ప్రభుత్వాల వైఫల్యం.. రెచ్చిపోతున్న లీక్ మాఫియా
భారత యువత భవిష్యత్తు ఆందోళనకరం
మానసిక ఒత్తిడిలో లక్షలాది మంది విద్యార్థులు
నైతిక బాధ్యత విస్మరిస్తున్న ప్రభుత్వాలు
‘నీట్ లీకేజీ’ వ్యవహారంలో ఇలాగే మోడీ సర్కారు తీరు
తప్పుబడుతున్న మేధావులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు
కేంద్రంలోని మోడీ పాలనలో దేశంలో పరీక్షా వ్యవస్థ పతనమైపోతోంది. విద్యార్థులు, ఉద్యోగార్థులు, యువతకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం.. తన బాధ్యతలను విస్మరిస్తోంది. పరీక్షా ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా, పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతోంది. ఇందుకు దేశంలో వరుసగా చోటు చేసుకుంటున్న నీట్, ఇతర పోటీ పరీక్షల ప్రశ్నాప్రతాల లీకేజీ ప్రత్యక్ష ఉదాహరణగా మేధావులు, విద్యావేత్తలు చెప్తున్నారు. పరీక్షా వ్యవస్థ పతనంతో దేశ యువత మానసికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. చాలా మంది బలవన్మరణాలకూ పాల్పడుతున్నారు. అయితే ఈ వైఫల్యాలకు ప్రభుత్వాలు బాధ్యత వహించి, తగిన చర్యలు తీసుకోవాలని మేధావులు సూచిస్తున్నారు.
న్యూఢిల్లీ : భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత యువ దేశంగా అభివర్ణిస్తుంటారు. ఈ యువ జనాభానే దేశానికి అతిపెద్ద ఆస్తిగా చెప్తుంటారు. అయితే నేడు అదే యువత పరీక్షల వ్యవస్థలో నెలకొన్న అవినీతి, పేపర్ లీకులు, నియామక ప్రక్రియల ఆలస్యం, నిరుద్యోగం కారణంగా తీవ్ర నిరాశ, ఆందోళన, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. జాతీయ స్థాయి పరీక్షల నుంచి రాష్ట్ర స్థాయి ఉద్యోగ నియామక పరీక్షల వరకు పేపర్ లీకులు వరుసగా వెలుగుచూస్తుండటం భారత పరీక్షా వ్యవస్థపై విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
జాతీయ సంక్షోభంగా మారిన పరిస్థితి
గత కొన్నేండ్లుగా దేశంలో నిర్వహిస్తున్న అనేక పోటీ పరీక్షలు పేపర్ లీక్‌ల బారిన పడ్డాయి. ప్రతిష్టాత్మక నీట్, యూజీసీ-నెట్, రైల్వే నియామక పరీక్షలు, పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులు (టెట్), రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ఇలా అనేక కీలక పరీక్షల్లో అవకతవకలు బయటపడ్డాయి. ఇది కేవలం పరిపాలనా నిర్లక్ష్యం కాదనీ, కోట్ల రూపాయల టర్నోవర్‌తో నడుస్తున్న ఒక వ్యవస్థీకృత నేర సామ్రాజ్యంగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యమయ్యే ముద్రణ సంస్థలు, ప్రయివేటు పరీక్షా కేంద్రాలు, మధ్యవర్తులు, కొందరు అధికారుల మధ్య ఏర్పడిన అక్రమ నెట్‌వర్క్ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
1.7 కోట్ల మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం
మీడియా నివేదికల ప్రకారం.. కేంద్రంలోని మోడీ పాలనలో దేశవ్యాప్తంగా 70కి పైగా ప్రధాన పరీక్షల్లో పేపర్ లీక్‌లు, ఇతర అక్రమాలు వంటివి చోటుచేసుకున్నాయి. వీటి ప్రభావం సుమారు 1.7 కోట్ల మంది అభ్యర్థులపై పడింది. పరీక్షలకు సిద్ధం కావడానికి విద్యార్థులు సంవత్సరాల సమయాన్ని, కుటుంబాలు లక్షల రూపాయలను ఖర్చు చేస్తుంటాయి. కానీ పరీక్ష రద్దయిన క్షణంలో ఆ శ్రమ, సమయం, డబ్బు అన్నీ వృథా అవుతున్నాయి. దీంతో అభ్యర్థులు, వారి కుటుంబీకులు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.
బాధ్యత ఎవరిది?
పరీక్షల్లో అవకతవకలు బయటపడినప్పుడు సాధారణంగా పరీక్షలను రద్దు చేయడం, దర్యాప్తునకు ఆదేశించడం, కొందరు మధ్యవర్తులను అరెస్టు చేయడం జరుగుతోంది. కానీ వ్యవస్థ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఉన్నతాధికారులు కానీ, కీలక నిర్ణయాధికారులు కానీ, సంబంధిత విభాగానికి చెందిన మంత్రులు కానీ తమ పదవులకు రాజీనామా చేసిన సందర్భాలు మోడీ పాలనలో కనిపించటం లేదు. ఇది ప్రభుత్వానికి నైతిక విలువలు తగ్గాయనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చని విశ్లేషకులు అంటున్నారు. పరీక్షల నిర్వహణ సంస్థలు, రాష్ట్ర నియామక బోర్డులు, కేంద్ర సంస్థలు పరస్పరం బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాయని చెప్తున్నారు. దీంతో విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొత్త పరీక్షల తేదీల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
పరీక్షా వ్యవస్థలోని అనిశ్చితి యువతలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారితీస్తోంది. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు సాధారణంగా వ్యక్తి జీవితంలో అత్యంత ఉత్పాదక దశగా భావిస్తారు. కానీ భారత యువతలో చాలా మంది ఈ కాలాన్ని పోటీ పరీక్షల కోసమే గడుపుతున్నారు. ఏండ్ల తరబడి చదివి, పరీక్ష రాసిన తర్వాత అది పేపర్ లీక్ కారణంగా రద్దయితే విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కుటుంబ సభ్యుల అంచనాలు, సమాజ ఒత్తిడి కూడా దీనిని మరింత తీవ్రం చేస్తున్నాయి.
విద్యార్థుల ఆత్మహత్యలు
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్ కూడా విద్యార్థుల ఆత్మహత్యలను ‘సంస్థాగత సంక్షోభం’గా అభివర్ణించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం.. దేశంలో ప్రతి సంవత్సరమూ 13 వేల మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంటే రోజుకు సగటున 35 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. పేపర్ లీక్‌లు, పరీక్షల రద్దు, ఉద్యోగ అవకాశాల కొరత వంటి అంశాలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై విమర్శలు
నీట్ పరీక్ష లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై తీవ్ర విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ.. ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయలేదు. జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన కొన్ని ప్రధాన పరీక్షల్లో అవకతవకల ఆరోపణలు వచ్చినప్పటికీ, మోడీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించకపోవడం శోఛనీయమని ప్రతిప క్షాలు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నాయి. అయినప్పటికీ.. కేంద్రం తన వైఫల్యాన్ని పూర్తిగా అంగీకరించకపోవడం గమనార్హం.
సంస్కరణలు అవసరం
దేశంలో విద్యా, ఉద్యోగ, పోటీ పరీక్షల్లో నెలకొన్న ఈ అనైతిక, అక్రమాలకు చెక్ పెట్టాలంటే పటిష్ట వ్యవస్థ అవసరమని మేధావులు, విశ్లేషకులు చెప్తున్నారు. స్వతంత్ర జాతీయ పరీక్ష భద్రతా సంస్థ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. పేపర్ లీక్ కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని అంటున్నారు. పరీక్షలు రద్దయితే అభ్యర్థులకు ఆర్థిక పరిహారం ప్రకటించాలని అంటున్నారు. నియామక ప్రక్రియలకు నిర్దిష్ట కాలపరిమితి అవసరమని నొక్కి చెప్తున్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు మానసిక ఆరోగ్య సహాయ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. పరీక్షా ప్రక్రియ మొత్తంలో సాంకేతిక భద్రత, పారదర్శకత పెంపు జరగాలని వారు అంటున్నారు. భారతదేశం నిజంగా ప్రపంచ శక్తిగా ఎదగాలంటే యువతపై నమ్మకం పెంచే పరీక్షా వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని మేధావులు చెప్తున్నారు. పేపర్ లీక్‌లు, అవినీతి, ఆలస్యాలు కొనసాగితే ప్రభుత్వ సంస్థలపై యువత విశ్వాసం మరింత దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.


