ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు క్యాష్‌లెస్ స్కీమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సర్కారు, త్వరలో దీన్ని అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. దీనివల్ల ఆయా కుటుంబాలు నేరుగా నాణ్యమైన వైద్య సేవలు పొందేందుకు వీలుకలిగే అవకాశాలుంటాయి. తెలంగాణలోని 1.44 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు సుమారు పదమూడు లక్షల మంది కుటుంబ సభ్యులు లబ్ధి పొందేలా ప్రభుత్వం ఈహెచ్‌ఎస్ స్కీమ్‌కు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మేలు చేసేలా ఉందని ఆయా సంఘాల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి వరకు భాగానే ఉన్నా..జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల పరిస్థితిపై ప్రభుత్వం నుండి స్ఫష్టత రాలేదు.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు- జర్నలిస్టులకు కలపి (ఈహెచ్‌ఎస్-జెహెచ్‌ఎస్) 2015లో స్కీమ్‌ను తీసుకొచ్చింది అప్పటి టీ(బీ)ఆర్‌ఎస్ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు నెట్‌వర్క్ వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఆయా కుటుంబ సభ్యులు వెల్‌నెస్ సెంటర్లలో నగదు రహిత వైద్య సేవలు పొందే ఉద్దేశంతో వీటిని ప్రారంభించారు. కానీ, ఇందులోని వైద్య సేవలు నామ మాత్రమే. పదేళ్లకు పైగానే కాలం గడుస్తున్నా..వైద్య సేవలు మాత్రం విస్తరించబడలేదు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెల్‌నెస్ సెంటర్లు సాధారణ పరీక్షలు, కొద్ది మేర వైద్య సేవలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని సుమారు యాభై వేల జర్నలిస్టుల కుటుంబాలు పూర్తిస్థాయి వైద్య సేవలు పొందలేకపోతున్నాయి.
పలు వెల్‌నెస్ సెంటర్లలో కనీసం పిజిషీయన్ డాక్టర్, ఇతర వైద్య నిపుణులు లేని పరిస్థితి. పెన్షనర్లకు పూర్తి స్తాయిలో బీపీ, షుగర్ మందులూ దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరిద్దరు జనరల్ డాక్టర్లు, అరకొర సిబ్బంది ఈ సెంటర్లను నెట్టుకొస్తున్నారు. ఆయా వెల్‌నెస్ సెంటర్లలో పని చేసే నర్సింగ్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇటీవల కాలంలో జరిగిన నియామకాల్లో వారు ఉద్యోగాలు సాధించగా, ఆయా పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. కొత్తగా నియామకాలు చేపట్టలేదు. దీంతో వెల్‌నెస్ సెంటర్లలో బీపీ, ఈసీజీ తీసేవారే కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయివేటు, కార్పోరేట్ ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ వైద్య సేవలకు సర్కారు కొత్త స్కీమ్ తీసుక వస్తుండగా.. జర్నలిస్టులను అందులో చేర్చక పోవడంపై ఆయా కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు.
జర్నలిస్టుల వైద్య సేవలకు ఏర్పాటు చేసిన వెల్‌నెస్ సెంటర్లను వికేంద్రీకరణ చేస్తున్నట్లు గత డిసెంబర్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, కూకట్‌పల్లిలోని వెల్‌నెస్ సెంటర్లను నిమ్స్‌కు అటాచ్ చేస్తూ కార్డియాలజీ, న్యూమరాలజీ, నెఫ్రాలజీ సేవల విస్తరణకు ఆదేశాలు జారీ చేసింది సర్కారు. జిల్లాల్లోని మరో పది సెంటర్లనూ ఆయా ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేశారు. డిఎంఈ పరిధిలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రుల ప్రధాన విభాగాల సేవలను వెల్‌నెస్ సెంటర్లకు విస్తరిస్తున్నట్లు చెప్పినప్పటికీ.. కార్యచరణలో చూపలేదు. ఉదాహరణకు కరీంనగర్ వెల్‌నెస్ సెంటర్‌లో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, డెర్మటాలజీ వైద్య సేవలందించేలా రూపకల్పన చేసినప్పటికీ.. నేటికీ సవలందడం లేదు. దీంతో జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగాలా మారింది.
కొంత ఆర్థికంగా ఉన్న ఉద్యోగులు- పెన్షనర్లు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందుతుండగా.. పేద, మధ్య తరగతికి చెందిన వేలాది మంది విలేకరులు నాణ్యమైన వైద్యసేవలకు దూరమౌతున్నారు. అన్ని ప్రయివేటు, కార్పోరేట్ ఆస్పత్రుల్లో జర్నలిస్టు కుటుంబాలకు క్యాష్‌లెస్ వైద్య సేవలు పొందేలా చర్యలు చేపట్టాలని సంఘాలు అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా.. చెవికెక్కించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 528 ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్ర్రుల్లో రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతున్నాయి. ఇందులో రెండు వందలకు పైగా ఈహెచ్‌ఎస్-జేహెచ్‌ఎస్ కార్డు దారులకు సేవలు అందిస్తున్నట్లు చెబుతున్నా.. ఆస్పత్రుల యాజమాన్యాలు మాత్రం కొన్ని శస్త్ర చికిత్సలు మాత్రమే చేస్తున్నట్లు జర్నలిస్టులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉద్యోగులు-పెన్షనర్ల తరహాలో క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించేలా చూడాలని జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఆ దిశగా రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంటుందా? లేక గత నిర్లక్ష్యాన్నే ప్రదర్శిస్తుందా అన్నది వేచి చూడాలి.
చిలగాని జనార్ధన్
8121938106



