ప్రాంతీయ పార్టీలను చీల్చి లబ్ది పొందేలా బీజేపీ కుతంత్రం
ఆ పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను దూరం చేస్తున్న తీరు
పరోక్షంగా ఎన్డీఏకు మద్దతిచ్చేలా పాచికలు – ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కమలం పార్టీ
న్యూఢిల్లీ : దేశ రాజకీయాలను బీజేపీ భ్రష్టు పట్టించేస్తోంది. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలను చీలుస్తూ, వాటి ఉనికి లేకుండా చేయాలని చూస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ, అనైతిక రాజకీయాలకు పాల్పడుతోంది. ఇందుకు ఇటీవల దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలే తాజా ఉదాహరణ. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం తర్వాత.. ప్రతిపక్షానికి పరిమితమైన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో ముసలం మొదలైంది. ఆ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు ప్రత్యేక గ్రూపుగా ఏర్పడగా, దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు అధినేత్రి మమత నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఇక మహారాష్ట్రలో ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) రెండోసారి చీలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కమలం పార్టీ ‘ఆపరేషన్ లోటస్’.. యూపీలోని ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)ని కూడా తాకనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చీలిక రాజకీయాలనేవి కేంద్రంలోని బీజేపీ ఆడిస్తున్న ఆటలో భాగమని విశ్లేషకులు చెప్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో తృణమూల్‌కు కష్టకాలం
పశ్చిమ బెంగాల్‌ను మూడు సార్లు పరిపాలించి, బలమైన నాయకురాలిగా ఎదిగిన మమతా బెనర్జీకి అక్కడి రాజకీయాలు ఆత్మరక్షణలో పడేశాయి. ఆమె నేతృత్వంలోని టీఎంసీ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధికారాన్ని కోల్పోవడం, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగాయి. దీని తర్వాతే టీఎంసీకి కఠిన పరిస్థితులు మొదలయ్యాయి. బీజేపీ ఇక్కడే తన ‘విభజన’ రాజకీయాలను మొదలు పెట్టింది. దీంతో టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు రెబల్‌గా మారారు. అంతేకాదు.. టీఎంసీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 60 మంది కూడా మమతకు ఎదురు తిరిగారు. పార్టీ బహిష్కృత నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలో వారంతా ఒక ప్రత్యేక వర్గంగా ఏర్పడ్డారు. తమదే అసలైన టీఎంసీగా చెప్పుకుంటున్నారు. అయితే టీఎంసీ నుంచి బయటకు వచ్చిన ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు దగ్గరయ్యే విధంగానే అడుగులు వేయడం చూస్తే కమలం పార్టీనే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఈ పరిణామాలు పశ్చిమ బెంగాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగానూ తీవ్ర సంచలనంగా మారాయి. టీఎంసీని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది.
మహారాష్ట్రలో ఉద్దవ్ శివసేన రెండోసారి..
ఇక 2022లో చోటు చేసుకున్న పరిణామాలు ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనను ఆయన నుంచి దూరం చేశాయి. కమలం పార్టీ ప్రత్యేక దృష్టిని సారించి మరీ.. శివసేనను విజయవంతంగా చీల్చగలిగింది. దీంతో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో మెజారిటీ ఎమ్మెల్యేలు శివసేనను వీడారు. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో ఏక్నాథ్ షిండే సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో శివసేన పార్టీ పూర్తిగా ఏక్నాథ్ షిండే చేతిలోకి వెళ్లింది. దీంతో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో శివసేన (యూబీటీ) ప్రత్యేక వర్గంగా ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ అవే పరిస్థితులను శివసేన (యూబీటీ) ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభలో ఆ పార్టీకి ఉన్న 9 మంది ఎంపీల్లో ఆరుగురు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు.
తాము షిండే శివసేనలో విలీనం కావాలని నిర్ణయించినందున లోక్‌సభలో తమకు వేరుగా సీట్లు కేటాయించాలని వారు లోక్‌సభ స్పీకర్ కార్యాలయానికి లేఖ పంపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ పార్టీకి చెందిన కీలక నాయకులు సంజయ్ రౌత్, అర్వింద్ సావంత్, అనిల్ దేశాయ్‌లు బుధవారం ఉదయమే లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలిశారు. తమ పార్టీ నుంచి ఎవరైనా వచ్చి ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని కోరితే అంగీకరించొద్దని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఆ పార్టీ ముఖ్యనేత సంజయ్ రౌత్ విలేకర్లతో మాట్లాడుతూ ఒకవేళ ఎవరైనా పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం పార్లమెంటరీ పార్టీ సమావేశం పెట్టామనీ, దానికి అందరూ రావాలని విప్ జారీచేశామని చెప్పారు. గైర్హాజరైనవారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఆరుగురు గైర్హాజరయ్యారు. ముగ్గురు మాత్రమే సమావేశానికి వచ్చారు. వీరిలో రాజాభౌ వాజే, అర్వింద్ సావంత్, అనిల్ దేశాయ్‌లు మాత్రమే ఉద్ధవ్ వెంట ఉన్నారు. దీంతో సమావేశానికి హాజరు కాని ఆ ఆరుగురు ఎంపీలపై ఎలాంటి చర్యలుంటాయోనన్న విషయంలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తున్నది.
యూపీలో సమాజ్‌వాదీపై బీజేపీ గురి
సార్వత్రిక ఎన్నికలకు లిట్మస్ టెస్ట్‌గా భావించే యూపీ ఎన్నికలు వచ్చే ఏడాది షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి. అత్యధిక ఎంపీ స్థానాలు కలిగి ఉన్న ఈ రాష్ట్రం రాజకీయంగా అన్ని పార్టీలకు చాలా కీలకం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 80 ఎంపీ స్థానాల్లో 71 స్థానాలు, 2019లో 62 స్థానాలు గెలిచిన బీజేపీకి కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఘోరంగా విఫలమైంది. ఇక్కడ కేవలం 33 స్థానాలు గెలుపొంది ఎస్పీ (37) తర్వాత రెండో స్థానంలో ఉంది. దీంతో బీజేపీ కేంద్రంలో విస్పష్టమైన మెజారిటీని సాధించలేకపోయింది. లోక్‌సభలో ప్రస్తుతం సంఖ్యాపరంగా ఎస్పీ మూడోస్థానంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలుసమీపిస్తున్న వేళ బీజేపీ అధిష్టానం యూపీపై ప్రత్యేక దృష్టిని సారించింది. దీంతో టీఎంసీ, ఉద్ధవ్ శివసేనల తర్వాత సమాజ్‌వాదీ పార్టీ బీజేపీ తదుపరి టార్గెట్‌గా మారనున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, మరో మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎస్పీ నుంచి 26 మంది ఎంపీలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని కేశవ్ ప్రసాద్ మౌర్య చెప్పగా.. సమాజ్‌వాదీ పార్టీలోనూ త్వరలో ముసలం మొదలు కానుందని ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ప్రకటించడం సంచలనం రేపింది. ఆ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్ కేంద్రం హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారనీ, బీజేపీలో చేరడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉందని ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ఎక్స్‌లో చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ భయపెట్టి పార్టీలను చీల్చడానికి బీజేపీ నిరంతంరం పని చేస్తూనే ఉంటుందని అన్నారు. దీంతో యూపీలో ఏం జరగబోతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.



