భారత్‌లో వృద్ధులపై పెరుగుతున్న వేధింపులు
కుటుంబసభ్యులే శత్రువులు..సొంతిళ్లలోనే ఒంటరి బతుకులు
అవమానాలు, నిర్లక్ష్యం, ఆర్థిక దోపిడి సర్వసాధారణం..పట్టించుకోని ప్రభుత్వాలు
న్యూఢిల్లీ : భారతీయ కుటుంబ వ్యవస్థపై ఉన్న నమ్మకాలు ఇప్పుడు సన్నగిల్లుతున్నాయి. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందని భావిస్తున్న కుటుంబం ఇప్పుడు ఆ వృద్ధుల్నే భారంగా భావిస్తుంది. ఇప్పటికే చిన్న కుటుంబాల పేరుతో కుటుంబవ్యవస్థ ఛిద్రమైంది. ఇప్పుడు ఆ చిన్న కుటుంబాల్లో నలుగురికి మించి ఏ ఒక్కరు ఉన్నా, వయసు రీత్యా పెద్దగా ఉన్నవారు ఆ కుటుంబానికే భారంగా కనిపిస్తున్నారు. ‘ప్రపంచ వృద్ధులపై వేధింపుల అవగాహన దినం’ (డబ్ల్యూఈఏఏడీ) సందర్భంగా వచ్చిన అనేక అధ్యయనాలు ఈ విషయాలను వెల్లడించాయి. గతంలో భారత్‌లో కుటుంబ వ్యవస్థ వృద్ధులకు రక్షణ కవచమని భావించేవారు. ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా దేశంలోని పరిస్థితులు కనిపిస్తున్నాయి. వృద్ధులపై వేధింపులు వారి సొంత ఇండ్లల్లోనే జరుగుతున్నాయని నివేదికలు చెప్తున్నాయి. కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్న 82 శాతం మంది వృద్ధుల్లో చాలా మంది శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆ నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో వృద్ధులు తమ జీవిత చివరి దశలో గౌరవానికి నోచుకోలేకపోతున్నారు. ఒంటరితనం అనే శిక్షను అనుభవిస్తున్నారు. ఇండ్లల్లోనే పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నా, అవేవీ బయటకు కనిపించకపోడం ఆందోళనకరం.
భారత్‌లో పెరుగుతున్న వృద్ధ జనాభా
భారత్‌లో ప్రస్తుతం జనాభా సంఖ్య మార్పు వేగం జరుగుతోంది. 60 ఏండ్లు పైబడినవారి జనాభా 2036 నాటికి 23 కోట్లకు పైగా చేరుతుందని అంచనా. ప్రస్తుతం దేశంలో 10 కోట్ల మందికి పైగా వృద్ధులు ఉన్నారు. దేశం మొత్తం జనాభాలో వారి వాటా సుమారు 9 శాతంగా ఉంది. అయితే దేశవ్యాప్తంగా వృద్ధుల జనాభా పెరుగుదల ఆయా రాష్ట్రాల్లో భిన్నంగా ఉంది. ఉత్తర, తూర్పు రాష్ట్రాలు యువ జనాభాతో నిండి ఉన్నాయి. దక్షిణ రాష్ట్రాలు మాత్రం వేగంగా వృద్ధాప్య సమాజాలుగా మారుతున్నాయి. 2036 నాటికి కేరళలో ప్రతి నలుగురిలో ఒకరు వృద్ధులే ఉండే అవకాశం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి.
కొడుకులు, కోడళ్ల నుంచే వేధింపులు
హెల్పేజ్ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం… వృద్ధులపై వేధింపులకు పాల్పడేవారిలో కుమారులే మొదటి స్థానంలో ఉన్నారు. వేధింపులు ఎదుర్కొన్న వృద్ధుల్లో 35 శాతం మంది తమ కుమారులే ప్రధాన కారణమని చెప్పారు. ఆ తర్వాత కోడళ్ల పాత్ర ఎక్కువగా కనిపించింది. ఇక జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం 2023-24 మధ్య వృద్ధులపై నేరాలు, వేధింపుల కేసులు 17 నుంచి 18 శాతం పెరిగాయి. ఎల్డర్‌లైన్ హెల్ప్‌లైన్‌కు వస్తున్న ఫిర్యాదుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. హెల్పేజ్ ఇండియా సర్వేలో 65 శాతం మంది వృద్ధులు ఆర్థిక భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి స్వంత ఆదాయం లేదు. ముఖ్యంగా వృద్ధ మహిళల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. ఆరోగ్య పరంగా కూడా సగానికి పైగా వృద్ధులు ఒకేసారి అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. కేవలం 31 శాతం మందికే ఆరోగ్య బీమా ఉండటం గమనార్హం.
చట్టాల్లో పరిమితులు
వృద్ధుల సంక్షేమం కోసం 2007లో రూపొందించిన ‘మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్’ ఉన్నప్పటికీ కుటుంబాల్లో జరిగే మానసిక వేధింపులు, అవమానాలు, ఆర్థిక దోపిడీ వంటి అంశాలను చట్టపరంగా నిరూపిం చడం కష్టమవుతోంది. అలాగే న్యాయస్థానాల్లోనూ క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. కేరళ హైకోర్టు 2024లో ఇచ్చిన ఒక కీలక తీర్పులో కుటుంబ వివాదాలను ‘వృద్ధుల పరిత్యాగం’ (వదిలివేయడం)గా పరిగణిం చలేమని స్పష్టం చేసింది. పూర్తిగా బాధ్యతలను వదిలిం చుకునే ఉద్దేశంతో వృద్ధులను నిర్లక్ష్యం చేసినప్పుడు మాత్రమే అది నేరంగా పరిగణించబడుతుందని పేర్కొంది. దీంతో ఇలాంటి పరిమితులు దేశంలోని వృద్ధులకు శాపంగా మారుతున్నాయి.
ప్రపంచవ్యాప్త సమస్య
ఒక్క భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ వృద్ధులపై వేధింపులు జరుగుతున్నాయి. 35 దేశాల్లో నిర్వహించిన 94 అధ్యయనాల సమీక్ష ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురు వృద్ధుల్లో ఒకరు ఏదో ఒక రూపంలో వేధింపులను ఎదుర్కొంటున్నారు. భావోద్వేగ, మానసిక వేధింపులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఆ తర్వాత స్థానల్లో నిర్లక్ష్యం, ఆర్థిక దోపిడీలు ఉన్నాయి. ఆసియాలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని పరిశోధనలు చెప్తున్నాయి.
ఆచరణలో లేని నిటి ఆయోగ్ సిఫార్సులు
భారత్‌లో వృద్ధులను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములుగా చూడాల్సిన అవసరం ఉందని నిటి ఆయోగ్ సూచిస్తోంది. ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం, ఆర్థిక సాధికారత, డిజిటల్ యాక్సెస్ అనే నాలుగు స్తంభాలపై ఆధారపడిన సమగ్ర వృద్ధ సంరక్షణ వ్యవస్థను నిర్మించాలని సూచించింది. పెన్షన్ వ్యవస్థ బలోపేతం, వృద్ధులకు ఉపాధి అవకాశాలు, దీర్ఘకాలిక సంరక్షణ కేంద్రాలు, ఆరోగ్య బీమా విస్తరణ, గ్రామ స్థాయిలో పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు వంటి చర్యలను నిటి ఆయోగ్ సిఫారసు చేసింది. అయితే దేశవ్యాప్తంగా కోట్లాది మంది వృద్ధులు పెన్షన్, ఆరోగ్య భద్రత, సంరక్షణ సేవలకు ఇంకా దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మార్కెట్ ఆధారిత పరిష్కారాలు మాత్రమే సరిపోవని సామాజిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విఫలమవుతున్న ప్రభుత్వాలు
దేశంలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతున్నప్పటికీ వారి సంక్షేమం, భద్రత, సంరక్షణకు అవసరమైన వ్యవస్థలను బలోపేతం చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. వృద్ధులపై వేధింపులు, కఠిన ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య సేవల కొరత వంటి సమస్యలు పెరుగుతున్నప్పటికీ, వాటిని ఎదుర్కొనేందుకు సమగ్ర విధానాలు, పథకాలు, తగిన బడ్జెట్ కేటాయింపులు కనిపించడం లేదని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పురోగతి, అక్షరాస్యత పెరుగుదల ఎంత ఉన్నా, సమాజాన్ని నిర్మించిన వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే ఆ అభివృద్ధికి అర్థం ఉండదు. భారత్‌లో వృద్ధుల గౌరవం, భద్రత, స్వావలంబనను కాపాడటం కుటుంబాలతోపాటు ప్రభుత్వాలు, సమాజానికీ పెద్ద బాధ్యతగా మారాల్సిన అవసరం ఉందని సామాజిక కార్యకర్తలు సూచిస్తు న్నారు. వృద్ధుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నా, అవి ప్రకటనలు, ప్రచారం కోసమే పరిమితమవుతుండటం గమనార్హం.



