ఓటరు జాబితాల సవరణపై ఈఆర్వోలకు శిక్షణ : ఎస్‌ఈసీ సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాల్లో చేర్చడంతో పాటు, అనర్హుల పేర్లను చట్టబద్ధంగా తొలగించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్‌రెడ్డి సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని సీఈఓ కార్యాలయంలో నాలుగు జిల్లాలకు చెందిన ఎన్నికల నమోదు అధికారులకు (ఈఆర్వోలు) ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మొత్తం 50 మంది ఈఆర్వోలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఈ శిక్షణలో ఓటరు జాబితాల తయారీ, సవరణ, నిర్వహణ విధానాలపై సమగ్ర అవగాహన కల్పించడంతో పాటు, త్వరలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై వివరంగా చర్చించారు.
ఎన్నికల జాబితాల్లో ఖచ్చితత్వం, పారదర్శకత, సమగ్రతను పాటించేందుకు ఫీల్డ్ స్థాయి అధికారుల సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు. క్లెయిమ్‌లు, సందేహాల పరిశీలన, చట్టపరమైన నిబంధనలు, సమయ పట్టికల అమలు, సాంకేతికత వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల జాబితాల పరిశుభ్రతను కాపాడడం ఈఆర్వోల కీలక బాధ్యత అని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ అమలులో ఎదురయ్యే సవాళ్లు, పరిష్కారాలపై చర్చించగా, అధికారుల సందేహాలను నివృత్తి చేసే ఇంటరాక్టివ్ సెషన్లు కూడా నిర్వహించారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు.



