పలువురు కేంద్ర మంత్రులతో భేటీలు
పార్టీ అగ్రనేతలనూ కలిసే అవకాశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ రాష్ట్రాభివృద్ధి, పలు కీలక ప్రాజెక్ట్ అనుమతులే ప్రధాన లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేయనున్నారు. శనివారం ముంబయిలో జరిగిన ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మనవరాలు, ఎంపీ సుప్రియా సులే కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా సాయంత్రం ఏడు గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. నేడు, రేపు(22, 23 తేదిల్లో) సీఎం ఢిల్లీలోనే ఉండనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా… కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి, అశ్వినీ వైష్ణవ్, మనోహర్‌లాల్ ఖట్టర్, పీయూష్ గోయల్, ఇతర మంత్రుల అపాయింట్మెంట్ కోరినట్టు సమాచారం.
రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ
ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాత్ సింగ్‌తో సీఎం భేటీ కానున్నట్టు తెలిసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది సుందరీకరణ, పునరుజ్జీవన ప్రాజెక్ట్ అభివృద్ధి పనులకు కేంద్ర రక్షణ శాఖ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడానికి కావాల్సిన ‘గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ’ కోసం 83 ఎకరాల భూము లు ఇవ్వడానికి రక్షణ శాఖ అంగీకారం తెలిపింది. గోల్కొండ ఆర్టిలరీ పరిధి లోని రూ. 533 కోట్ల విలువైన భూములు బదలాయింపునకు ఆమోదం తెలిపిం ది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి సీఎం కృతజ్ఞతలు తెలపనున్నారు. అలాగే సికింద్రాబాద్ ఫ్లైఓవర్ నిర్మాణాలకు కంటోన్మెంట్ భూముల అప్పగింత, సైనిక్ స్కూల్, ఇతర రక్షణ భూముల బదలాయింపు అంశాలపై మరోసారి విజ్ఞప్తి చేయనున్నట్టు సమాచారం.
రైతు సమస్యలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చర్చలు
అభివృద్ధితో పాటు రైతులు ఎదుర్కొంటోన్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా పారా బాయిల్డ్ బియ్యం, ధాన్యం ఉత్పత్తి, బకాయిల విడుదల అంశంపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి భేటీ కానున్నట్టు సమాచారం. గత పర్యటనలో భాగంగా పారాబాయిల్డ్ బియ్యాన్ని సేకరించాలని సీఎం కోరారు. అలాగే ఈసారి భారీ దిగుబడి నేపథ్యంలో అంచనాకు మించిన సేకరణ, రాష్ట్రం లో బియ్యం సేకరణలో కలుగుతోన్న ఇబ్బందులపై చర్చించనున్నారు. దీంతో పాటు పాఠశాలలు, హాస్టళ్లు, ఐసీడీఎస్ కేంద్రాల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ (ఎఫ్ఆర్‌కే) పంపిణీని పునరుద్ధరించాలని కోరనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
రైల్వే మంత్రితో భేటీ..
వీటితో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ విస్తరణ, దానికి సంబంధించిన నిధుల సమీకరణపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. మెట్రో ప్రాజెక్టు కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్‌సీ) నుంచి రుణం పొందే అంశంపై చర్చించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అపాయింట్మెంట్ కోరినట్టు తెలిసింది. ఈ భేటీలో… మెట్రో రైల్ ప్రాజెక్ట్ పురోగతికి సహకరించాలని కోరనున్నారు. అయితే… కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 22 లేదా 23వ తేదీల్లో ఢిల్లీలో ఉంటాననీ.. రైల్వే మంత్రితో సమయం ఖరారు చేయిస్తే, ఇద్దరం కలిసి వెళ్లి తెలంగాణకు అత్యంత కీలకమైన ఈ అంశాలపై చర్చిద్దామని లేఖలో స్పష్టం చేశారు. మెట్రో రైల్ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని కోరుతూ ఈ నెల 18నే అన్ని వివరాలతో కూడిన లేఖను పంపినట్టు సీఎం గుర్తుచేశారు. కాగా… ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఒప్పంద పత్రాలు, అనుబంధ డాక్యుమెంట్లు, వాస్తవ రికార్డులతో ఢిల్లీలో ఉండాలని సీఎం అధికారులను ఆదేశించినట్టు సమాచారం. అలాగే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్‌ను సీఎంఓ కోరినట్టు తెలిసింది. జహీరాబాద్ ఇండస్ట్రీయల్, వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్క్, హైదరాబాద్–విజయవాడ పారిశ్రామిక కారిడార్, ఇతర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. వీరితో పాటు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర మంత్రుల సమయం కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
అధిష్టాన పెద్దలతోనూ భేటీ
ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ పెద్దలతోనూ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. ప్రధానంగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమయం కోరినట్టు తెలిసింది. అలాగే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ నేషనల్ జనరల్ సెక్రెటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీలను కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను హైకమాండ్ పెద్దలకు వివరించనున్నారు. అలాగే త్వరలో మంత్రివర్గ విస్తరణ, శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నందున ఈ అంశాలపై కీలకంగా చర్చించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం, పార్టీ చేపట్టాల్సిన పలు కార్యక్రమాలు, ఇతర విషయాలపై చర్చించనున్నారు.



