బాధిత రైతులు
రైల్వే బోర్డు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎటువంటి మార్పు ఉండదు
స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో బాధిత రైతులతో ప్రత్యేక సమావేశం
స్పెషల్ డిప్యూటీ జిల్లా కలెక్టర్ జి సదానందం
నవతెలంగాణ – బోనకల్
రైల్వే బోర్డు నుంచి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎటువంటి మార్పులు, చేర్పులు ఉండవని జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి సదానందం స్పష్టం చేశారు. మండల పరిధిలోని మోటమర్రి రైల్వే స్టేషన్ వద్ద రింగు కోసం రైల్వే అధికారులు భూముల సేకరణ ఇటీవల ప్రారంభించారు. మోటమర్రి రైల్వే స్టేషన్ వద్ద రింగు కోసం భూములు కోల్పోతున్న బాధిత రైతులతో స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి సదానందం శనివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల మోటమర్రి బాధిత రైతులు జిల్లా కలెక్టర్ కు రైల్వే అధికారులు మొదట ప్రతిపాదించిన ప్రకారమే రింగు ఏర్పాటు చేయకుండా, దానిని మార్చుతున్నారని అలా కాకుండా మొదటిసారి సర్వే ప్రకారం రింగు ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర కు వినతి పత్రం అందజేశారు.
దీంతో జిల్లా కలెక్టర్ బాధిత రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించిన మేరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి సదానందం వారితో స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైతులు మాట్లాడుతూ ఆనాడు రైల్వే అధికారులు రెండు మూడు రకాల సర్వే నిర్వహించారన్నారు. అయితే మొదట సర్వే నిర్వహించిన ప్రకారం మోటమర్రి గ్రామానికి చెందిన రైతుల భూములు సుమారు 20 నుంచి 30 ఎకరాల భూమి మాత్రమే కోల్పోతున్నామని, కానీ రెండవసారి మార్చిన దాని ప్రకారం సుమారు 60 నుంచి 80 ఎకరాల వరకు తాము భూమి కోల్పోతున్నామని, మొదటి సర్వే ప్రకారమే రింగు ఏర్పాటు చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను కోరారు. మా అభిప్రాయాలకు భిన్నంగా వెళ్తే తాము కోర్టుకు వెళ్తామని రైతుల స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే మొదటిసారి లైన్ ను మార్చుతున్నారని ఆయన దృష్టికి బాధిత రైతులు తీసుకెళ్లారు.
అనంతరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి సదానందం మాట్లాడుతూ రైల్వే అధికారుల ఒకసారి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత దానిలో చేర్పులు, మార్పులు ఉండవని స్పష్టం చేశారు. ప్రస్తుతం రైల్వే అధికారులు ఎకరానికి 22 లక్షల చొప్పున చెల్లించనున్నారని తెలిపారు. అదేవిధంగా ఆ పొలంలో ఎటువంటి పంట ఉన్న ఇతర ఏ రకమైనవి ఉన్న వాటికి ఆధారంగా ధర ప్రకారం చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం మోటమర్రి భూమి విలువ సుమారు నాలుగున్నర లక్షల మాత్రమే ఉందని, ఒకవేళ రైతుల కోర్టుకు వెళితే ఆ ధరకు మూడు నుంచి నాలుగు రెట్లు రైల్వే బోర్డు కోర్టులో జమ చేస్తుందని స్పష్టం చేశారు. కోర్టు ప్రకారం అయితే భూమి ప్రస్తుతం ఉన్న విలువకే మూడు నాలుగు రెట్లు మాత్రమే చెల్లించడం జరుగుతుందని స్పష్టం చేశారు. రైతులు అంగీకరిస్తే మాత్రం ఎకరానికి రూ. 22 లక్షల వస్తాయని స్పష్టం చేశారు.
రైతుల కోర్టుకు వెళితే దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం. అయితే ఇది ఇలా ఉండగా రింగు కోసం సుమారు 60 నుంచి 75 మంది రైతులు భూములు కోల్పోతుండగా ఇందులో సుమారు 40 నుంచి 50 మంది రైతులు తమ భూముల ఇవ్వటానికి ఇంతకుముందే అంగీకరించారు. ప్రస్తుతం 15 నుంచి 25 మంది రైతులు తమ భూములు ఇవ్వటానికి నిరాకరించారు. తాము కోర్టుకే వెళ్తామని బాధిత రైతులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు స్పష్టం చేసి వెళ్లిపోయారు. ఈ సమావేశంలో మండల తహసిల్దార్ చల్లూరి సుధాకర్, బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు.



