రాష్ట్ర మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పిల్లల సమగ్ర ఎదుగుదలలో మేఘాలయ రాష్ట్రం మెరుగైన ఫలితాలను సాధిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అభినందించారు. బుధవారం మంత్రితో పాటు ఆ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, జాయింట్ డైరెక్టర్ మోతి మేఘాలయలో అధికారిక పర్యటన నిర్వహించారు. అక్కడ అమలవుతున్న అంగన్వాడి సేవలు, వినూత్న కార్యక్రమాల అనుభవాలను అధ్యయనం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, చిన్నారుల అభివృద్ధి కోసం అమలవుతున్న విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ కేంద్రాలు కేవలం పోషకాహారం అందించే కేంద్రాలుగా కాకుండా, చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కేంద్రాలుగా రూపుదిద్దుకున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఆటల ద్వారా నేర్పే విధానం, సృజనాత్మక వాతావరణం పిల్లల్లో నేర్చుకునే ఆసక్తిని పెంచుతున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా ” మేఘాలయ ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్‌మెంట్ మిషన్ (ఈసీడీఎం)” ద్వారా 0-6 సంవత్సరాల చిన్నారులపై సమగ్ర దృష్టి సారిస్తూ ఆరోగ్యం, పోషణ, విద్య అంశాలను సమన్వయం చేస్తూ అందిస్తున్న సేవలను మంత్రి ప్రశంసించారు.
”1000 డేస్ ప్రోగ్రామ్” అమలులో గర్భధారణ నుంచి శిశువు రెండేళ్లు పూర్తయ్యే వరకు ఉండే తొలి 1000 రోజుల్లో తల్లి-శిశువుకు సమగ్ర సేవలు అందించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గిస్తూ, ఆరోగ్యవంతమైన అభివృద్ధిని సాధిస్తున్నారని మంత్రి తెలిపారు. ఆసక్తి ఉన్న యువతకు మినిస్ట్రీ ఆఫ్ స్కిలింగ్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారిని కమ్యూనిటీ వాలంటీర్లుగా తయారు చేసి భాగస్వామ్యం కల్పిస్తున్నారని చెప్పారు. వారు తమ పరిధిలోని చిన్నారుల తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి, ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలా బోధించాలి, అభ్యసన పద్ధతులు ఎలా ఉండాలి అనే అంశాలపై సమగ్ర మార్గదర్శకత్వం అందిస్తున్నారని వివరించారు. శిశువు మొదటి మూడేండ్లు 75 శాతానికి పైగా మెదడు నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని గుర్తించి, తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారన్నారు.
అంగన్వాడీ టీచర్లతో పాటు అదనంగా వాలంటీర్లు వ్యవస్థీకతంగా పనిచేయడం, సమాజం మొత్తాన్ని ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం మేఘాలయ మోడల్‌కు ప్రత్యేకతను తీసుకువచ్చిందని మంత్రి తెలిపారు. ఈ విధానాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో, మేఘాలయలోని ఈ అనుభవాలను తెలంగాణలో అన్వయించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
పిల్లల సమగ్ర ఎదుగుదలలో.. మేఘాలయ మెరుగైన ఫలితాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



