Monday, June 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభద్రాచలం ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చాలి

భద్రాచలం ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చాలి

- Advertisement -

డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలి
మౌలిక సదుపాయాలు కల్పించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలనీ, ఖాళీగా ఉన్న డాక్టర్‌ ‌పోస్టులను ఇతర సిబ్బందిని నియమించాలనీ, మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ సీఎం రేవంత్‌‌రెడ్డికి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం, విద్యా రంగాలను పటిష్టం చేయాలని, తగిన నిధులు కేటాయించాలని కోరుతూ, తమ పార్టీ నాయకత్వంతో కలిసి ఈ నెల 10న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించామని గుర్తు చేశారు. ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న భద్రాచలం ఏరియాలో ఈ ఆసుపత్రి ఎంతో కీలకమైందని తెలిపారు. ఆ ఆస్పత్రికి 80 శాతం మంది ఆదివాసీలే వైద్యం కోసం వస్తారని పేర్కొన్నారు. ఐటీడీఏ నిధులు కూడా ఈ ఆస్పత్రికి కేటాయిం చడంలేదని తెలిపారు. ఆ సందర్శన సందర్భంగా గుర్తించిన కొన్ని ముఖ్యమైన సమస్యలను మాత్రమే సీఎం దృష్టికి తెస్తున్నామని తెలిపారు. వాటిని తక్షణమే పరిష్కరించాలనీ, తగిన నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.ఆస్పత్రిలో మొత్తం 62 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట, కేవలం 22 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా సివిల్ సర్జన్లు 16 మంది ఉండాలి, కానీ ముగ్గురు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 37 మంది ఉండాలి, 23 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు.

(వారిలో 17మంది కాంట్రాక్ట్, 6గురు రెగ్యులర్, అందులో 6 గురు డిప్యూటేషన్‌పై వెళ్ళారు).ఆర్థోపెడిక్ ఇద్దరు ఉండాలి, ఒక్కరే ఉన్నారని పేర్కొన్నారు. పిల్లల వైద్యులు నలుగురు ఉండాలి, ఇద్దరే ఉన్నారనీ, ఇఎన్‌టీ ఇద్దరు ఉండాలి, ఒక్కరే ఉన్నారనీ, డిప్యూటీ సివిల్ సర్జన్లు, జనరల్ సర్జన్లు, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ (స్కిన్) డాక్లర్లతో పాటు, ఆయుర్వేదం, హోమియో విభాగాల్లో ఒక్క డాక్టర్ కూడా లేరని తమ పరిశీలనలో తేలిందని గుర్తు చేశారు.53 మంది నర్సింగ్ సిబ్బందికి గాను కేవలం 28 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. (13మంది రెగ్యులర్, 15మంది డిప్యూటేషన్‌పై వచ్చారు). చిల్డ్రన్స్ ఐసీయూకు 14మంది నర్సింగ్ స్టాఫ్‌కు 9 మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఒక స్టాఫ్ నర్స్ మూడు వార్డులు చూసుకోవాల్సి రావడంతో, వీరికి పని ఒత్తిడి పెరిగిందని తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్లు ఏడుగురికి ఐదుగురు, ఫార్మసిస్టులు 10 మందికి ముగ్గురు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. బ్లడ్ బ్యాంక్, రేడియాలజిస్టులు ఎవరూ లేరని గుర్తు చేశారు.

శానిటేషన్ వర్కర్లు 160 మందికి కేవలం 85 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. వీరిపై పని భారం ఎక్కువగా ఉన్నా కేవలం రు.11వేలు మాత్రమే వేతనం ఇస్తున్నారని పేర్కొన్నారు. వీరికి కనీస సౌకర్యాలు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. 200 పడకల ఆస్పత్రిలో 250 మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారనీ, వాటిల్లో రెండు అంబులెన్స్‌లు ఉన్నప్పటికీ, అందులో ఒకటి గత రెండేండ్లుగా రిపేరులో ఉందని తెలిపారు. హాస్పిటల్ డెవలప్‌మెంట్ ఫండ్ లేకపోవడంతో ఆ అంబులెన్స్‌ను రిపేరు చేయించలేకపోతున్నారని గుర్తు చేశారు. తక్షణమే ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రాచలం ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఖాళీ పోస్టుల భర్తీతో పాటు మందుల సరఫరా చేయాలని కోరారు. ఆధునికమైన యంత్రాలను ఇవ్వాలనీ, శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలనీ, అడ్వాన్స్ ట్రామా సెంటర్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -