Friday, June 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవాతావరణ మార్పులకుపంటల మార్పిడే పరిష్కారం

వాతావరణ మార్పులకుపంటల మార్పిడే పరిష్కారం

- Advertisement -

తెలంగాణలో క్లైమేట్ స్మార్ట్ వ్యవసాయంపై నాబార్డ్ దృష్టి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయ రంగంపై రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పంటల మార్పిడి (క్రాప్ డైవర్సిఫికేషన్) ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం అందించడంతో పాటు వ్యవసాయాన్ని వాతావరణ అనుకూలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని నాబార్డ్ ప్రాంతీయ సలహా కమిటీ (ఆర్‌ఏసీ) అభిప్రాయపడింది. గురువారం హైదరాబాద్‌లో నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంతీయ సలహా కమిటీ సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించారు. నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్ బి. ఉదయ్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మెన్ ఎం. కోదండరెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ), వివిధ ప్రభుత్వ శాఖలు, సెర్ప్, ఐసీఏఆర్-నార్మ్, ఐక్రిసాట్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, స్వచ్ఛంద సంస్థలు, వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొన్నారు. ఏకపంట సాగు, నీటి కొరత, వాతావరణ మార్పుల ప్రభావం, మార్కెట్ అనిశ్చితి వంటి అంశాలపై సమావేశంలో లోతుగా చర్చించారు. పంటల వైవిధ్యీకరణతో పాటు పశుసంవర్థక, ఉద్యాన, మత్స్య రంగాలను బలోపేతం చేయడం, రైతులకు మెరుగైన మార్కెట్ అనుసంధానం కల్పించడం, వాతావరణ అనుకూల సాంకేతికతలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల గొలుసును అభివృద్ధి చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని అభిప్రాయపడ్డారు.

బి. ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు తెలంగాణలో నాబార్డ్ పలు వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. క్లైమేట్ స్మార్ట్ వరి సాగు కోసం రైస్-360 పేరుతో 450 ఎకరాల్లో పైలట్ ప్రాజెక్టు, జీవా కార్యక్రమం ద్వారా ప్రకృతి, సేంద్రీయ, పునరుత్పాదక వ్యవసాయ విధానాల ప్రోత్సాహం, చిన్న, సన్నకారు రైతుల కోసం తక్కువ వ్యయంతో షేడ్‌నెట్ హౌస్‌లు, ‘మా తోట’ కార్యక్రమం కింద 20 వేలకుపైగా పండ్ల తోటల అభివృద్ధి, ఆర్‌ఐడీఎఫ్ ద్వారా సూక్ష్మ సాగునీటి వసతులు, ఆయిల్‌పామ్ విస్తరణ, వాటర్‌షెడ్‌లు, క్లైమేట్ ప్రూఫింగ్ ప్రాజెక్టులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు (ఎఫ్‌పీఓలు) విధానపరమైన మద్దతు అందిస్తున్నట్టు వివరించారు. పంటల వైవిధ్యీకరణ, వాతావరణ అనుకూల వ్యవసాయం, స్థిరమైన జీవనోపాధి కల్పన నాబార్డ్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎం. కోదండరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని సారవంతమైన భూములను సమర్థవంతంగా వినియోగించుకొని పంటల మార్పిడిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. కూరగాయలు, పసుపు వంటి సంప్రదాయ, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచి భావితరాలకు మెరుగైన వ్యవసాయ వ్యవస్థను అందించాలని సూచించారు. కూరగాయల సాగుకు కోతుల బెడద ప్రధాన సమస్యగా మారినందున సోలార్ ఫెన్సింగ్‌కు సబ్సిడీ కల్పించాలనీ, మార్కెటింగ్ సమస్యలను విశ్లేషించి తగిన విధానాలు అమలు చేయాలని నాబార్డ్‌‌ను కోరారు. వ్యవసాయ కార్మికుల కొరతను అధిగమించేందుకు కలుపు యంత్రాలు, ఇతర చిన్న వ్యవసాయ యంత్రాలకు సబ్సిడీతో పాటు కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓలు), క్రాప్ కాలనీల భావనను విస్తృతంగా ప్రోత్సహించాలనీ, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సరఫరా బాధ్యతను ప్రభుత్వం చేపట్టాలని కోరారు. నూనెగింజలు, పప్పుధాన్యాలు, ఇతర వర్షాధార పంటల సాగును విస్తరించడం, రైతులకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -