా 60 రోజుల పాటు చర్చలు జరిపి తుది ఒప్పందం కుదుర్చుకుంటాయి. అయితే పరస్పర అంగీకారంతో ఈ కాలపరిమితిని పొడిగించుకోవచ్చు. తుది ఒప్పందం కోసం నిర్దేశించుకున్న 60 రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
అమెరికా దిగ్బంధనం ఎత్తివేత
ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే నౌకాయాన దిగ్బంధనాన్ని ఎత్తివేసే ప్రక్రియను అమెరికా ప్రారంభిస్తుంది. ఇరాన్ ఓడరేవులపై విధించిన ఆటంకాలు, అడ్డంకులు కూడా తొలగిపోతాయి. దిగ్బంధనం ఎత్తివేత 30 రోజులలో పూర్తవుతుంది. ఈ సమయంలో హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఎన్ని నౌకల రాకపోకలను అనుమతిస్తుందో ఇరాన్ ఓడరేవుల నుంచి అమెరికా కూడా అన్ని నౌకలనే అనుమతిస్తుంది. తుది ఒప్పందంపై సంతకం చేసిన 30 రోజులలో ఇరాన్ పరిసరాల నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకుంటుంది. అంటే ఫిబ్రవరి 28న ఘర్షణలు ప్రారంభం కావడానికి ముందున్న స్థితికి అమెరికా సైన్యం చేరుకుంటుంది.
హార్ముజ్‌లో నౌకల రాకపోకలు ప్రారంభం
ఎంఓయూపై సంతకాలు జరిగిన వెంటనే హార్ముజ్ జలసంధి మీదుగా వాణిజ్య నౌకలు ఎలాంటి రుసుము లేకుండా సురక్షితంగా ప్రయాణించేం దుకు ఇరాన్ తన శాయశక్తులా ఏర్పాట్లు చేస్తుంది. అంటే సాంకేతిక-సైనిక అడ్డంకులను, మందుపాతరలను తొలగించడం వంటి చర్యలు తీసుకుంటుంది. హార్ముజ్‌లో వాణిజ్య నౌకల రాకపోకలు వెంటనే ప్రారంభమవుతాయి. దీర్ఘకాలంలో హార్ముజ్ నిర్వహణపై విస్తృత ఒప్పందం కుదుర్చుకోవడానికి ఒమన్, ఇతర గల్ఫ్ దేశాలతో కలిసి ఇరాన్ పనిచేస్తుంది.
ఇరాన్ పునర్నిర్మాణానికి నిధులు
ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి కోసం కనీసం 300 బిలియన్ డాలర్లతో పరస్పర అంగీకారయోగ్యమైన నిర్ణయాత్మక ప్రణాళికను అమెరికా, ప్రాంతీయ భాగస్వా ములు రూపొందిస్తారు. తుది ఒప్పందం జరిగిన 60 రోజులలో దీనికి సంబంధించిన యంత్రాంగంపై అంగీకారానికి వస్తారు. అయితే ఈ ప్రణాళికకు ఆయా ప్రభుత్వాలు నిధులు సమకూర్చవు. ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతోనే అది నడుస్తుంది.
అణు కార్యక్రమంపై యధాతథ స్థితి
శుద్ధి చేసిన యురేనియం నిల్వల వ్యవహారాన్ని పరిష్కరించే వరకూ ఇరాన్ అణు కార్యక్రమం విషయంలో యధాతథ స్థితిని కొనసాగిస్తారు. అంటే అమెరికా కొత్తగా ఆంక్షలేవీ విధించదు. ఈ లోగా చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులకు, బ్యాంకింగ్ లావాదేవీలకు, రవాణా వంటి ఇతర అనుబంధ సేవలకు మినహాయింపు ఇస్తుంది.
స్తంభింపజేసిన నిధులపై…
స్తంభింపజేసిన ఆస్తులను ఇరాన్‌కు పూర్తిగా అందుబాటులోకి తేవడానికి అమెరికా సంసిద్ధత వ్యక్తం చేసింది. తదుపరి చర్చల సమయంలaో దీనికి సంబంధించిన విధివిధానాలపై అంగీకారానికి వస్తారు.
పర్యవేక్షణ-తుది చర్చలు
ఎంఓయూ అమలును, తుది ఒప్పందం అమలును పర్యవేక్షించడానికి అమెరికా, ఇరాన్ దేశాలు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాయి. అయితే ఆచరణలో ఇది ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టత లేదు. తుది ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం విధిగా ఆమోదించాల్సి ఉంటుందని ఒప్పంద పత్రం స్పష్టం చేసింది.



