నీట్ రీఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు
పిటిషన్ విచారణ విస్తృత ధర్మాసనానికి బదిలీ
న్యూఢిల్లీ : ఈనెల 21న నీట్ యూజీ-2026 పరీక్షను మళ్లీ నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఆదేశాలకు సుప్రీంకోర్టు నిరాకరించింది. స్టే విధించలేమని స్పష్టం చేసింది. బదులుగా పిటిషన్ విచారణను ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలపై ఇప్పటికే విచారణ జరుపుతున్న విస్తృత ధర్మాసనానికి పరిశీలన కోసం పంపింది. వచ్చే నెల 17న ఈ పిటిషన్ విచారణ జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు రానున్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాత్, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. హెల్త్ సర్వీసెస్ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ మంగళ కోహ్లి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. మే 3న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేయాలని ఎన్టీఏ తీసుకున్న నిర్ణయాన్ని ఇందులో సవాల్ చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించింది. ఇప్పటికే ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించిన పలు పిటిషన్లు జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తోంది. ఆ బెంచ్ ముందుకు జులై 17న ఈ అంశం విచారణకు రానుంది. అందువల్ల ప్రస్తుతం రీటెస్ట్‌ను నిలిపివేసేలా ఎలాంటి ఆదేశాలూ ఇవ్వకుండా, ఈ పిటిషన్‌ను కూడా అదే బెంచ్ పరిశీలనకు సుప్రీంకోర్టు పంపింది. కాగా రద్దయిన నీట్ యూజీ పరీక్ష ఈనెల 21 నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
‘టెలిగ్రామ్’ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్
నీట్ రీ-ఎగ్జామ్ ముందు మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌ను తాత్కాలికంగా నిషేధించాలన్న కేంద్రం నిర్ణయంపై ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. టెలిగ్రామ్, కేంద్ర ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకున్నట్టు కోర్టు తెలిపింది. అంతకుముందు డార్క్‌వెబ్‌కు టెలిగ్రామ్ మరో రూపంగా మారిందని ఆరోపిస్తూ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. నేరస్తులు, తీవ్రవాద ముఠాలు, ఇతర ప్రమాదకర శక్తులు విచారణ సంస్థల కండ్లు గప్పేందుకు ఆ యాప్‌ను వినియోగించడం పెరిగిందని తెలియజేసింది. లీకైన పరీక్ష పత్రాలు, ఉగ్రవాద భావజాలం, తప్పుడు సమాచారం వ్యాప్తి, చిన్నారుల లైంగిక దోపిడీ, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు టెలిగ్రామ్ అడ్డాగా మారిందని ఆరోపించింది. టెలిగ్రామ్ ప్రయివసీ పాలసీ, దాని ఫీచర్లు నేర నెట్‌వర్క్‌లను ఆకర్షిస్తున్నాయని కేంద్రం వివరించింది. ప్రయివసీ సెట్టింగ్‌ల ద్వారా యూజర్ల ఫోన్ నంబర్లు, ఐడీలను దాచడం వల్ల నేరస్తుల గుర్తింపు కష్టమవుతోందని వెల్లడించింది. టెలిగ్రామ్ వల్ల సైబర్ ఫ్రాడ్ జరిగిందన్న ఫిర్యాదులు భారీగా పెరిగాయని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా తెలిపినట్టు కేంద్రం పేర్కొంది.
మనీలాండరింగ్ సొమ్మును బదిలీ చేసేందుకు ఉపయోగించే మ్యూల్ బ్యాంక్ ఖాతాల క్రయవిక్రయాలకు టెలిగ్రామ్‌ను వినియోగిస్తున్నట్టు ఆరోపించింది. మాల్వేర్ సేవలు, గూగుల్ ప్లే ప్రొటెక్ట్ బైపాస్ టూల్స్, ఆర్థిక అప్లికేషన్ల ముసుగులో మాల్వేర్ను వ్యాప్తి చేస్తున్నారని ఉదహరించింది. టెలిగ్రామ్‌పై కేంద్రం తాత్కాలికంగా బ్యాన్ విధించిన రెండు రోజులకు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈనెల 21న నీట్ రీటెస్ట్ జరగనుండగా.. దానిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈనెల 22 వరకు టెలిగ్రామ్‌పై తాత్కాలికంగా బ్యాన్ విధించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ నేపథ్యంలో ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది.అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్న 16 లక్షల మంది ఈనెల 21న జరగనున్న నీట్-యూజీ 2026 పరీక్షకు 16 లక్షల మంది అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను విజయవంతంగా డౌన్లోడ్ చేసుకున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ లేకుండానే అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌కు ప్రక్రియను ఎన్టీఏ సులభతరం చేసింది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ గతంలో చాలా మంది అభ్యర్థులకు అనేక సమస్యలను సృష్టించింది. ఈనెల 14న అడ్మిట్ కార్డులు విడుదలైన విషయం విదితమే.
స్టే విధించలేం
- Advertisement -
- Advertisement -



