విమర్శల గొంతు నొక్కుతున్న వర్సిటీలు
రాజకీయాలతో భ్రష్టు పడుతున్న ప్రాంగణాలు
పాలకులకు జీ హుజూర్ అంటున్న అధికారులు
న్యూఢిల్లీ : దేశంలోని విశ్వవిద్యాలయాలు అసమ్మతికి నిలయాలుగా మారిపోతున్నాయి. విద్యా సంబంధమైన స్వేచ్ఛకు అక్కడ సంకెళ్లు పడుతున్నాయి. వాటిలో ‘రద్దు’ల సంస్కృతి కొనసాగుతోంది. నటుడు, ప్రజా మేధావి నసీరుద్దీన్ షాకు ముంబయి విశ్వవిద్యాలయం పంపిన ఆహ్వానాన్ని చివరి క్షణంలో వెనక్కి తీసుకోవడాన్ని చూస్తుంటే విద్యాలయాలు ఏ విధంగా రాజకీయాలతో భ్రష్టుపడుతున్నాయో అర్థమవుతుంది. విశ్వవిద్యాలయాలలో ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. వాటి లక్షణాలు, స్వభావాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు అర్థవంతమైన చర్చలకు, ప్రముఖుల ప్రసంగాలకు అవి వేదికలుగా ఉండేవి. విమర్శలకు కూడా ప్రాధాన్యత లభించేది. ఇప్పుడు ఆ పరిస్థితి మచ్చుకైనా కనబడడం లేదు. సంస్థాగత ‘రద్దు’ సంస్కృతి బాగా పెరిగిపోయింది. వర్సిటీల పాలకులు అధికార పార్టీలకు దాసోహం అంటున్నారు. ప్రభుత్వం చెప్పిన ప్రతి దానికీ తల ఊపుతూ తమ పదవులు కాపాడుకుంటున్నారు.
నిరంతర నిర్బంధాలు
గత దశాబ్ద కాలంగా దేశంలో జరుగుతున్న వరుస సంఘటనలలో భాగంగానే ముంబయి ఉదంతాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. ‘క్రిటికల్ ఫిలాసఫీ ఆఫ్ క్యాస్ట్ అండ్ రేస్’ పేరిట ఇటీవల న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఓ సమావేశం జరిగింది. అయితే అది తీవ్రమైన రాజకీయ ఒత్తిడిని, పాలనా యంత్రాంగం నుంచి అడ్డంకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. సమావేశంలో కులం, జాతి గురించి ఎందుకు చర్చించాల్సి వచ్చిందో, దాని వెనుక ఉన్న ఉద్దేశమేమిటో తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ కమిటీని సైతం ఏర్పాటు చేశారు.
అదే విధంగా సామాజిక శాస్త్రవేత్త నందినీ సుందర్ సెమినార్ సిరీస్‌కు ఢిల్లీ యూనివర్సిటీ అనుమతి నిరాకరించింది. ‘భూమి, ఆస్తి, ప్రజాస్వామ్య హక్కులు’ పేరిట సెమినార్ సిరీస్ జరగాల్సి ఉంది. ఈ ఘటనలను గమనిస్తే విశ్వవిద్యాలయాలలో సెన్సార్‌షిప్ అనేది ఏ విధంగా అమలవుతున్నదో అర్థమవుతుంది. విద్యా సంబంధమైన స్వేచ్ఛను నీరుకార్చడంతో పాటు దానిని హరిస్తున్నారు. వర్సిటీ పాలకులు, ప్రభుత్వాధినేతల మధ్య ఉన్న సంబంధాలే దీనికి కారణమని వేరే చెప్పనక్కర లేదు.
ప్రజాస్వామ్యానికే మృత్యుఘోష
విద్యా స్వేచ్ఛ అనేది ఓ ఆదర్శం కాదు. అది విశ్వవిద్యాలయాల రోజువారీ పనిలో ఓ మౌలిక సూత్రం. విద్యా స్వేచ్ఛను హక్కుగా, బాధ్యతగా తత్వవేత్త జుడిత్ బట్లర్ నిర్వచించారు. విద్యా హక్కు ప్రకారం పరిశోధకులు ప్రభుత్వం లేదా వర్సిటీ పాలకుల జోక్యం లేకుండా తమ పనులు చేసుకోవచ్చు. పాఠ్యాంశాల రూపకల్పనలోనూ, వర్సిటీ పాలనలోనూ వారు భాగస్వాములు కావచ్చు. అయితే ఇప్పుడు జరుగుతోంది ఏమిటి? ఏం బోధించాలో, ఏం చదవాలో, ఏం రాయాలో వర్సిటీ పాలకులు, అధికారులే నిర్దేశిస్తున్నారు. అధ్యాపకులు, పరిశోధకుల స్వేచ్ఛకు సంకెళ్లు వేసినప్పుడు విద్యాలయం విజ్ఞాన కేంద్రంగా ఎలా భాసిల్లుతుంది? అమెరికా, బ్రిటన్, కెనడా సహా పాశ్చాత్య దేశాలలోని పలు విశ్వవిద్యాలయాలలో విద్యా స్వేచ్ఛపై అధ్యయనాలు జరిగాయి. యూనివర్సిటీలలో స్వేచ్ఛ అనేది అంతరించిపోతోందని, విమర్శకుల గొంతు నొక్కుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మృత్యుఘోష అని ఆ నివేదికలు హెచ్చరించాయి. మన దేశంలో ఈ ధరోణి రోజురోజుకూ మరింత ప్రబలిపోతోంది.
మేధో ప్రతిభకు స్థానమేది?
విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలో భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన ప్రజాస్వామిక సంస్కృతి అంతరించిపోతోంది. అంతేకాదు…ఆ సంస్కృతి స్థానంలో పాలకుల రాజకీయ భావజాలం ఊపిరి పోసుకుంటోంది. వర్సిటీలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలకు ‘జాతీయ’, ‘జాతి వ్యతిరేక’ ప్రాజెక్టులుగా ముద్ర వేస్తున్నారు. ఇక్కడ మేధోపరమైన ప్రతిభకు స్థానం లేదు. అధికార పక్షాల సిద్ధాంతాలతో మమేకమైతే సరిపోతుంది.
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ), ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) వంటి ప్రముఖ ప్రభుత్వ వర్సిటీలలో జరుగుతున్న సమావేశాలు, సెమినార్లు, వర్క్‌షాపులను నిశితంగా పరిశీలిస్తే కలవరపరచే ధోరణి కన్పిస్తుంది. ఒకప్పుడు హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగాలు ఉత్సాహభరితమైన చర్చా కేంద్రాలుగా ఉండేవి. ఇప్పుడవి అధికారికంగా ఆమోదించిన స్క్రిప్టులకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయాయి. కులం, లింగం, మైనారిటీ హక్కులు, జాతీయ వాదం, ప్రభుత్వ హింస వంటి అంశాలపై విమర్శనాత్మక దృక్పథాలను కలిగి ఉండడాన్ని ‘జాతి వ్యతిరేక’ లేదా ‘రాజకీయ ప్రేరేపిత’మైనవిగా చూపుతున్నారు. పాలక పక్షాల సిద్ధాంతాలు, భావజాలాలే దేశభక్తిపూరితమైనవిగా ప్రచారంలోకి వస్తున్నాయి.
నిధుల కేటాయింపులో వివక్ష
విశ్వవిద్యాలయాలలో చోటుచేసుకుంటున్న ఈ పరివర్తనలో నిధులే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చ్ (ఐసీఎస్‌ఎస్‌ఆర్) వంటి ప్రభుత్వ నిధులతో నడుస్తున్న సంస్థలు వికసిత్ భారత్ వంటి సర్కారు కార్యక్రమాలతో ముడిపడిన ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. దానికి భిన్నంగా ఉండే కార్యక్రమాలు, పరిశోధనలపై ‘ప్రభుత్వ వ్యతిరేక’ ముద్ర వేసి నిధుల కేటాయింపులో ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఆందోళన కేవలం నిధుల విడుదల గురించి మాత్రమే కాదు. విద్యార్థులు, పరిశోధకులలో పెంపొందిస్తున్న మేధో, పౌర విలువలపై అనేక మౌలిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విమర్శనాత్మక వైఖరులను తప్పుపట్టి సంబంధిత వ్యక్తులను ఇబ్బంది పెడుతున్నప్పుడు స్వతంత్ర ఆలోచనాపరులు ఎలా ముందుకు వస్తారు? మేధస్సుకే చోటు లేనప్పుడు, అది కుంచించుకొని పోయినప్పుడు వర్సిటీ పాలనకు కూడా ప్రమాదం ఎదురవుతుంది.
స్వేచ్ఛ అంటే విమర్శే కాదు
విద్యాపరమైన స్వేచ్ఛ అనేది కేవలం విమర్శలకే పరిమితం కాదు. అది విధానపరమై దృక్పథాలను బలోపేతం చేస్తుంది. ప్రజాస్వామిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తుంది. విశ్వవిద్యాలయాలు ప్రజాస్వామిక సంస్థలుగా తిరిగి తమ పాత్రను పోషించగలవా అన్నదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. విశ్వవిద్యాలయాలు తమ పాత్రను విస్మరిస్తే దాని ప్రభావం కేవలం క్యాంపస్‌కే పరిమితం కాదు. దాని గోడలను దాటి బయటికి కన్పిస్తుంది. విద్యా స్వేచ్ఛ కోసం జరిపే పోరాటాన్ని ప్రజాస్వామ్య పోరాటం నుంచి వేరు చేయడ సాధ్యం కాదు.



