20 ప్రాంతాల్లో
ఆధునిక ధాన్య సైలోలు
ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతాయి
ఎస్‌హెచ్‌జీలు, పీఏసీఎస్‌ల పాత్ర యథాతథం : మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ధాన్యం నిల్వ వ్యవస్థను మరింత శాస్త్రీయంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వరి ఉత్పత్తి ఎక్కువగా వస్తున్న 20 ప్రాంతాల్లో అత్యాధునిక సైలోలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు వెల్లడించారు.శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ధాన్య నిల్వ, రవాణా రంగానికి చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తి, ధాన్యం కొనుగోళ్లు ప్రతి ఏడాది పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిల్వ సామర్థ్యాలను కూడా పెంచాల్సిన అవసరముందని చెప్పారు. అందులో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సైలోల ఏర్పాటును ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ప్రారంభ దశలో 50 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో సైలోల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసే అవకాశాలను అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ఈ సైలోలు ప్రస్తుతం అమలులో ఉన్న ధాన్యం కొనుగోలు, నిల్వ వ్యవస్థలకు ప్రత్యామ్నాయం కాదని, వాటికి అనుబంధంగా పనిచేసే ఆధునిక మౌలిక వసతులుగా ఉపయోగపడతాయని స్పష్టం చేశారు.
తెలంగాణలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో స్వయం సహాయక సంఘాలు, ఇకేపీ కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భవిష్య త్తులో కూడా వారి పాత్ర కొనసాగుతుంది. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుత కొనుగోలు వ్యవస్థను కొనసాగిస్తూనే ఆధునిక సాంకేతికతను అనుసంధానం చేస్తాం’ అని మంత్రి తెలిపారు. పంట కోతల అనంతరం నిల్వ నష్టాలను తగ్గించడం, ధాన్యం నాణ్యతను పరిరక్షించడం, రవాణా వ్యవస్థను వేగవంతం చేయడం, సరఫరా గొలుసును మరింత సమర్థవంతంగా మార్చడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. సమావేశంలో పాల్గొన్న సాంకేతిక నిపుణులు ఆధునిక సైలోల ద్వారా ధాన్యం స్వీకరణ నుంచి నిల్వ, రవాణా వరకు మొత్తం ప్రక్రియను ఆటోమేటెడ్ పద్ధతిలో నిర్వహించవచ్చని వివరించారు. డిజిటల్ నాణ్యత పరీక్షలు, యాంత్రిక అన్‌లోడింగ్, సెన్సార్ ఆధారిత పర్యవేక్షణ, శాస్త్రీయ నిల్వ విధానాల ద్వారా ధాన్య నాణ్యతను దీర్ఘకాలం కాపాడవచ్చని తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు, నిల్వ కేంద్రాల వద్ద ఎదురవుతున్న కార్మికుల కొరత, రవాణా ఆలస్యం వంటి సమస్యలకు కూడా ఈ వ్యవస్థ సమర్థవంతమైన పరిష్కారం చూపగలదని అభిప్రాయపడ్డారు.
రైల్వేల అనుసంధానంతో కూడిన ఆధునిక లాజిస్టిక్స్ వ్యవస్థ ద్వారా ధాన్యాన్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, దేశవ్యాప్తంగా వినియోగ కేంద్రాలకు వేగంగా తరలించే అవకాశాలు న్నాయని పేర్కొన్నారు. వరి ఉత్పత్తి జిల్లాల్లో సైలోల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు, నిల్వ సామర్థ్యా లు, పెట్టుబడి వ్యయం, అమలు విధానాలపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని సంబంధిత సంస్థలను ఆదేశిం చారు. ధాన్యం కొనుగోలు, నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసి రైతులకు, వినియోగ దారులకు మెరుగైన సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యంగా సాంకేతికతను వినియోగిస్తూ వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.



