నేడు మోకిలా లేఅవుట్ ‘ప్రీ-బిడ్’..
మేడిపల్లి ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఆఖరి గడువు
సదస్సులతో రియల్టర్లు, సామాన్య ప్రజల సందేహాల నివృత్తికి అధికారుల కృషి
ఈ-వేలంలో ఎక్కువ మంది పాల్గొనేలా హెచ్‌ఎండీఏ కసరత్తు
రూ.2వేల కోట్లకుపైగా ఆదాయమే లక్ష్యం
మోకిలా, మేడిపల్లి, బంజారాహిల్స్ తో పాటు రంగంలోకి ‘స్ట్రే బిట్స్’
నార్సింగి, సూరారం, చందానగర్ సహా పలు ప్రాంతాల్లో భూముల విక్రయం
నవతెలంగాణ – సిటీబ్యూరో
హైదరాబాద్ మహానగర పరిధిలో భూముల వేలానికి హెచ్‌ఎండీఏ కసరత్తు చేస్తోంది. అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలను ఈ-వేలం ద్వారా విక్రయించి, ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 2500 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా వేలం ప్రక్రియలో భాగంగా నేడు రెండు కీలక ఘట్టాలు చోటుచేసుకోనున్నాయి. మోకిలా లేఅవుట్‌కు సంబంధించి ‘ప్రీ-బిడ్’ సమావేశం నిర్వహించనుండగా, ఆసక్తి గల కొనుగోలుదారులు తమ సందేహాలను ఇక్కడ నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా మేడిపల్లి లేఅవుట్ ప్లాట్ల నమోదు, రుసుము చెల్లింపునకు నేడే ఆఖరి గడువుగా నిర్ణయించారు.
మల్టీపర్పస్ భూములపై కన్ను..
ఈ వేలంలో ప్రధాన ఆకర్షణ బంజారాహిల్స్ సమీపంలోని హకీంపేటలో ఉన్న 8 ఎకరాల 24 గుంటల భారీ భూభాగం, దీని కనిష్ట ధర ఎకరాకు రూ. రూ.99 కోట్లుగా నిర్ణయించారు. దీని ద్వారానే సుమారు రూ. వెయ్యి నుంచి రూ. 1,500 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మోకిలాలోని 100 ప్లాట్లు(గజానికి రూ. 50వేలు కనిష్ట ధర), మేడిపల్లిలోని 68 ప్లాట్ల(గజానికి రూ.45వేలు కనిష్ట ధర) విక్రయం ద్వారా మరో రూ. 400 కోట్లు సమకూరుతాయని భావిస్తున్నారు. వీటితో పాటు గతంలో మిగిలిపోయిన మరికొన్ని బిట్లను కూడా వేలంలో ఉంచనున్నారు.
రంగంలోకి స్ట్రే బిట్స్
ప్రధాన లేఅవుట్లతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో మిగిలిపోయిన ‘స్ట్రే బిట్స్’ విక్రయం ద్వారా రూ. 500 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా.. నార్సింగి: 5,687 చదరపు గజాల భూమి ఉండగా, సూరారం (కుత్బుల్లాపూర్) 4,840 చదరపు గజాలు, బైరాగిగూడలో (గండిపేట) 2,420 చదరపు గజాలు, బౌరంపేటలో (మేడ్చల్) 2,420 చదరపు గజాలు, పీర్జాదిగూడలో(మేడిపల్లి) 2,057, 726 చదరపు గజాల ప్లాట్లు, చందానగర్ (శేరిలింగంపల్లి) 484 చదరపు గజాల స్థలం వేలానికి రానున్నాయి.
పారదర్శకతకు పెద్దపీట
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ ద్వారా ఈ వేలం ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగనుంది. ఆసక్తి గల వారు నేడు మేడిపల్లి రిజిస్ట్రేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో త్వరపడాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాల కోసం www.hmda.gov.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలున్న ఈ ప్లాట్ల కోసం అటు రియల్టర్లు, ఇటు సామాన్య కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పోటీ సైతం భారీ స్థాయిలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే గతంలో కోకాపేట్‌లోని నియోపొలిస్ లేఅవుట్ ప్లాట్ల వేలం ద్వారా సుమారు రూ.3,800 కోట్ల ఆదాయాన్ని హెచ్‌ఎండీఏ రాబట్టుకుంది.
24 నుంచి హెచ్‌ఎండీఏ మెగా వేలం షురూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



