Friday, June 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజులై ఒకటి నుంచి 11 శాతం ఫిట్‌మెంట్‌

జులై ఒకటి నుంచి 11 శాతం ఫిట్‌మెంట్‌

- Advertisement -

ఆర్టీసీ ఉద్యోగులకు సర్కారు శుభవార్త గుర్తింపు సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి
30 నెలల ప్రజాపాలన సమీక్ష‍లో
మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాలు
త్వరలో దక్షిణ భారతదేశ ర
వాణా శాఖ మంత్రులు ,
ప్రిన్సిపల్ సెక్రెటరీలు , కమిషనర్లు ,
ఆర్టీసీ ఎండీలతో ప్రత్యేక భేటి


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. ఆర్టీసీ సమ్మెలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు జులై 1 నుంచి 11 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2023-26 మధ్యకాలంలో ప్రజా పాలన ప్రభుత్వం రూ.1,078 కోట్ల వ్యయంతో 2,815 నూతన బస్సులను కొనుగోలు చేసిందని తెలిపారు. అలాగే ఏటూరు నాగారం, పెద్దపల్లి ప్రాంతాల్లో రెండు కొత్త డిపోలను మంజూరు చేసినట్టు తెలిపారు.తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిని ప్రాథమిక వైద్య సేవల స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రిగా అభివృద్ధి చేసినట్టు తెలిపారు. బ్రెడ్ విన్నర్ స్కీమ్, మెడికల్ ఇన్వాలిడేషన్ కింద మొత్తం 1,137 కారుణ్య నియామకాలు చేసినట్టు చెప్పారు. వీరిలో 888 మంది కండక్టర్లు, 10 మంది డ్రైవర్లు, 43 మంది శ్రామిక్‌లు, 196 మంది కానిస్టేబుళ్లు ఉన్నారని వివరించారు.ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల సీఎస్ఎస్ బకాయిలు రూ.1,096.90 కోట్ల నుంచి రూ.862 కోట్లకు తగ్గాయననీ, పీఎఫ్ బకాయిలు రూ.2,018.15 కోట్ల నుంచి రూ.1,714.39 కోట్లకు తగ్గాయని తెలిపారు.

అలాగే ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ బకాయిలను కూడా రూ.493.02 కోట్ల మేర తగ్గించినట్టు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న అర్హులైన కారుణ్య నియామకాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వీసు నుంచి తొలగించబడిన 490 మంది ఉద్యోగుల్లో ఇప్పటికే 244 మందిని విధుల్లోకి తీసుకున్నామనీ, మిగిలిన కేసులను త్వరితగతిన పరిశీలించాలని సూచించారు. మహాలక్ష్మీ పథకం మహిళల ఆర్థిక సాధికారతపై చూపుతున్న ప్రభావాన్ని అధ్యయనం చేసి ఫీడ్‌బ్యాక్ నమోదు చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాలను 553 బస్సులకు యజమానులుగా చేసి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన అందిస్తున్న నేపథ్యంలో వారి అభిప్రాయాలను కూడా సేకరించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,050 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయనీ, అవి ఏ రూట్లలో నడుస్తున్నాయి, లాభదాయక రూట్లు ఏవి, నష్టాలు వస్తున్న మార్గాలు ఏవి అనే అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద 10,173 బస్సులు, 38,128 మంది ఉద్యోగులు ఉండగా, ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణించి సుమారు 61 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని తెలిపారు.

నాగర్‌కర్నూల్, పెద్దపల్లి బస్ డిపో పనులు వేగవంతం చేయాలని, ములుగు బస్ స్టేషన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో వేములవాడ, కథలాపూర్ బస్ స్టేషన్‌లకు శంకుస్థాపన నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మునుగోడు, చండూరు, మర్రిగూడ బస్ స్టేషన్‌ల పునరుద్ధరణ పనులు, నాంపల్లి బస్ స్టేషన్ స్థల పరిశీలనపై సమీక్ష నిర్వహించారు. మధిర బస్ స్టేషన్ పనులు వేగవంతం చేయాలనీ, మహబూబ్‌నగర్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా బస్ స్టేషన్‌కు శంకుస్థాపన జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.హుజూర్‌నగర్, కోదాడ, నాగర్‌కర్నూల్ బస్ స్టేషన్‌లకు త్వరలో శంకు స్థాపనలు నిర్వహించాలని సూచించారు. గోదావరిఖని బస్ స్టేషన్‌ను వాణిజ్యపరంగా మరింత సమర్థవంతంగా వినియోగిం చుకోవాలని చెప్పారు. మంచిర్యాల, చెన్నూరు, మెదక్, బెల్లంపల్లి , పరకాల , ములక నూరు, ధర్మపురి ,మక్తల్ బస్ స్టేషన్ లను అధికారులు ప్రత్యేకంగా విజిట్ చేసి అవసరమైన చోట బస్ స్టేషన్ ల నిర్మాణం, రెనోవేషన్ పై నివేదిక అందించాలని ఆదేశించారు.ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్పీఎస్-2021కు సంబంధించిన 11 శాతం ఫిట్‌మెంట్‌ను జూలై 1 నుంచి అమలు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు.

ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల అధికారితో చర్చించి సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు.ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి శంకర్ కుటుంబానికి ఉద్యోగుల నుంచి సేకరించిన నిధులతో త్వరలో రూ.1 కోటి చెక్కు అందజేయడంతో పాటు కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.ఉద్యోగుల ప్రమాద బీమా పథకం కింద ఇప్పటివరకు 11 కేసులను పరిష్కరించి ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి చొప్పున చెక్కులు అందించినట్టు తెలిపారు. కాలుష్య నియంత్రణ, ఈవీ విధానం, ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణపై దక్షిణ భారత రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు, ఆర్టీసీ ఎండీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్ స్టేషన్‌ల అభివృద్ధికి అవసరమైన భూ బదలాయింపు ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి,ఈడి లు ,ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -