Friday, June 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాలను త్వరతగతిన పూర్తి చేయాలి

మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాలను త్వరతగతిన పూర్తి చేయాలి

- Advertisement -

క్రైస్తవుల సంక్షేమానికి రూ.50 కోట్లు
ముస్లీంలకు కొత్త స్మశాన వాటికలు
స్థలసేకరణకు కలెక్టర్లకు ఉత్తర్వులు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్దిష్ట కాలపరిమితితో పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో ఆయన మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ తో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. క్రైస్తవుల సంక్షేమానికి ప్రత్యేకంగా రూ.50 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. మైనారిటీల కోసం కొత్తగా స్మశాన వాటికల కోసం స్థలాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ల ను ఆయన ఆదేశించారు. వక్ఫ్ భూముల పరిరక్షణకు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. ఉర్దూ అకాడమీ గోల్డెన్ జూబ్లీ (స్వర్ణోత్సవాల) సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ సంస్కృతిని ప్రతిబింబించేలా పెద్ద ఎత్తున ‘ముషాయిరా’ (కవి సమ్మేళనాలు) నిర్వహించనున్నట్టు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వాహణకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉండగా, మరో 17 నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చారు.
వక్ఫ్, ఇతర భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు తగిన చట్టపరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను భట్టి ఆదేశించారు. అలాగే, మైనారిటీల స్మశాన వాటికల చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణానికి ప్రాధాన్యతనివ్వాలనీ, ఇందుకోసం తక్షణమే ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కోరారు. ముస్లీం జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా, డివిజన్ కేంద్రాల్లో స్మశాన వాటికల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను సేకరించి కేటాయించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. హైదరాబాద్ నగరంలో జరగబోయే మొహర్రం వేడుకల సందర్భంగా, 9వ రోజున నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ కోరగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించి, తప్పకుండా హాజరవుతానని తెలిపారు.లు.

​డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి : మంత్రి మహ్మద్ అజహరుద్దీన్
రాష్ట్రంలో మైనారిటీలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బాలురకు 10, బాలికలకు 10 మైనారిటీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ ప్రతిపాదించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న 37 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాలను వేగంగా పూర్తి చేయాలనీ, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 20 కొత్త మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాలను త్వరగా ప్రారంభించి విద్యా కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంస్థలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం సుమారు రూ.130 కోట్లు విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. హజ్ యాత్రికులకు మెరుగైన వసతి మరియు సౌకర్యాలు కల్పించేందుకు శంషాబాద్ సమీపంలోని మామిడిపల్లి గ్రామంలో, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో రూ.86 కోట్ల అంచనా వ్యయంతో శాశ్వత హజ్ హౌస్ రుబాత్ నిర్మాణానికి ఆమోదం కోరారు. క్రైస్తవుల కోసం రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.69 కోట్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనను కూడా సమర్పించారు. సమావేశంలో పెండింగ్‌లో ఉన్న షాదీఖానా ప్రాజెక్టులు, ఉర్దూ అకాడమీ కార్యక్రమాలు, అలాగే ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా ఘనమైన ముషాయిరా నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలపై కూడా చర్చ జరిగింది. వక్ఫ్ బోర్డు ఉద్యోగుల సమస్యలు, ఇమాములు మరియు ముయజిన్ల సంక్షేమ చర్యలు, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, రాష్ట్రవ్యాప్తంగా ఖబర్‌స్తాన్ల అభివృద్ధి వంటి అంశాలపై కూడా సమావేశంలో సమగ్రంగా చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ​ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉప్పల్, ఫైనాన్స్ సెక్రెటరీ సిక్తా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -