క్యూసీఐఎల్ రూ.600 కోట్ల పెట్టుబడులు
నాగ్‌పూర్ : ప్రముఖ హెల్త్‌కేర్ నెట్‌వర్క్ క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ (క్యూసీఐఎల్) మహారాష్ట్ర లోని నాగ్‌పూర్‌లో 350కి పైగా పడకల సామర్థ్యంతో అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ కేర్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. మంగళవారం నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో మహా మెట్రో, క్యూ సీఐఎల్ ప్రతినిధులు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ (ఎల్‌ఓఏ)ను మార్చుకున్నారు. కస్తూర్చంద్ పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో సుమారు రూ. 600 కోట్ల పెట్టుబడితో నిర్మించ నున్న ఈ ఆస్పత్రి ద్వారా కార్డియాక్, ఆంకాలజీ, న్యూరో సైన్సెస్ వంటి విభాగాల్లో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
నాగ్‌పూర్ వంటి నగరాల్లో అత్యాధునిక వైద్య మౌలిక సదుపాయాలను పెంచడం ద్వారా మెట్రో నగరాలకు మించి నాణ్య మైన వైద్యాన్ని అందించడమే తమ వ్యూహమని క్యూసీఐఎల్ ఎండీ వరుణ్ ఖన్నా పేర్కొన్నారు. ‘మెట్రో భాగస్వామ్యంతో టైర్-2 నగరాల్లో మల్టీ స్పెషాలిటీ సామర్థ్యాన్ని పెం చడం మా ప్రాధాన్యత. ఈ ఆస్పత్రి క్లినికల్ ప్రమాణాలను పెంచడమే కాకుండా, విదర్భ ప్రాంత ఆర్థిక, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడుతుంది.” అని కేర్ హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ పవన్ కుమార్ పేర్కొన్నారు.



