ఉప ఎన్నిక
విజయంతో లేబర్ పార్టీలో నాయకత్వ పోరు
ప్రధాన మంత్రి పదవికీ పోటీ పడే అవకాశాలు యూకే రాజకీయాల్లో కీలక మలుపు
లండన్ : యూకేలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ ఆండీ బర్న్‌హామ్ ప్రత్యేక ఉప ఎన్నికలో ఘన విజయం సాధించి యూకే పార్లమెంట్‌కు తిరిగి ఎన్నికయ్యారు. దీంతో ఆయన యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌కు సవాల్ విసిరే స్థితికి చేరుకున్నారు. లేబర్ పార్టీలో స్టార్మర్ నాయకత్వంపై అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో బర్న్‌హామ్ విజయాన్ని బ్రిటన్ రాజకీయాల్లో కీలక మలుపుగా విశ్లేషిస్తున్నారు. గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా ఉన్న ఆండీ బర్న్‌హామ్.. వాయవ్య ఇంగ్లాండ్‌లోని మేకర్‌ఫీల్డ్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో ఘన విజయం సాధించి మళ్లీ పార్లమెంట్‌లోకి ప్రవేశించారు. దీంతో ఆయన ప్రధానమంత్రి పదవికి పోటీ పడే అవకాశాలు మరింత బలపడ్డాయి. ప్రస్తుతం ఆయనను లేబర్ పార్టీలో స్టార్మర్‌కు ప్రత్యామ్నాయంగా, అలాగే ప్రధానమంత్రి పదవికి అత్యంత బలమైన అభ్యర్థిగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి బర్న్‌హామ్ మొత్తం ఓట్లలో 55 శాతం సాధించి స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. రైట్‌వింగ్ పార్టీ అయిన రిఫార్మ్ యూకే అభ్యర్థి రాబర్ట్ కెన్యన్ 35 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.
బర్న్‌హామ్ తన తదుపరి రాజకీయ అడుగులపై ఆలోచిస్తున్న వేళ యూకే ప్రభుత్వం కొత్త అనిశ్చితి దశలోకి ప్రవేశించిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే గత ఏడు సంవత్సరాల్లో ఐదుగురు ప్రధానమంత్రులను చూసిన బ్రిటన్‌కు ఆరో ప్రధానమంత్రిని తీసుకురావచ్చన్న చర్చ మొదలైంది. ఇటు కీర్‌స్టార్మర్ నుంచి కూడా భారీ ప్రకటనే వచ్చింది. ఏ నాయకత్వ పోటీ జరిగినా తాను అందులో పోటీ చేస్తానని ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. దీంతో అధికార బదిలీ ప్రక్రియ బర్న్‌హామ్ ఊహించిన దానికంటే మరింత క్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బర్న్‌హామ్ తన విజయం అనంతరం చేసిన ప్రసంగంలో నాయకత్వ ఆశయాలను నేరుగా ప్రస్తావించకపోయినా పరోక్ష సంకేతాలు ఇచ్చారు. “ఇది మార్పు కోసం వచ్చిన సమయం. దేశ పరిస్థితిని మార్చే అవకాశం మన ముందుంది. రాజకీయాలు ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురాగలవని మరోసారి నిరూపించే సమయం ఇది. ప్రజల్లో మళ్లీ ఆశ నింపాల్సిన అవసరం ఉంది” అని ఆయన తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ అన్నారు.
క్యాబినెట్ మాజీ మంత్రి అయిన బర్న్‌హామ్ దాదాపు పదేండ్లుగా గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన లేబర్ పార్టీకి అత్యంత కీలక సమయంలో పార్లమెంట్‌లోకి తిరిగి వచ్చారు. 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి 14 ఏండ్ల తర్వాత లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే స్టార్మర్ నాయకత్వంలో ఆ పార్టీ ప్రజాదరణ వేగంగా పడిపోయింది. మే నెల ప్రారంభంలో జరిగిన స్థానిక కౌన్సిల్ ఎన్నికల్లో లేబర్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అదే సమయంలో రిఫార్మ్ యూకే పార్టీ గణనీయమైన విజయాలు నమోదు చేసింది. దీంతో లేబర్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు స్టార్మర్ రాజీనామా చేయాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. అయితే పార్టీ నియమాల ప్రకారం ప్రస్తుత ఎంపీలు మాత్రమే పార్టీ నాయకత్వానికి పోటీ చేయగలరు. బర్న్‌హామ్ అప్పటివరకు ఎంపీ కాకపోవడంతో ఆయన అధికా రికంగా నాయకత్వ పోరులో దిగలేకపోయారు. అందువల్ల స్టార్మర్‌కు సవాల్ విసరగల నాయకుడు ఎవరూ ముందుకు రాలేదు. అయితే అలాంటి పరిస్థితుల్లోనే బర్న్‌హామ్ ఉప ఎన్నికలో విజయం సాధించడం కీలక మలుపుగా రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.



