మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ – పరకాల
ఈ నెల 22న దామెర మండల కేంద్రంలోని ఏఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించనున్న పరకాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని దిగ్విజయం చేయాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని, మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు.
ఈ సమ్మేళనంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, సంస్థాగత బలోపేతంపై కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారని ఆయన వివరించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికొదిలేసి పాలన సాగిస్తోందని, ఈ క్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందని చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



