Monday, June 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిప‌క్ష పాలిత రాష్ట్రాల‌తో ఉమ్మడి కార్యాచరణ

విప‌క్ష పాలిత రాష్ట్రాల‌తో ఉమ్మడి కార్యాచరణ

- Advertisement -

అవసరమైతే సుప్రీంకోర్టులో కేసు వేద్దాం
వీబీ జీ గ్రామ్‌‌పై క్యాబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ నిర్ణయం

బీజేపీయేతర రాష్ట్రాల‌తో 
క‌లిసి ఉమ్మడి కార్యాచరణ

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వీబీ జీ గ్రామ్‌ చట్టం-2025పై విప‌క్ష పాలిత రాష్ట్రాల‌తో క‌లిసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త చట్టం అమలుతో ఏర్పడే ప్రభావాలు, రాష్ట్రాలపై పడే ఆర్థిక భారం తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ఆదివారం హైదరాబాద్‌‌లోని బీఆర్‌.అబేడ్కర్‌ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మంత్రులు ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క‌, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. బీజేపీయేతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడిగా కేంద్రంపై పోరాడాలని నిర్ణయించారు. న్యాయపరంగా, రాజ్యాంగపరంగా సవాల్ చేసే అవకాశాలపై సమావేశంలో చర్చ జరిగింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలతోనూ సంప్రదింపులు జరపాలని సమావేశం నిర్ణయించింది. కర్ణాటక, కేరళ, జార్ఖండ్, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలతో మాట్లాడి ఉమ్మడి కార్యాచరణ రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. వీబీ జీ గ్రామ్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని కూడా పరిశీలించాలని సమావేశం అభిప్రాయపడింది. ఉపాధి హామీ పనులను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాల్సిన అవసరంపై సభ్యులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి గాంధీ పేరును తొలగించడం సముచితం కాదన్నారు. గ్రామీణ పేదలకు ఉపాధి హక్కును అందించిన చారిత్రాత్మక పథకానికి ఆయన పేరు కొనసాగాలని సభ్యులు పేర్కొన్నారు.

సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం 40 శాతం నిధుల భారాన్ని మోపడం అప్రజాస్వామికమని సమావేశం అభిప్రాయపడింది. అర్టిక‌ల్ 258(3) ప్ర‌కారం..రాష్ట్రాల‌పై కేంద్రం అద‌న‌పు భారం మోపే ప‌క్షంలో జ‌రిగే న‌ష్టాన్ని కేంద్రం భ‌ర్తి చేయాల్సి ఉంటుంద‌ని రాజ్యంగం స్ప‌ష్టం చేస్తుందని స‌భ్యులు అభిప్రాయ‌ప‌డ్డారు. 16 ఫైనాన్స్ క‌మీష‌న్ సిఫార్సులు, రాష్ట్రాల ఆర్దిక హ‌క్కులు హ‌రించే విధంగా ఉన్నాయ‌నీ, మెరుగైన ఫ‌లితాలు సాధిస్తున్న రాష్ట్రాల‌కు న‌ష్టం చేసే విధంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ప‌న్నుల రూపంలో కేంద్రానికి వెళుతున్న ప్ర‌తి రూపాయికి తిరిగి 40 పైస‌లే వెన‌క్కి వ‌స్తున్నద‌నీ, అలాంట‌ప్పుడు కొత్త చట్టం పేరుతో 40 శాతం నిధుల భారాన్ని రాష్ర్టంపై మోపడం ఆమోద‌యోగ్యం కాద‌న్నారు. ప్రభుత్వానికి సమగ్ర సిఫార్సులు అందించేందుకు అంశాల వారీగా అధ్యయనం కొనసాగించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. గ్రామీణ సంక్షేమం, ఉపాధి భద్రత, రాష్ట్రాల హక్కుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని తుది నివేదిక రూపొందించనున్నట్టు వెల్లడించింది. మరో రెండు మూడు రోజుల్లో మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనుంది. ఈ స‌మావేశంలో పంచాయ‌తీ రాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి దాన‌కిషోర్, క‌మిష‌నర్ దివ్యా దేవ‌రాజ‌న్, స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీ ల‌క్ష్మీ, జాయింట్ క‌మిష‌న‌ర్ న‌ర్సింహులు ఇతర అధికారులు పాల్గోన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -