బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బొల్లారంలో ఆ పార్టీ
విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం
డిజిటల్ సభ్యత్వ నమోదు,
సర్ ఓటర్ల సవరణపై కీలక ఆదేశాలు
నవతెలంగాణ – ఆల్వాల్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ముందుకెళ్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం బొల్లారంలోని మెమోటోస్ వెడ్డింగ్ కన్వెన్షన్‌లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయ పోరాటాలపై దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. అర్హుల పేర్లు ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలో టికెట్లు ఆశిస్తున్న నాయకులు, వారితోపాటు కార్యకర్తలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఈ ఓటర్ల సవరణ ప్రక్రియలో పాల్గొని క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజల మధ్య ఉండాలని చెప్పారు. వారికే రాబోయే ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందని, ఆఫీసులకే పరిమితమైతే టికెట్లు దక్కవని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రైల్వే గేట్లు, ట్రాఫిక్ సమస్యలు, తాగునీటి కొరత, విద్యుత్, డ్రయినేజీ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.1755 కోట్లకు పైగా నిధులు మంజూరు అయ్యేలా చేశామన్నారు. గౌతమ్‌నగర్ 5 ఎంఎల్ డీ రిజర్వాయర్, విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఏఓసీ అదనపు రోడ్లు, జిల్లా కోర్టు భవనం, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, బండ చెరువు అభివృద్ధి వంటి అనేక కీలక ప్రాజెక్టులను సాధించినట్టు వివరించారు. ఈ సమావేశంలో ఎంబీసీ మాజీ చైర్మెన్ నందికంటి శ్రీధర్, మల్కాజ్‌గిరి లోక్‌సభ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, జగదీష్ గౌడ్, ఆకుల నర్సింగరావు, మురుగేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.



