ఆదాయం అంతంతే…
రెండు నెలల్లోనే రూ.10,595 కోట్ల అప్పు
రెవెన్యూ లోటు రూ.5,038 కోట్లు
కాగ్ నివేదికలో వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ఆదాయం రావడం లేదు. ఇంకోవైపు ప్రభుత్వ ఖర్చులు ప్రతినెలా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,41,263.59 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. గతనెల నాటికి ప్రభుత్వానికి రూ.28,441.63 (11.79 శాతం) కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,34,405.83 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. మే నాటికి ఖర్చు మాత్రం రూ.33,479.97 (14.28 శాతం) కోట్లు అయ్యింది. అంటే వచ్చిన ఆదాయం కన్నా చేసిన ఖర్చు రూ.5,038.34 (2.49 శాతం) కోట్లు ఎక్కువ ఉండడం గమనార్హం. రూ.6,857.76 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ రూ.5,038.34 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నది. ఈ గణాంకాలను బట్టి ప్రభుత్వ అంచనాలు తలకిందులయ్యాయని అర్థమవుతున్నది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా మే నాటికి రూ.3,120.87 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.3,348.55 కోట్ల రాబడి ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యింది. పన్నేతర ఆదాయం రూ.35,730.20 కోట్లు వస్తాయని అంచనా వేసింది. రెండు నెలల్లో రూ.1,803.38 (5.05 శాతం) కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఈ గణాంకాలను కాగ్ నివేదిక విడుదల చేసింది.
కేంద్రం గ్రాంట్లు రూ.544.99 కోట్లే
కేంద్ర గ్రాంట్ల కింద రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.24,166 కోట్లు వస్తాయని అంచనా వేసింది. గత నెల నాటికి రూ.544.99 (2.26 శాతం)కోట్లు వచ్చాయి. ఆశించిన ఆదాయం రాకపోవడం, కేంద్రం నుంచి గ్రాంట్లు విడుదల కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.58,458.71 కోట్లు అప్పు చేయాలని నిర్దేశించుకుంది. మే నాటికి రూ.10,595.98 (18.13 శాతం) కోట్ల అప్పు చేయడం గమనార్హం. ఈ వివరాలను కూడా కాగ్ వెల్లడించింది. తెలంగాణ రైజింగ్-2047 పేరుతో 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీ, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమి లక్ష్యమంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఇంకోవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు వ్యయం పెరుగుతున్నది. కానీ ఆదాయం మాత్రం ఆశించిన విధంగా రాకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఆదాయం పెరిగేందుకు కూడా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్నాయి. ప్రజలపై భారాలు మోపకుండా ఆదాయం పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.



