Monday, June 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రజాక్షేత్రంలో పోరాటాలే కీల‌కం

ప్రజాక్షేత్రంలో పోరాటాలే కీల‌కం

- Advertisement -

గ్రామీణ పేదలను ఐక్యం చేయాలి
తెలంగాణ గడ్డపై జరిగిన భూ పోరాటాలు స్ఫూర్తిదాయకం
ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం
అదానీకి ఎఫ్‌సీఐ గోదాములివ్వ‌టం దారుణం
వ్య‌కాస రాష్ట్ర మ‌హాస‌భ ప్రారంభోప‌న్యాసంలో
ఆ సంఘం అఖిల భార‌త అధ్య‌క్షులు ఎ విజ‌య రాఘ‌వ‌న్

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి అచ్చిన ప్ర‌శాంత్
ప్ర‌జాక్షేత్రంలో పోరాటాల‌ను బ‌లోపేతం చేయ‌టం ద్వారానే వ్య‌వ‌సాయ కార్మికుల హ‌క్కుల‌ను కాపాడుకోగ‌ల‌మ‌ని అఖిల భార‌త వ్య‌వ‌సాయ కార్మిక సంఘం అధ్య‌క్షులు ఎ.విజ‌య రాఘ‌వ‌న్ తెలిపారు. ఇందులో భాగంగా గ్రామాల్లోని పేదలను, ప్రజల్ని ఐక్యం చేసి కదిలించాలని ఆయ‌న పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభ ఆదివారం మహబూబ్ నగర్(అచ్యుతానందన్, సునీత్ చోప్రా నగర్‌)లో ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌తినిధుల స‌భ‌లో విజ‌య రాఘ‌వ‌న్ ప్రారంభోప‌న్యాసం చేస్తూ.. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనీ, మోడీ సర్కారు దేశాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తున్నదని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ భూ పోరాటాల గడ్డ అని పేర్కొంటూ.. ఖమ్మం జిల్లాలోని ముదిగొండ పోరాటాన్ని, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో జరిగిన పోరాటాలను ప్రస్తావించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. యూపీఏ- 1 ప్రభుత్వ హయాంలో వామపక్షాల ఒత్తిడి మేరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చిందనీ, ఆనాడు పార్లమెంట్లో వామపక్షాలకు 60 పైగా ఎంపీలు ఉండటం వల్లనే అది సాధ్యమైందని తెలిపారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ఉపాధి హామీ చట్టం ఎంతో దోహద పడిందని చెప్పారు. త్రిపుర, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఉపాధి ద్వారా ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరిందని చెప్పారు.

ఇప్పుడు పార్లమెంట్ లో వామపక్ష పార్టీల ఎంపీలు పదిమందిలోపే ఉన్నారని.. వారు తప్ప మిగతా వారెవ్వ‌రూ వ్యవసాయ కార్మికులు, పేదల గురించి మాట్లాడ‌టం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ్రామీణ ప్రజల కొనుగోలు స్థాయిని పెంచిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి మోడీ సర్కారు పూనుకున్నదని విమర్శించారు. వీబీ గ్రామ్‌జీ పథకాన్ని తీసుకొచ్చి కూలీల ఉపాధిని దెబ్బ కొడుతున్నదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ పథకం అమల్లో భాగంగా 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ముందు ఖర్చు పెడితేనే ఆ తర్వాత కేంద్రం వాటా 60 శాతాన్ని ఇస్తామని చెప్పడం దుర్మార్గమ‌ని అన్నారు. ఇప్పటికే మోడీ సర్కారు రాష్ట్రాల ఆదాయ వనరులపై దెబ్బ కొట్టిందని తెలిపారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాలు 40 శాతం నిధుల భారాన్ని ఎలా భరిస్తాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టలేదనే నేపంతో పేదలకు పని కల్పించకుండా చేయ‌ట‌మే దీని ఉద్దేశ‌మ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సనాతన హిందూత్వ ముసుగులో దళితులపైన దేశంలో జరుగుతున్న దాడులను విజ‌య రాఘ‌వ‌న్ ఈ సంద‌ర్భంగా ఎత్తిచూపారు.

ఓవైపు బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూనే మరోవైపు ప్రాంతీయ పార్టీలను చీల్చి రాజకీయ పబ్బం గ‌డుపుకుంటోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆ పార్టీ కులం, మతం, ధన ప్రభావంతో రాజకీయాలను ప్రభావితం చేస్తున్న తీరును వివరించారు. ఈ అంశాలపై ప్రజలను చైతన్యపరిచి వారి పక్షాన నిజంగా పోరాడుతున్న వారి వైపు మొగ్గు చూపేలా ఉద్య‌మాల‌ను నిర్మించాల‌ని సూచించారు. త‌ద్వారా వామపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులను ఎక్కువగా గెలిపించేలా చూడాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలను బీజేపీ వైపు మళ్ళిస్తున్న తీరును ఆయ‌న వివరించారు. దాని ఫలితంగానే బీహార్‌, ప‌శ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. కాషాయ పార్టీ గ్రామస్థాయి నుంచి మతోన్మాద భావజాలాన్ని విస్తరిస్తున్న తీరును, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి నిర్మాణానికి ఆటంకంగా మారుతున్న తీరును విశ‌దీక‌రించారు. వామపక్ష పార్టీలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడం కోసం వ్యవసాయ కార్మిక సంఘం గ్రామీణ పేదల సంఘం మారాలని ఆకాంక్షించారు.

​పాల‌న‌లో బిగ్ బ్ర‌ద‌ర్‌కు.. యంగ‌ర్ బ్ర‌ద‌ర్‌కు తేడా లేదు…
విధానాల పరంగా చూస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదని విజ‌య రాఘ‌వ‌న్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో బిగ్ బ్రదర్ (మోడీ), హైద‌రాబాద్‌లో యంగ‌ర్‌ బ్రదర్ (రేవంత్ రెడ్డి) ఒకే తీరుగా వ్యవహరిస్తున్నారని ఆయ‌న దెప్పి పొడిచారు. సెక్యులరిజం ప్రజాస్వామ్యం అనే మౌలిక విలువలకు మోడీ స‌ర్కార్ తూట్లు పొడుస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది సామాన్యుల ప్రభుత్వం కాదు.. కార్పొరేట్ల ప్రభుత్వమని విమ‌ర్శించారు. దేశంలోని 75% ఎఫ్‌.సీ.ఐ గోదాము ల‌ను అదానీకి క‌ట్ట‌బెట్టటం దారుణ‌మ‌న్నారు. గోదాములను అదానీ, మాల్స్‌ను అంబానీ తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. దేశంలో రూపాయి విలువ రోజురోజుకీ పడిపోతున్నదని, అదే సమయంలో నిత్యవసర సరుకులు ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -