రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ శాసనసభ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. మంత్రి మండలి ఒకట్రెండు రోజుల్లో నిర్ణయమవుతుంది. ఈ క్రమంలో త్వరలోనే అసెంబ్లీ సమావేశం కానుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికైన ఈ సభను… దేవాలయాలు, మసీ దులు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలకంటే పవిత్ర మైనదిగా సామాజికవేత్తలు పేర్కొంటారు. తెలంగాణ తొలి సర్కారు ఏర్పడగానే 2014లో ఆనాటి సీఎం, నేటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్… దేశంలోనే అత్యంత ఆదర్శవంతమైన శాసన సభగా రాష్ట్ర అసెంబ్లీని తీర్చుదిద్దుతామని వ్యాఖ్యానించిన విషయం ఆనాటి సభను చూసిన వారం దరికీ విదితమే. స్వాతంత్య్రకాలం నాటి మహా నాయకు లను, వారు చట్టసభల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించిన తీరును ఆయన మననం చేసుకున్నారు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్యను సైతం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పేదలకు కూడు, గూడు, గుడ్డని అందించటమనేది ప్రభుత్వాల ప్రాథమిక లక్ష్యాలుగా ఉండాలంటూ సుందరయ్య సభలో ప్రస్తావించిన విష యాన్ని ఆయన ఆనాడు ఉటంకించారు. అంతిమంగా విజ్ఞత, దక్షత, బాధ్యతతో కూడి రాజకీయాలకు అతీ తంగా శాసనసభను నడుపుతామంటూ బీఆర్ఎస్ అధి నేత నొక్కి వక్కాణించిన విషయం విదితమే.
ఆ తర్వాత గత పదేండ్ల చరిత్రను చూస్తే ‘ఏ శాస నసభా సమావేశాన్ని చూసినా ఏమున్నది గర్వకారణం.. దూషణ, భాషణల పర్వం, పద్దులన్నీ గిలెటన్లయిన వైనం…’ అనే రీతిలో పరిస్థితి తయారైంది. సభకు దక్కా ల్సిన గౌరవం, ఔన్నత్యం దక్కలేదని చెప్పక తప్పదు. తొలి రోజుల్లో కేసీఆర్ చెప్పినట్టు కొంతలో కొంత బెటర్‌గా నడిచినా, ఆ తర్వాత గాడితప్పి… ప్రతిష్టలు, అహంభా వాల నడుమ ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీని తలపించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత… ప్రతిపక్షాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఎమ్మెల్యే లను చేర్చుకోవటంలో దాని సంఖ్యాబలం వందకు చేరింది. ఈ మందబలంతో విపక్షాలను లెక్క చేయ కుండా.. ఎదురుదాడే లక్ష్యంగా సభాపర్వం కొనసాగింది. ప్రభుత్వాన్ని నిలదీసే ఎర్రజెండాలు లేకపోవటం, ఉన్న కొద్దిపాటి విపక్ష సభ్యులు సైతం సమస్యలపై అధ్య యనం చేయకపోవటంతో అధికార పార్టీ ఆడిందే ఆట గా, పాడిందే పాటగా నడిచింది. కీలక బిల్లులన్నీ మూజు వాణీ ఓటుతో, ముఖ్యమైన పద్దులన్నీ గిలెటన్ల రూపంలో ముగిసిపోయాయి. సస్పెండ్లు, బహిష్కరణలతో కాలం పరిసమాప్తమైంది. కేవలం రాజ్యాంగబద్ధంగా, సాంకేతికంగా మాత్రమే సభ నడిచింది తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో కాదనే విమర్శలను గులాబీ ప్రభుత్వం ఎదుర్కోక తప్పలేదు. ఆఖరికి అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలను సైతం వారం రోజుల్లో ముగించటం కేసీఆర్ సర్కారుకు కళంకం తెచ్చిపెట్టింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు కొలువుదీరే సభపై తెలం గాణ నాలుగు కోట్ల ప్రజానీకం కోటి ఆశలు పెట్టుకుంది. లక్షలాది మంది శ్రమ జీవులు, వేలాది మంది ఉద్యోగులు సహా సకల సబ్బండ వర్గాలు, రైతులు, మహిళలు, యువ త సమస్యలు లెక్కకు మిక్కిలిగా పేరుకుపోయాయి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఆషాలు, అంగన్వాడీ లతోపాటు అనేక మంది క్షేత్రస్థాయి సిబ్బంది తమ కోర్కెలను కొత్త ప్రభుత్వం తీరుస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. సభా నిర్వహణ కోసం ప్రభుత్వం నిమి షానికి రూ.ఏడు వేలు (ఎమ్మెల్యేల టీఏ, డీఏలు, బందో బస్తుకు వచ్చిన పోలీసులకు అలవెన్సులు, విద్యుత్, నీటి సరఫరా, వాహనాలకు ఇంధనం ఖర్చు, భోజనాలు వగైరా) ఖర్చు చేస్తోంది. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పటి అంచనా. ఈ ఖర్చు ఇప్పుడు నిమిషానికి రూ.10 వేలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీన్నిబట్టి సభ జరిగినన్ని రోజులూ ఎంత ప్రజాధనం ఖర్చవుతుందో అర్థం చేసు కోవచ్చు. ఇంత వ్యయ, ప్రయాసలకోర్చి సభను నిర్వ హిస్తున్న దరిమిలా.. త్వరలో ఏర్పడబోయే తెలంగాణ మూడో శాసనసభ కొంగొత్త దారి చూపాలి. సమస్యలపై చర్చకు, పరిష్కారానికి అది వేదిక కావాలి. ప్రశ్నించే ప్రజా గొంతుకలకు స్వేచ్ఛని వ్వాలి. అలాగాక ‘మీరు గతంలో ఇలా చేశా రు కాబట్టి..మేం ఇప్పుడు అంతకు రెట్టింపు చేస్తాం…’ అనే రీతిలో వ్యవహరిస్తామంటే ప్రజల ఆశలు, ఆకాంక్షలపై నీళ్లు జల్లినట్టే. ఆ రకమైన వ్యవహారశైలి సభకు ఎంత మాత్రమూ గౌరవాన్ని తెచ్చిపెట్టదు. కాబో యే ప్రభుత్వాధీశులు ఇక్కడో విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి… కేరళలో గత శాసనసభలో బీజేపీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండేవారు. సైద్ధాంతికంగా అధికారంలో ఉన్న సీపీఐ(ఎం)కు, కమలం పార్టీకి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ ఆ రాష్ట్రా నికి వరదలు వచ్చిన సమయంలో ప్రజలె న్నుకున్న బీజేపీ శాసనసభ్యుడిని గుర్తించి, గౌరవించి… సీఎం పినరయి విజయన్ తనతో పాటు ఆయన్ను కూడా ఏరియల్ సర్వేకు తీసుకెళ్లారు. ఇదీ ప్రతిపక్షాలను గౌరవించే పద్ధతి.. ఆయా సభ్యులకు ఇచ్చే మర్యాద. సభను సజావుగా నడపటానికి అధికారపక్షం ఈ ఒక్క విష యాన్ని గుర్తు పెట్టుకుంటే చాలు…