– అందుకే సోషల్ మీడియాకు క్రేజ్
– అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు
– సవరణ అంశాల నోట్ డీపీఆర్వోలకు పంపిస్తాం : మీడియా అకాడమీ చైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-నిజామాబాద్‌సిటీ
సమాజంలోని అంతరాలను మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోనందునే సోషల్ మీడియా క్రేజ్ పెరిగిందని మీడియా అకాడమీ చైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగర ప్రెస్‌క్లబ్ జర్నలిస్టులకు వెల్‌నెస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డుల పంపిణీని న్యూ అంబేద్కర్ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు చెప్పారు. కొత్త జీవో 259పై కొందరు ఆందోళన వ్యక్తం చేయగా.. వాటిని సరిచేశామని చెప్పారు. అందుకు సంబంధించిన వివరాలు జిల్లా స్థాయి వరకు చేరకపోవడంతో కొంత గందరగోళం నెలకొందని, వీటికి సంబంధించిన నోట్‌ను జిల్లాల డీపీఆర్‌వోలకు తక్షణమే పంపిస్తామని తెలిపారు. రాష్ట్రస్థాయి అక్రిడేషన్ కమిటీ సమావేశం నేడు(గురువారం) ఉందని, జిల్లాల్లో 25వ తేదీలోగా అక్రిడేషన్ కమిటీల సమావేశాలు పూర్తి కానున్నట్టు చెప్పారు. సమాజంలో అంతరాలు నెలకొన్నాయని, దేశంలో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతుంటే.. పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారని అన్నారు. అందరికీ విద్య, వైద్యం అందని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు విద్యా, వైద్యం, ఇల్లు, నీరు ఇవ్వకుండా ఏ సమాజమూ ముందుకు సాగదని చెప్పారు. ఈ అంశాలపై మెయిన్‌స్ట్రీమ్ మీడియా పట్టించుకోకపోవడంతో సోషల్‌మీడియాకు క్రేజ్ పెరిగిందన్నారు. ప్రజల మద్దతు లేకుంటే మీడియా మనుగడ కష్టమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రాష్ట్ర కౌన్సిల్ చైర్మెన్ డాక్టర్ కవితా రెడ్డి, డీపీఆర్‌ఓ పద్మశ్రీ, వెల్‌నెస్ ఆస్పత్రి యాజమాన్య ప్రతినిధులు అసద్ ఖాన్, ముబీన్ పటేల్, భార్గవ్, ప్రెస్‌క్లబ్ కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
అంతరాలను పట్టించుకోని మెయిన్ స్ట్రీమ్ మీడియా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



