ఆ ఫలాలు చివరి వ్యక్తి వరకు అందాలి : రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఉస్మానియాలో ఘనంగా ప్రారంభమైన ఏఐయూ సెంట్రల్ జోన్ వీసీల సదస్సు
ఏఐ, క్వాంటం టెక్నాలజీ ఆధారిత ఉన్నత విద్యపై విస్తృత చర్చలు
నవతెలంగాణ- ఉస్మానియా యూనివర్సిటీ
వర్సిటీలు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. భారత ఉన్నత విద్యా రంగంలో సాంకేతిక ఆధారిత విప్లవాత్మక మార్పులకు ఓయూ వేదికగా నిలిచింది. ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో గురువారం అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్ (ఏఐయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన రెండో ”సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల సదస్సు 2025-26”ను గవర్నర్ ఘనంగా ప్రారంభించారు. ”ఏఐ, క్వాంటం టెక్నాలజీ ఆధారిత ఉన్నత విద్యా సంస్థల నిర్మాణం” ప్రధాన అంశంగా రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి 100 మందికి పైగా వైస్ ఛాన్సలర్లు హాజరయ్యారు.
ఏఐయూ ప్రతినిధులతో పాటు ఏఐసీటీఈ, ఎన్‌ఏఏసీ, ఐసీఏఆర్ వంటి జాతీయ స్థాయి సంస్థల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు (ఏఐ), క్వాంటం టెక్నాలజీల కలయిక శాస్త్రీయ పురోగతికే పరిమితం కాకుండా నేటి విద్యా వ్యవస్థకు అత్యవసరమని అన్నారు. విశ్వవిద్యాలయాలు కేవలం సాంకేతిక వినియోగదారులుగా కాకుండా, భారతీయ విలువలను ప్రతిబింబించే స్వదేశీ ఏఐ పరిష్కారాల రూపకర్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. సాంకేతిక ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు అందించాలని సూచించారు.
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉన్నత విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఏఐ, క్వాంటం మయంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో యూనివర్సిటీల పనితీరు అద్భుతంగా ఉందన్నారు.తమ హయాంలో ఉన్నత విద్యామండలి చేపట్టిన విద్యా, ఉపాధి పరమైన సంస్కరణలు వివరించారు. ఓయూ వీసీ ప్రొ. కుమార్ మొలుగరం స్వాగతోపన్యాసం చేస్తూ విద్యార్థులను భావి సాంకేతికతకు సిద్ధం చేయాలని ఆకాంక్షించారు. విద్యావేత్తలు కేవలం జ్ఞానాన్ని అందించేవారిగా కాకుండా ‘ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్ట్స్’గా మారాలని ఆయన సూచించారు.



