డ్రైవర్ల నిర్లక్ష్యంతో పెరుగుతున్న ప్రమాదాలు
నవతెలంగాణ – పరకాల
పరకాల ఆర్టీసీ డిపో పరిధిలో బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం నిత్యకృత్యంగా మారింది. అతివేగంతో వాహనాలను నడుపుతూ, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా అదుపులేని వేగంతో దూసుకెళ్తున్న బస్సుల వల్ల పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
వరుస ప్రమాదాలు.. విషాదంగా మారుతున్న ప్రయాణం
గడిచిన కొద్ది రోజులుగా పరకాల పరిసర ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల కారణంగా వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం పరకాల బస్టాండ్‌లో జరిగిన ప్రమాదంలో పెద్దకోడెపాక గ్రామానికి చెందిన కోగిల బాల సమ్మయ్య తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మరవకముందే, ఆదివారం నాగారం గ్రామ పరిధిలో మరో ఘోర ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం బుజూనూరుకు చెందిన సరిగొమ్ముల హైమ, తన భర్త రవిందర్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై పరకాలకు వస్తుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైమ పరిస్థితి విషమంగా ఉండగా, రవిందర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
పట్టించుకోని డ్రైవర్లు.. నిండుతున్న ప్రాణాలు
గతంలోనూ ఇలాంటి ఘోరాలే చోటుచేసుకున్నాయి. వరంగల్-2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హనుమకొండ నుండి భూపాలపల్లి వెళ్తూ, పరకాల బస్టాండ్‌లోకి మలుపు తీసుకునే క్రమంలో రాధమ్మ అనే వృద్ధురాలిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఇలా వెలుగులోకి వచ్చినవి కొన్ని మాత్రమేనని, లెక్కకు మించిన ప్రమాదాలు బయటకు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రధాన రహదారులు, మలుపులు, జనసంచారం ఎక్కువగా ఉండే చోట్ల డ్రైవర్లు కనీస జాగ్రత్తలు పాటించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
కఠిన చర్యలు చేపట్టాలి: డిమాండ్ చేస్తున్న ప్రయాణికులు
రద్దీ సమయంలో కూడా వేగాన్ని నియంత్రించని డ్రైవర్ల తీరుపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇప్పటికైనా మేల్కొని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదాలను నివారించేందుకు బస్టాండ్ పరిసరాల్లో, జనసమ్మర్థం ఉండే ప్రాంతాల్లో వేగ పరిమితులు విధించాలని, డ్రైవర్లకు నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.



