Friday, February 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅలా బుక్‌చేస్తే.. ఇలా ముంగిటకు ..

అలా బుక్‌చేస్తే.. ఇలా ముంగిటకు ..

- Advertisement -

కాలంతో పోటీపడుతున్న గిగ్‌ వర్కర్లు
క్షణాల్లో కోరుకున్న వస్తువు మన చేతికి
రాష్ట్రంలో 10 లక్షల మంది కార్మికులు
ఉద్యోగ, సామాజిక భద్రత నిల్‌
చట్టం చేసినా రూల్స్‌ రూపొందించని వైనం
ప్రమాదాలు అనేకం..పట్టించుకోని సర్కార్‌..


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే చాలు.. కాలు బయట పెట్టకుండానే కోరుకున్న వస్తువు క్షణాల్లో మన ముంగిటకొస్తున్నది. సినిమాకు వెళ్లాలన్నా..ఫంక్షన్‌కు పోవాలన్నా.. రోడ్డెక్కి ఆటో..ఆటో అని అడగాల్సిన అవసరం లేదు.. అలా బుక్‌ చేస్తే ..ఇలా ఇంటి ముందుకొచ్చి ఆగుతున్నాయి. ఒక్క ఓటీపీ చెబితే చాలు.. భద్రంగా మన గమ్యస్థానానికి చేర్చే రైడర్లున్నారు. వారే గిగ్‌ వర్కర్లు. పగలూ రాత్రి, ఎండా వానా ఇవేమీ లెక్క చేయరు. కాలంతో సమానంగా పరిగెడతారు. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు, ఇంట్లో పప్పూ ఉప్పూ నుంచి పాలు, పెరుగు ఇలా ఏదంటే అది మనం అలా ఆర్డర్‌ పెడితే ఇలా నిమిషాల్లో తెచ్చి ఇస్తున్నారు. వీళ్లు రోజులో 16గంటలకుపైగా చక్రాలపైనే తిరుగుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటి కార్మికులు సుమారు ఎనిమిది నుంచి 10 లక్షల మంది ఉన్నారనేది ప్రాథమిక అంచనా. వీరిలో దాదాపు 30 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఈ-శ్రమ్‌ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. అత్యధికులు హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో పని చేస్తున్నారు.

వారికి వర్తించని చట్టాలు..
గిగ్‌వర్కర్లకు కార్మిక చట్టాలేవీ వర్తించవు. లేబర్‌కోడ్‌లు కూడా వీరి సమస్యలకు పరిష్కారం చూపలేదు. యాప్‌ ఆధారంగా పని చేస్తారు. వీరితో పని చేయిస్తున్న యాజమాన్యాలపై చట్టపరమైన పర్యవేక్షణ ఉండదు. ఏ చట్టమూ వర్తించదు. కార్మికులకూ, వినియోగదారులకు మధ్య తాము మధ్యవర్తులుగానే సేవలు అందిస్తున్నామనీ, ఈ కార్మికులతో తమకేమీ సంబంధం లేదని ఇప్పటికే యాజమాన్యాలు ప్రకటించాయి. కార్మికుల గురించి ఎలాంటి బాధ్యత తీసుకోవటానికి అవి సిద్ధంగా లేవు.

పగ్గాలు వీరి చేతిలోనే..
కార్మికుల గురించి ఎలాంటి బాధ్యతను తీసుకోవటానికి ఇష్టపడని యాజమాన్యాలు..ఆన్‌లైన్‌ కార్మికులను నియంత్రిస్తున్నాయి. పగ్గాలు మాత్రం వీరి చేతుల్లోనే పెట్టుకుంటున్నాయి. వినియోగదారుడు బుక్‌ చేసుకున్న వస్తువు కాస్త ఆలస్యమైనా… కార్మికునిదే బాధ్యత… వస్తువులో నాణ్యత లోపించినా.. వర్కరే బాధ్యత వహించాలి. అదేందని అడిగే అవకాశం లేదు. యాజమాన్యం నుంచి ఏకపక్ష నియంత్రణే కొనసాగుతుంది. కాస్త నోరెత్తితే.. ఐడీ కార్డు బ్లాక్‌ అంతే..తిరిగి రెన్యూవల్‌ చేయించుకోవాలంటే..అదో పెద్ద ప్రాసెస్‌..

గుర్తింపు నిల్‌..
గిగ్‌ వర్కర్లకు కార్మికులుగా గుర్తింపు లేదు. పని భద్రత లేదు. సెలవులు, వైద్యం, ప్రావిడెంట్‌ ఫండ్‌, పెన్షన్‌లాంటి సామాజిక భద్రతలేవీ వీరికి వర్తించవు. పరిమిత ఆదాయాన్ని పొందుతున్నారు. అది కూడా స్థిరంగా లేదు. నికరంగా మిగిలే ఆదాయం చాలా తక్కువ. దీనికితోడు పెరుగుతున్న అనారోగ్య సమస్యలు, తక్కువ సమయంలో పూర్తి చేయాల్సిన పనులతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

గిగ్‌వర్కర్లు ఏం కోరుకుంటున్నారు?
ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారని పలువురు గిగ్‌ వర్కర్లను పలకరించగా.. ‘మాకో గుర్తింపు లేదు. మేం ఫలానా అని మాకు ఐడీ కార్డులివ్వాలి’ అని సలీమ్‌ అనే గిగ్‌వర్కర్‌ తన బాధను వెలిబుచ్చాడు. ‘ఉద్యోగ భద్రత కల్పించాలి’ అని అంబర్‌పేట సతీష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మా అంత అసంఘటితంగా ఇంకెవరూ ఉండరు. రాష్ట్రంలో మేం ఎంతమంది ఉన్నామనే లెక్క కూడా ప్రభుత్వం దగ్గర లేదు. అదీ మా దుస్థితి’ అని మరో గిగ్‌ వర్కర్‌ ఓల్డ్‌ సిటీ కృష్ణ వాపోయాడు. ‘మాకు ప్రమాదం జరిగి తిరగలేకపోతే రూ. లక్ష, చనిపోతే రూ. 10 లక్షలు బీమా ఇస్తామని మా కంపెనీలు చెబుతున్నాయి.

అందుకు గ్యారంటీ లేదు’ అని బాల్‌నగర్‌ శ్రీనివాస్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశాడు. ‘రోజులో 16 గంటలపాటు రోడ్డుపైనే ఉంటున్నాం, ఆరోగ్య సమస్యలొస్తే ఇక మా పరిస్థితి అంతే’ అని వరంగల్‌ సోమేష్‌రావు చెప్పారు. మరి కొన్ని ప్లాట్‌ పామ్స్‌ వద్ద కార్మికులను కలిసినప్పుడు ఉద్యోగ భద్రతతోపాటు ఆరోగ్య బీమా, సరైన వేతనాలు, పారదర్శక ఇన్సెంటీవ్‌లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఐడీ బ్లాకింగ్‌- పెనాల్టీలు ఆపాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు, బెదిరింపులు జరిగినపుడు మాకు దిక్కెవరని ప్రశ్నిస్తున్నారు. ‘వినియోగదారులు డబ్బు చెల్లించకపోతే యాజమాన్యానికి బాధ్యత లేదు.

రాత్రి బుకింగ్‌లో వినియోగదారులెవరైనా తాగి కొట్టినా, తిట్టినా యాజమాన్యాన్ని నేరుగా సంప్రదించే అవకాశం లేదు. కస్టమర్‌ రోడ్డు మీద నిలబడి వాహనం బుక్‌ చేసినప్పుడు పోలీసులు చలానా వేస్తే డ్రైవర్‌ భరించాల్సిందే. బుక్‌ చేసి మధ్యలో క్యాన్సిల్‌ చేస్తే మినిమమ్‌ ఫేర్‌ లేదు. వెయిటింగ్‌ చార్జీ లేదు. రోడ్‌ బ్లాక్‌ అయినా, ట్రాఫిక్‌ సమస్య ఏర్పడినా రేటు మారదు. డ్రైవర్లు ఎక్కువ సమయం కోల్పోతున్నారు. గతంలో డ్రైవర్లకు ట్రాఫిక్‌ జామ్‌ టైమ్‌ కలిపేవారు. ఇప్పుడు అదీ లేదు. కమిషన్‌ మాత్రం యథాతధంగా తీసుకుంటున్నారు’ అని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

బిల్లుఒకే.. రూల్స్‌ ఏవి?
రాష్ట్రంలోని గిగ్‌ వర్కర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్లాట్‌ఫాం ఆధారిత గిగ్‌ వర్కర్ల (రిజిస్ట్రేషన్‌, సామాజిక భద్రత, సంక్షేమం) బిల్లు-2025ను మంత్రిమండలి నవంబరు 17న ఆమోదించింది. కార్మికశాఖ మంత్రి చైర్మెన్‌గా గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖలు, రవాణా, ఐటీ, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల ప్రతినిధులుంటారనీ, ఒక కమిషనర్‌ను నియమిస్తారని ప్రకటించింది. యజమానులు, ప్రభుత్వ అధికారులే ఈ బోర్డులో కొలువుదీరినప్పుడు..కార్మికుల కష్టాల గురించి చర్చ ఎలా జరుగుతుందని గిగ్‌ వర్కర్లు ప్రశ్నిస్తున్నారు. కార్మికుల ప్రయోజనాలు నెరవేరే విధంగా రూల్స్‌ రూపొందించాలని వారు కోరుతున్నారు.

అసంతృప్తి చల్లార్చేందుకే..
రాష్ట్ర ప్రభుత్వం గిగ్‌ వర్కర్ల కోసం చట్టం చేసి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పింది. దీంతో ప్లాట్‌ఫారాల యాజమాన్యాలు, బోర్డుకు తాము చెల్లించేదేమీ ఉండబోదని తేల్చేశాయి. తాము చేస్తున్నదని సంఘ సేవనీ, కమిషన్‌ పేరుతో వసూలు చేసేదంతా నిర్వాహణ ఖర్చులకే సరిపోతున్నదని ప్రభుత్వానికి చెప్పి చేతులు దులుపుకున్నాయి. కార్మికుల కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి న్యాయం జరిగే విధంగా విధానాలు రూపొందించాలి. 16గంటలకుపైగా పని చేస్తున్న కార్మికులకు సరైన న్యాయం జరగాలి.

కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో రాపిడో డ్రైవర్‌ నవీన్‌, బుక్‌ చేసుకున్న కస్టమర్‌ ఇద్దరూ చనిపోయారు. ప్లైఓవర్‌ నుంచి మరో వ్యక్తి చనిపోయాడు. వీరికి ప్రమాద బీమా, ఇన్‌సెంటీవ్‌లు లేవు. జీవన విధానంలో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. రైడ్‌ చార్జీలను పెంచాలి. ఫోన్‌ చార్జింగ్‌, విశ్రాంతి కేంద్రాల ఏర్పాటు లేదు. ఎక్కడో శామీర్‌ పేట దగ్గర ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి వారు అక్కడికి పోయి విశ్రాంతి తీసుకోవటం, చార్జింగ్‌ పెట్టుకోవటం కష్టం. అందుకే ప్రతి బంక్‌లో అలాంటి సౌకర్యం కల్పించాలి. -పి శ్రీకాంత్‌ , ప్రధాన కార్యదర్శి, ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెఢరేషన్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -