Monday, June 22, 2026
E-PAPER
Homeదర్వాజసామాజిక కథగా నాగటితరం

సామాజిక కథగా నాగటితరం

- Advertisement -

కవి రచయిత డాక్టర్ నందిని సిధారెడ్డి ఉద్యమ కవిగా ప్రజాకవిగా సుపరిచితుడు. వీరి కలం నుంచి జాలువారిన తాజా రచన ‘నాగటితరం` ప్రజల పక్షాన నిలబడిన బంధారం గ్రామానికి చెందిన బాలసిద్ధారెడ్డి కథ. నవలలో బాసిరెడ్డిగా పరిచయమవుతాడు. అతను ఎవరో కాదు రచయిత సిధారెడ్డి తండ్రి. ఈ నవల మొత్తం 25 భాగాలుగా ఉంది. ప్రతిభాగము ఆసక్తిగా చదివిస్తుంది.

ఒకప్పటి మన గ్రామాల ఆర్థిక సామాజిక స్థితులను ప్రతిబింభిస్తుంది. ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని స్ఫూర్తిని కలిగిస్తుంది. కథ చెప్పడంలో మెలుకువలెన్నో తెలిసిన రచయిత ప్రజలను చైతన్యపరచిన అనేక సంఘటనల సమాహారంగా, సంభాషణాత్మకంగా ఈ కథను మలిచారు. ఇందులోని సన్నివేశాలు సంఘటనలు ఊహాజనితాలు కావు వాస్తవాలు. నాటి కాలంలో భూస్వాములు జమీందార్లు దొరలు గడీలలో ఉన్నవారు పేదలు అట్టడుగు వర్గాల ప్రజలను పీడించారు. రజాకర్లు నిజాం పోలీసులు గుండాల దోపిడీ కిరాతకాలు ప్రజలను పోరాట దిశగా నడిపించాయి. సాయుధ రైతాంగ పోరాటం, సామాన్య ప్రజల తిరుగుబాటుకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించింది. గ్రామ కమిటీల ఏర్పాటు వలన కొంతమందికైనా న్యాయం జరిగింది. బంధారం గ్రామంలోనూ రజాకర్లు గుండాలు నానా బీభత్సాన్ని సృష్టించారు. రెండవసారి వచ్చినప్పుడు మాత్రం ముందుగానే అనుకున్న ప్రకారం బాసిరెడ్డి అతని మిత్రులు గ్రామస్తులు కలిసి రజాకర్లను తరిమి తరిమి కొట్టారు. అప్పటినుండి బందా రం పేరు బాసిరెడ్డి పేరు పదూళ్లకు పాకిపోయింది. భూపాల్ (సురపనేని జనార్ధన్) వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి.నక్సలైట్ నాయకుడు.

వామపక్ష భావాలున్న ఉద్యమకారుడు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త బాసిరెడ్డి అతనికాశ్రయం ఇచ్చాడు. సైకిల్ మీద అతన్ని కూసుండ పెట్టుకుని, అన్ని ఊర్లలోని తన సన్నిహితులకు పరిచయం చేస్తూ, మన కోసం వచ్చిండు. యాడదిరిగిన యాల్లకు వస్తే ఇంతన్నం పెట్టుండ్రి అని చెప్పేవాడు. ఇంచుమించు నవల సగం వరకు భూపాల్ కనిపిస్తాడు. కానీ ఒక విషాదం ఏమిటంటే, మెదక్ జిల్లా గిరాయిపల్లి ఎన్కౌంటర్లో చనిపోయాడు. నలుగురు యువకులను చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. ఈ వార్త తెచ్చిన నారాయణతో బాసిరెడ్డి ‘ఏ జన్మల ఏ పేగు కలిసిందో… ఉన్నోళ్ళను ఇ డిచిపెట్టి మనతోనే కలిసిరి.పుట్టిన ఊరు యాడనో… ఈడ మంట్లే కలిసిరి’ అని నారాయణను ఓదారుస్తూ, తాను దుఃఖపడ్డాడు. ‘తక్కువ బంధమే అయినా త్యాగబంధం మది’. బాసిరెడ్డి బాల్యం దుర్భరమైనది. చదువుతున్నప్పుడు ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది. రెండు నెలలకు తల్లిని, రెండు సంవత్సరాలకు తండ్రిని, ఐదు సంవత్సరాలకు బాపమ్మను పోగొట్టుకొని అనాధ అయ్యాడు. ఒంటరి పసివాడిని (సగం ఇస్సా ఉన్నది కనుక) పెదనాన్న కొడుకు నాగయ్య చేరదీశాడు. పసితనపు మురిపాలు లేవు. ఎప్పుడూ పని పని. పైగా వదినే ఎత్తేసుడు సాపిచ్చుడు. సలిగట్కా పాచిపోయిన గట్కా పెట్టుడు. పక్కనే కూసున్న అన్నకు ఉడుకన్నం నెయ్యి.

ఇక భరించలేక ఎదురు తిరిగాడు.ఇల్లు విడిచిపెట్టి, బాయి దగ్గరికే పోయి ఉన్నడు. కాలక్రమంలో పోరాటం చేసి తన భూమిని దక్కించుకున్నాడు. కష్టాలు మనిషిని రాటు తెలుస్తవి. సమస్యలు చుట్టుముట్టినప్పుడు వాటినుండి బయటపడాలనే ఆలోచనలు పుట్టుకొస్తాయి.బహుశా ఈ నేపథ్యమే అతన్ని న్యాయం వైపు పోరాటం వైపు నడిపించి ఉంటాయి. బందారంలో నిరుపేదల సంఘం ఏర్పాటు చేసి, ధైర్యంగా నాగండ్లు కట్టించి, పటేండ్ల భూమిగా చలామణి అవుతున్న సర్కార్ భూమిని దున్నించాడు. ముచ్చాల గ్రామ దొర గోపాల్ రెడ్డి ఎనిమిది వందల ఎకరాల పట్టేదారు. పట్నంలో నివాసం. సగం భూమి కౌలుకి ఇచ్చేవాడు. ఎప్పుడైనా గ్రామానికి వస్తే అందరూ అతనికి భయపడాలి. ఓసారి అతని మనుషులు పండించిన పంట నంత బస్తాల్లో నింపి బండ్ల కెత్తిండ్రు. ఎదురు తిరిగిన కిష్టయ్యను కొట్టి పండబెట్టి తొక్కి చెట్టుకు కట్టేసింన్రు. మిగతా రైతులు భయపడి వెనక్కి తగ్గారు. బండి వెనకాలే పరిగెత్తిన కిష్టయ్య భార్యను చేతులు విరిచి మూట కట్టి బస్తాల నడుమ వేసి తీసుకు పోయారు. తరువాత బాధ చెప్పుకుందామని గడిలోకి వచ్చిన రైతులను కిష్టయ్యను రాతి గుంజలకు కట్టేశారు. ఈ ముచ్చాల రైతుల్ని విడిపించి ధాన్యం ఇప్పించాలని బాసిరెడ్డి రైతులందరినీ కూడగట్టి ‘ఒకేసారి అన్ని దిక్కుల నుండి గడికి చేరుకునే ఉపాయం చెప్పి ఉత్తేజ పరిచిండు’ అనుకున్నట్టుగానే రైతులను విడిపించుకుని ధాన్యాన్ని తీసుకొని వచ్చిండ్రు. పట్టా లేకుండా దొర అనుభవిస్తున్న భూమిలో గ్రామస్తులు గుడిసెలు వేసుకున్నారు. కొద్ది రోజుల్లోనే అక్కడ లెనిన్ నగర్ వెలిసింది. ముచ్చాల గ్రామస్తులు ‘తోవ జూపే పెద్దన్నగా బాసిరెడ్డిని హత్తుకున్నారు’.

బాసిరెడ్డి ఆలోచనా పరుడు. లోకానుభవం దండిగా ఉన్నవాడు. సమస్య మూలం ఎక్కడో తెలుసుకొని సమూలంగా పరిష్కరించేవాడు. న్యాయం వైపు నిలబడే వాడు. కాలంగాక ఎవుసం పనులు లేక తిండి లేక రైతుకూలీలు షావుకారు గౌరయ్యను గాసమడితే ఇవ్వనన్నాడని బాసిరెడ్డికి తమ గోడు చెప్పుకున్నారు. రెండేళ్లుగా ఒక కారణంతో షావుకారుతో సంబంధాలు లేవు తనకు. అయినా ‘ఇంత మంది బతుకు కంటే తన పంతం ఎక్కువ కాదు’ అనుకుని గౌరయ్యని అడిగి నచ్చజెప్పి తానే జమానతువడి గాసం ఇప్పించాడు. ప్రజల కోసం బతుకుడు అంటే ఇదే కదా! లక్ష్మారెడ్డికి ప్రాణం మీదికి వచ్చి,రెండు గడియల్లో స్వర్ణభస్మం కలిపిన మందు వేయాలన్నాడు వైద్యుడు. ఎవరి దగ్గర పైసల్లేవు. బాసిరెడ్డి భార్య రత్నమ్మ బంగారు కంటే కుదువబెట్టి వైద్యం చేయించాడు. ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న బాసిరెడ్డి భార్యను కొట్టేవాడు. బూతులు తిట్టేవాడు. ఇదే పటేలు భార్యను విపరీతంగా కొడుతున్న నరసయ్యకు అడ్డం పోయి విడిపించి ఇంటికి తీసుకువచ్చి “నర్సా ఆడిదాన్ని కొడితే తప్పు కాదుర, లోకమేమంటది. ఆడిదంటే గోవసొంటి జీవిగాదుర, ఎట్ల కొట్టబుద్ధయిందిరా” అని సుద్దులు చెప్తుంటే, దర్వాజాలో నిలబడ్డ రత్నవ్వ ‘మందికి బుద్ధి చెప్పాలి. మన బుద్ధి దిగూట్లే పెట్టాలి. మా పటేలుకు పెండ్లాం మాత్రం ఆడిది గాదు…’ అని గొనుక్కుంది.

తండ్రిలో ఉన్న ఈ లోపం పట్ల నిరసన. పుస్తకాన్ని అంకితం ఇస్తూ కూడా ‘బాపును భరించిన అవ్వకు’అన్నాడు. దాపరికాలు మొహమాటలు లేకుండా ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా సూటిగా చెప్పడం అభినందనీయం.
సిద్దిపేటలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ మీటింగ్లో (ఎమర్జెన్సీ పిరియడ్) ఇందిరా గాంధీకి అనుకూలంగా లైన్ తీసుకున్నట్టు తెలిపారు. నక్సలైట్లకు ఏ సహాయ సహకారాలు అందించవద్దని కూడా చెప్పారు. వాళ్లు ప్రజల కోసమేగా కొట్లాడుతుండ్రు. తిండి పెడితే తప్పేమిటి? అని బాసిరెడ్డి అభిప్రాయం. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అక్కడే స్పష్టంగా చెప్పాడు. ఈ విషయంలోనే విపరీతమైన సంఘర్షణకు లోనయ్యాడు.
పార్టీయే తనకన్నీ. పార్టీ లేకపోతే తాను లేడు. గౌరవాన్ని, పలుకుబడిని, ఎన్నో పరిచయాలను ఇచ్చింది. అలాంటి పార్టీని వదిలి పెట్టాలంటే విపరీతంగా బాధపడ్డాడు. కానీ మనసుకు నచ్చ చెప్పుకోలేకపోయాడు. చివరికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు ఇది బాసిరెడ్డి కథ. నాటి నాగటితరం కథ. తనకు ఎవరూ లేకున్నా, అందరికీ తానై మంచికి చెడ్డకి, ఆపతికి సాపతికి, ఊరందరికీ ధీముగా బతికిండు. జీవితం నుండి ఎదిగొచ్చిన నేత (బాసిరెడ్డి) బాలసిద్ధారెడ్డి.

రచయిత సిధారెడ్డి నాగటి తరాన్ని చూసినవాడు. నాగేటి చాల్లల్లో నడిచిన వాడు.విషయాన్ని గాఢతగా చదువరుల మనసుకు హత్తుకునేలా పల్లీయ జీవభాషను సామెతలను అత్యంత సహజంగా వాడుతుంటారు. ఉదా: ఇయ్యర మయ్యర నడుస్తున్నడు, కడుపుల కలికలి అయితది, గోడు ఎల్లబోసుకున్నడు, మిడతలు వచ్చినట్టే వచ్చిండ్రు,ఊక్కుంట ఊక్కుంట పోలిసోల్లు వొచ్చిండ్రు, అది పనిపోతు, దొంగలకు సద్ది గడతది,/ పిసుక్కొని పిసుక్కొని ఆశతోనే బతుకుతుంది,/ అగ్గువ సగ్గువకు అమ్మేది, ఎల్ల తీసుకునే ఇగురం/ కావాలి, మంది మాటలువిని మార్మానం/ పోతే మల్లొచ్చే వరకు ఇల్లు కాలిపోయిందంట,/ చేస్తే నొస్తది గాని దోస్తే నొస్తదా? ఇలా ఎన్నో… ఈ నవల చదువుతుంటే మన పెద్దల మాటలు గుర్తుకొస్తవి.సిధారెడ్డి సాహితీ ప్రస్థానంలో ఈ నవలొక మైలురాయి అని చెప్పొచ్చు.

గడ్డం సులోచన, 7702891559

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -