Friday, February 20, 2026
E-PAPER
Homeఆటలుజింబాబ్వే దంచెన్‌!

జింబాబ్వే దంచెన్‌!

- Advertisement -

6 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపు
ఛేదనలో బెనెట్‌ అజేయ అర్థ సెంచరీ
శ్రీలంక 178/7, జింబాబ్వే 182/4

2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు కనీసం అర్హత సాధించలేదు. 2026 పొట్టి ప్రపంచకప్‌లో నిలిచినా.. ఆస్ట్రేలియా, శ్రీలంకలతో కలిసి గ్రూప్‌ దశ పోరాటం. ఎటువంటి అంచనాలు లేని జింబాబ్వే గ్రూప్‌ దశ దాటుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ, జింబాబ్వే దంచికొట్టింది. ఆస్ట్రేలియాను ఓడించి ఆ జట్టు సూపర్‌8 ఆశలు ఆవిరి చేసిన జింబాబ్వే.. తాజాగా శ్రీలంకను సైతం చిత్తు చేసింది. గ్రూప్‌ దశను అజేయంగా ముగించి దర్జాగా సూపర్‌8లో అడుగుపెట్టింది. శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది.

నవతెలంగాణ-కొలంబో
టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే సంచలనాలు కొనసాగుతున్నాయి. తొలుత ఆస్ట్రేలియాను ఓడించి.. సూపర్‌8 సమీకరణాలను మార్చివేసిన జింబాబ్వే తాజాగా శ్రీలంకను సైతం చిత్తు చేసింది. గురువారం కొలంబోలో జరిగిన గ్రూప్‌-బి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై జింబాబ్వే గెలుపొందింది. 179 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ బ్రయాన్‌ బెనెట్‌ (63 నాటౌట్‌, 48 బంతుల్లో 8 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. సికందర్‌ రజా (45, 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో మెరువగా, మారుమణి (34, 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఓపెనర్‌ పతుమ్‌ నిశాంక (62, 41 బంతుల్లో 8 ఫోర్లు), పవన్‌ రత్ననాయకె (44, 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. జింబాబ్వే కెప్టెన్‌ సికందర్‌ రజా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

బెనెట్‌, రజా మెరుపుల్‌
179 పరుగుల ఛేదనలో జింబాబ్వేకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు బ్రయాన్‌ బెనెట్‌ (63 నాటౌట్‌), మారుమణి (34) పవర్‌ప్లేలో వికెట్‌ నిలుపుకున్నా.. రన్‌రేట్‌ నెమ్మదించింది. టాప్‌-4 బ్యాటర్లకు మంచి ఆరంభాలు దక్కినా..శ్రీలంకదే పైచేయిగా కనిపించింది. రయాన్‌ బర్ల్‌ (23), మారుమణి (34) నిష్క్రమించినా.. బెనెట్‌, సికందర్‌లు జింబాబ్వేను నిలబెట్టారు. సికందర్‌ నెమ్మదిగా ఆడటంతో బెనెట్‌పై ఒత్తిడి పెరిగింది. 4 సిక్స్‌లు, రెండు ఫోర్లతో సరైన సమయంలో ఎదురుదాడి చేసిన సికందర్‌.. జింబాబ్వేను విజయానికి చేరువ చేశాడు. ఆఖర్లో సికందర్‌ అవుటైనా.. బెనెట్‌ లాంఛనం ముగించాడు. మరో 3 బంతులు ఉండగానే 182/4 పరుగులు చేసిన జింబాబ్వే.. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. శ్రీలంక బౌలర్లలో హేమంత (2/36), శనక (1/26), వెల్లలాగె (1/27) రాణించారు.

నిశాంక అర్థ సెంచరీ
తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక ఓపెనర్‌ పతుమ్‌ నిశాంక (62) అర్థ సెంచరీతో మంచి స్కోరు సాధించింది. కుశాల్‌ పెరీరా (22) తోడుగా శుభారంభం చేసిన నిశాంక.. పవన్‌ రత్ననాయకె (44)తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించాడు. కమిందు మెండిస్‌ (7), శనక (6) నిరాశపరిచారు. అయినా, 20 ఓవర్లలో 7 వికెట్లకు శ్రీలంక 178 పరుగులు చేసింది. స్లో వికెట్‌పై 178 పరుగులు మంచి స్కోరు అనిపించింది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఎవాన్స్‌ (2/35), క్రీమర్‌ (2/27) రాణించారు. గ్రూప్‌ దశ ఆఖరు మ్యాచ్‌లో శ్రీలంక ఓడినా.. గ్రూప్‌-బి నుంచి సూపర్‌8కు చేరుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -