ఉద్యోగ భద్రత కరువు
సమానపనికి సమానవేతనం లేక ఇబ్బందులు
ఏజెన్సీల కమీషన్లతో సతమతం
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటయ్యేనా?
ప్రభుత్వ నిర్ణయం కోసం ఎంప్లాయీస్ ఎదురుచూపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మనోవేదన చెందుతున్నారు. కనీస వేతనాలు అమలు కాక, ఉద్యోగ భద్రత లేక సతమతమవుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమానపనికి సమాన వేతనం అమలు కావడం లేదు. రాష్ట్రంలో సుమారు ఐదు లక్షలకుపైగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులున్నారు. ప్రభుత్వం నెలకు ఒక్కొక్కరికి రూ.30 వేల వేతనం చొప్పున ఏజెన్సీలకు చెల్లిస్తుంది. ఆ ఏజెన్సీలు నాలుగు నుంచి ఆరు శాతం కమీషన్ తీసుకుంటున్నాయి. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ నిధులతోపాటు 18 శాతం జీఎస్టీని మినహాయించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు.
దీంతో ఒక్కో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి ప్రతినెలా వేతనం రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకే అందుతున్నది. అది కూడా ప్రతినెలా సకాలంలో చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతున్నది. కుటుంబ అవసరాలు, ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చుల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తున్నది. పేరుకు ప్రభుత్వ ఉద్యోగమే అయినా అరకొర జీతాలతో అవస్థలు పడుతున్నారు. ఇంకోవైపు ఏజెన్సీల కమీషన్ల వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పిస్తూ ఆరోగ్య కార్డులను మంజూరు చేయాలని కోరుతున్నారు.
రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని
రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారు. వీరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. పీఆర్సీ పాలకుల దయాదాక్షిణ్యాల మీద అమలవుతున్నది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతోపాటు ఏటా రూ.వెయ్యి ఇంక్రిమెంట్ ఇవ్వాలని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదే విధంగా మహిళా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులను కొన్ని ఏజెన్సీలు అమలు చేయడం లేదు. దీంతో వారు ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తున్నది. అందుకే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామంటూ రాజకీయ పార్టీలు హామీలిస్తూ వారిని రాజకీయంగా వాడుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భవిస్తే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానం ఉండబోదని బీఆర్‌ఎస్ హామీ ఇచ్చింది. పదేండ్లు అధికారంలో ఉన్నా ఆ విధానాన్ని రద్దు చేయలేదు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక వారి సమస్యలను పరిష్కరించకుండా విస్మరించింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా ప్రయివేటీకరణ విధానాలను వేగంగా అమలు చేస్తున్నది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కృషి చేయడం లేదు.
సమాన పనికి సమాన వేతనమివ్వాలి : జె వెంకటేశ్
రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనమివ్వాలని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు జె వెంకటేశ్ డిమాండ్ చేశారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈలోగా కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని సూచించారు. మహిళా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు.
ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి : డి శ్రీధర్
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని తెలంగాణ జేఏసీ కమిటీ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి డి.శ్రీధర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని కోరారు. అన్యాయంగా తొలగించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు.



