రూట్ మార్చిన మోడీ సర్కార్
గల్ఫ్ దేశాల్ని కాదని
అమెరికా నుంచి గ్యాస్ ఇంపోర్ట్
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తున్న తరుణంలో భారత్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వంటగ్యాస్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా గల్ఫ్ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ దిగుమతులను భారీగా వైవిధ్యీకరించింది. అమెరికా, ఇరాన్ వంటి దేశాల నుంచి దిగుమతులను ముమ్మరం చేసింది. అదే సమయంలో, అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆ నష్టాన్ని తామే భరించాయి. అని పేర్కోంటున్నా యి. అయితే ట్రంప్ మెప్పుకోసం ఎల్పీజీని మోడీ సర్కార్ దిగుమతి చేసుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
’90 శాతం గల్ఫ్ దేశాల నుంచే’
గతంలో భారత్ తన ఎల్‌పీజీ దిగుమతుల్లో దాదాపు 90 శాతం కేవలం గల్ఫ్ దేశాల నుంచే పొందేది. అయితే అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో, సరఫరా దెబ్బతినకుండా ఉండేందుకు భారత్ తన దిగుమతుల వ్యూహాన్ని మార్చింది. ప్రముఖ రేటింగ్ సంస్థ ‘క్రిసిల్’ నివేదిక ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా నుంచి భారత్ కేవలం 8 శాతం ఎల్పీజీ ని దిగుమతి చేసుకోగా, ఏప్రిల్ నాటికి అది ఏకంగా మూడో వంతుకు అంటే సుమారు 33 శాతానికి పెరిగింది. 2025 చివరలో అమెరికాతో కుదుర్చుకున్న 2.2 మిలియన్ టన్నుల సరఫరా ఒప్పందం ఈ క్లిష్ట సమయంలో భారత్‌కు ఎంతగానో అండగా నిలిచింది.
ఇండస్ట్రియల్ వినియోగదారులు ధరల భారం భరించలేక
కేవలం అమెరికా మాత్రమే కాదు, చాలా కాలం తర్వాత ఇరాన్ కూడా మళ్లీ భారత్ దిగుమతుల జాబితాలోకి చేరింది. ఏప్రిల్ దిగుమతుల్లో ఇరాన్ వాటా 6 శాతంగా నమోదైంది. వీటితో పాటు అర్జెంటీనా, చిలీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి సుదూర దేశాల నుంచి కూడా భారత్ ఎల్పీజీని సేకరించింది. అయితే ఈ సుదూర ప్రయాణాల వల్ల రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు ఆకాశాన్నంటాయి. భారత దిగుమతులకు ప్రామాణికమైన ‘సౌదీ అరామ్‌కో కాంట్రాక్ట్ ప్రైస్’ ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య ఏకంగా 46 శాతం పెరిగింది. ధరల పెరుగుదల, పరిమిత లభ్యత కారణంగా భారత్‌లో ఎల్‌పీజీ వినియోగం కూడా తగ్గింది. ఫిబ్రవరిలో 3.2 మిలియన్ టన్నులుగా ఉన్న వినియోగం, ఏప్రిల్‌లో 2.47 మిలియన్ టన్నులకు పడిపోయింది. ముఖ్యంగా మార్కెట్ ధరలతో ముడిపడి ఉన్న కమర్షియల్, ఇండస్ట్రియల్ వినియోగదారులు ధరల భారం భరించలేక వాడకాన్ని తగ్గించుకున్నారు.
నిపుణులు ఏమంటున్నారంటే!
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ప్రధాన వాణిజ్య మార్గాలు పునఃప్రారంభం అవుతుండటంతో అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తాజా సంక్షోభం భారతదేశానికి ఒక పెద్ద పాఠం నేర్పింది. భవిష్యత్తులో ఇలాంటి భౌగోళిక రాజకీయ ఆటంకాలు ఎదురైనా తట్టుకునేలా దిగుమతులను ఒకే ప్రాంతం నుంచి మరిన్ని దేశాలకు విస్తరించుకోవడం, దేశీయంగా ఉత్పత్తి ని పెంచుకోవడం ఎంత కీలకమో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.



