Saturday, June 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు‘సర్‌’ పట్ల అప్రమత్తంగా ఉండాలి

‘సర్‌’ పట్ల అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

పోయేది ఓటొక్కటే కాదు..
అన్ని హక్కులకు భంగం
జీవించే హక్కును కాలరాస్తున్న బీజేపీ..
తెలంగాణలో వారి పన్నాగాలను సాగనివ్వొదు :
సర్‌‌పై సీపీఐ నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘సర్‌’పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, ఆ ప్రక్రియతో తమ వ్యతిరేక శక్తుల ఓట్లను తొలగించేం దుకు బీజేపీ చేస్తున్న కుట్రలను తెలంగాణలో సాగనివ్వొద్దనీ, అందుకు తగిన విధంగా సమాయత్తం కావాలని వక్తలు పిలుపు నిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని మఖ్దూం భవన్‌‌లో సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్ష‍తన ‘జీవించే హక్కును కాలరాస్తున్న ‘సర్‌’ పై రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్‌ ‌జి హరగోపాల్‌, టీజేఎస్‌ అధ్యక్ష‍ులు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌, టీపీసీసీ అధ్యక్ష‍ులు మహేశ్‌‌కుమార్‌ ‌గౌడ్‌, ఎంపీ మల్లు రవి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌, సీపీఐ(ఎంఎల్‌) ‌మాస్‌‌లైన్‌ ‌రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం హన్మేశ్‌, సీపీఐ(ఎంఎల్‌) ఎన్‌‌డీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవీ చలపతిరావు, ఎస్‌‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి మురారి తదితరులు మాట్లాడారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సర్‌ అత్యంత ప్రమాదకరమైన ప్రక్రియగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే పలు రాష్ర్టాల్లో గెలుపోటములను నిర్దేశించిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్ష‍ణ కోసం, సామాన్య ప్రజల హక్కుకోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న సర్‌ ‌ప్రక్రియకు 23,24 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉమ్మడిగా అవగాహనా సదస్సులు నిర్వహించాలనీ, దీనికి ముందు రోజు ఈసీకి వినతి పత్రాన్ని అందించాలని ప్రతిపాదించారు. దీంతో అన్ని పార్టీలు తమ అంగీకారాన్ని తెలిపాయి. ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌మాట్లాడుతూ గోల్వాల్కర్‌ ‌విధానం ప్రకారం ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులు ఈ దేశానికి శత్రువులని గుర్తు చేశారు. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వీలైన పద్దతుల్లో వారిని తొలగించుకునే ప్రక్రియకు పాల్పడుతున్నదని చెప్పారు. అధికారంలో ఉన్న వారికి హద్దులు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు అంటే ఒక హక్కు అనే స్థితి నుంచి…ఇప్పుడు అది ఉంటుందా? లేదా? అనే చర్చ చేయాల్సిన స్థితి నెట్టివేయబడిందని చెప్పారు. ఓటర్లు నాయకున్ని ఎన్నుకునే దశ నుంచి నాయకుడు ఎవరి ఓటర్లును ఉంచాలి? ఎవరివి తీసేయాలి? అనే ఆలోచనను ఎలా నిలవరించాలని అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రావటం ఆందోళన కరమని చెప్పారు.

హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా చేసిన జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి రాష్ట్ర పతి అభ్యర్థి నామినేషన్‌ ‌వేయటానికి పోతే…ఆయన పాస్‌ ‌పోర్టును చూపించాలని ఆర్‌ఓ అడిగారంటే, పరిస్థితి ఎక్కడి దాకా పోయిందో ఊహించుకోవచ్చన్నారు. బీహార్‌, బెంగాల్‌, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో చేసినట్టు తెలంగాణలో చేస్తే కుదరదనే మేసేజ్‌ ఇవ్వాలని సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భావాజాలంతో సాగుతున్న ఈ ప్రక్రియను అడ్డుకోవాలని ఆయన చెప్పారు. ప్రొఫెసర్‌ ‌కోదండరాం ‌మాట్లాడుతూ ఓటు హక్కును మాత్రమే కోల్పోవటం కాదు…మన పౌరసత్వాన్ని కూడా కోల్పోతామని హెచ్చరించారు. ఆధార్‌, రేషన్‌ ‌కార్డు తదితర ఆధారాలన్ని పోతాయన్నారు. ఇవి లేక పోతే, ప్రభుత్వాలు అందిస్తున్న సంక్ష‍ేమ పథకాలు అందవని చెప్పారు. ఇవేవీ లేనప్పుడు ఈ దేశ పౌరుడివి ఎలా అవుతావనే ప్రశ్న సహజంగా వస్తుందన్నారు. సర్‌ ‌ముసుగలో దొడ్డి దారిన పౌరసత్వ నిరూపణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమంలో ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలవే ఎక్కువగా పోతున్నాయని చెప్పారు.

‘మా ఓటు హక్కుకు ఎలాంటి ప్రమాదం రావొద్దు’ అని ఉద్యమం చేయాలని సూచించారు. మహేశ్‌‌కుమార్‌ ‌గౌడ్‌ ‌మాట్లాడుతూ సర్‌ ‌ప్రజాస్వామిక పద్దతుల్లో జరగా ల్సిన ప్రక్రియ అని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ విధానాలను తుంగలో తొక్కి అడ్డదారుల్లో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అప్రజా స్వామికంగా వ్యవహరిస్తున్నదని విమర్శిం చారు. అప్పట్లో లింగ్డో, శేషన్‌ ‌స్వతంత్రంగా వ్యవహరిస్తే, ఇప్పుడు బీజేపీ జేబు సంస్థలుగా వ్యవహరిస్తు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఈసీ ఎంపికనే అప్రజాస్వామికంగా ఉందని చెప్పారు. ఆర్‌ఓలకు విస్తృత అధికారాలు ఇచ్చిన తర్వాత వారు ఏది చేయాలంటే అదే చేస్తారన్నారు. అందుకు మీనాక్ష‍ి నటరాజన్‌ ఉదంతమే ఉదాహరణ అని చెప్పారు. న్యాయస్థానం స్పందన కూడా ఆందోళన కలిగించేలా ఉందని చెప్పారు. అన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని మోడీ చక్రవర్తిలా వ్యవహరిస్తు న్నారని విమర్శించారు. అధ్యక్ష‍ తరహా పాలన తేవాలనే ఆరాట పడుతున్నారని చెప్పారు. దేవున్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం దుర్మార్గ మని విమర్శించారు. మల్లు రవి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చే పనిలో భాగమే ఓట్ల తొలగింపు ప్రక్రియ అని చెప్పారు. పార్లమెంట్‌‌లో సర్‌‌పై చర్చ జరగకుండా దాన్ని పక్కదారి పట్టించారని తెలిపారు. పార్లమెంట్‌బయట దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అందుకు తగిన కార్యాచరణ చేపట్టాలన్నారు.


ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ వారు అడిగిన అన్ని సర్టిఫికెట్లు చూపించినా, ఆర్‌వో భావాజాలాన్ని బట్టి ఆ ఓటు ఉంచాలా? తీసేయాలా? అనే నిర్ణయాన్ని తీసుకునే అధికారాన్ని కట్టబెట్టటం ప్రమాదమన్నారు. తనకు గిట్టని వాళ్లను తొలగించే ప్రక్రియలో భాగమే ఇంతంతా జరుగుతున్నదని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్రంలో మరింత గడువు పెంచాలని కోరాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి కిప్పుడు ఆదరాబాదరగా చేయాల్సిన అవసరమేమీ లేదన్నారు. ఇప్పటికే ఈసీకి సీపీఐ(ఎం) కొన్ని సూచనలు చేసిందని గుర్తు చేశారు. హన్మేశ్‌, జేవీ చలపతిరావు, మురారి మాట్లాడుతూ ‘సర్’ ప్రక్రియ పూర్తిగా ఫాసిస్ట్, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానమనీ, దీన్ని విధానపరంగా ముక్త కంఠంతో ఖండించాల న్నారు. ఒక నిర్ధిష్టమైన, వివక్షాపూరితమైన లక్ష్యంతో తీసుకువచ్చిన విధానమని విమర్శించారు. గతంలో జర్మనీలో హిట్లర్ ఏ విధంగానైతే యూదులను వేటాడి చంపేశాడో, ఈ విధానం కూడా అదే తరహాలో జాతి వివక్షతో, ఒక వర్గాన్ని నిర్మూలించే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కును తొలగించడమంటే, ఇది మనిషి జీవించే హక్కును కాలరాయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యవస్థలనే మార్చేలా, తన అధీనంలోకి తెచ్చుకునేలా ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఓటు హక్కు తొలగించడమంటే పౌర సత్వం నిరాకరించడమేనని ఇదే జరిగితే లక్షలాది మంది ప్రజలను క్యాంపులలో ఉండాల్సి వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ్మ, వీఎస్ బోస్‌, హైదరాబాద్‌ ‌జిల్లా కార్యదర్శి స్టాలిన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -