Monday, June 22, 2026
E-PAPER
Homeజాతీయంప్ర‌ధాన్ గో బ్యాక్, గో ప్రధాన్ గో’’

ప్ర‌ధాన్ గో బ్యాక్, గో ప్రధాన్ గో’’

- Advertisement -

పళ్లెలపై చప్పుళ్లు
మారుమోగిన జంతర్
మంతర్ ధర్నా చౌక్
కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాల్సిందే
రెండో రోజు కొన‌సాగిన సీజేపీ ఆందోళ‌న‌

నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
నీట్ ప్రశ్నపత్రం లీక్, సీబీఎస్ఈ అవకతవకలపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళ‌న రెండో రోజూ కూడా శాంతియుతంగా కొన‌సాగింది. నిరసనకారులను ఖాళీ చేయించడానికి ఢిల్లీ పోలీసులు పలుమార్లు ప్రయత్నించినా విఫలమయ్యారు. శనివారం మధ్యాహ్నం 1 గంటకు జంతర్ మంతర్ వద్ద తమ నిరసనను ప్రారంభించిన సీజేపీ, నిరవధిక ఆందోళ‌న‌ను ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు సమ్మె కొనసాగుతుందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు.శనివారం రాత్రి జంతర్ మంతర్ వద్ద వందలాది మంది విద్యార్థులు ఆందోళ‌న‌ను కొనసాగించారు. రాత్రి ఆందోళ‌న ప్రాంతం వ‌ద్ద రోడ్డుపైనే విద్యార్థులు, యువ‌త, వారి కుటుంబ స‌భ్యులు, బంధువులు నిద్రించారు. నిరసనకారులను ఖాళీ చేయించడానికి, మోహరించిన కేంద్ర బలగాలతో సహా పలు దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే, నిరసనకారుల దృఢ సంకల్పం ముందు కేంద్ర ప్రభుత్వం పంపిన పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది. పోలీసులు విద్యుత్తును నిలిపివేసి, నీరు, ఆహార పంపిణీని అడ్డుకున్నప్పటికీ, కార్యకర్తలు చెదరలేదు.

ఆదివారం ఉద‌యం నుంచే వంద‌లాది మంది సీజేపీ కార్య‌క‌ర్త‌లు, విద్యార్థులు, యువ‌త‌, విద్యార్థి సంఘాల నేత‌లు త‌మ ఆందోళ‌న కొన‌సాగించారు. ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, ఎఐఎస్ఏ వంటి సంఘాల‌ కార్యకర్తలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఆదివారం కూడా ఈ నిరసనలో పాల్గొనేందుకు చాలా మంది ఢిల్లీకి త‌ర‌లివ‌చ్చారు. నిరసన తెలిపేందుకు వస్తున్న వారిని పోలీసులు మొదట అడ్డుకున్నప్పటికీ, ఆ తరువాత వెనక్కి తగ్గారు. నీట్ ప్ర‌శ్నాప‌త్రం లీక్‌, సీబీఎస్ఈ అవ‌క‌త‌వ‌క‌లు వంటి విద్యా రంగ వైఫల్యాలకు బాధ్య‌త వ‌హిస్తూ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండును పున‌రుద్ఘాటించారు. స్టీల్ ప‌ళ్లాల‌ను చెంచాల‌తో మోగిస్తూ ‘‘ప్ర‌ధాన్ గో బ్యాక్, గో ప్రధాన్ గో’’ అంటూ నినాదాల హోరెత్తించారు.విద్యార్థుల పోరాటానికి దేశవ్యాప్తంగా ఉన్న రైతులు అండగా నిలవాలని అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు. “రైతులు తమ హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు, విద్యార్థులు వారికి భుజం భుజం కలిపి నిలబడ్డారు. నేడు విద్యార్థులకు అదే సంఘీభావం అవసరం. దయచేసి జంతర్ మంతర్ వద్ద మాతో చేరండి” అని అన్నారు. నీట్ పేపర్ లీక్ వివాదంలో ప్రధాన సూత్రధారి అయిన ప్రధాన్ రాజీనామా చేసే వరకు తాము ఇక్క‌డి నుంచి వెళ్లబోమని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -